ఆకలి కేకలు


కష్టాల్లో సాక్షర భారత్ సమన్వయకర్తలు

 ఇచ్చేది అరకొర జీతం.. అదీ  10 నెలలుగా అందని వైనం

తెరుచుకోని వయోజన విద్యా కేంద్రాలు


 

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ద్దుతున్న సాక్షర భారత్ సమన్వయకర్తలు ఆకలికేకలు పెడుతున్నారు. అసలే చాలీచాలని వేతనాలతో జీవనం వెళ్లదీస్తున్న వీరికి ఆ మొత్తం కూడా సకాలంలో   విడుదల కాకపోవడంతో కష్టాల కడలిని కన్నీళ్లతో ఈదాల్సిన దుస్థితి నెలకొంది. పది నెలలుగా వీరికి  వేతనాలు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో సకాలంలో వయోజన విద్యా కేంద్రాలు తెరుచుకోవటం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం కుంటుపడుతోంది.

 

నర్సీపట్నం: వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు సాక్షర భారత్ కార్యక్రమం అమలవుతోంది. ఏడేళ్లుగా ఈ పథకం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది.  1,800 మంది గ్రామ సమన్వయకర్తలు, 39 మంది మండల సమన్వయకర్తలు పనిచేస్తున్నారు. వీరు గ్రామాల్లో పర్యటించి సర్వే ద్వారా నిరక్షరాస్యులను గుర్తించి వారిని ప్రాథమిక ఆభ్యాసాల ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. జిల్లాలో 7 లక్షల 80 వేల మంది  నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు.  ఈ పథకం కింద ఇప్పటికి ఐదు దశలు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 3.88 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆరో దశలో జిల్లా వ్యాప్తంగా 63 వేల  మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, ఐకేపీ సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా చేసుకున్నారు.



సాక్షరభారత్ వీసీవోలకు నెలకు రూ.2 వేలు, ఎంసీవలోలకు రూ.6 వేలు చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంది. సుమారు 10 నెలలుగా వీరికి వేతనాలు అందకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా వయోజన విద్య కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి వేతనాల చెల్లింపు ఏడాదికి సుమారు రూ.5 కోట్లు అవసరమున్నా, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదని అధికారులు చెబుతున్నారు.

 

సకాలంలో అందటం లేదు

సకాలంలో వేతనాలు విడుదల కాక ఇబ్బందులు తప్పటం లేదు. ఆరు నెలలకొకసారి, పది నెలలకొసారి మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. అంతంత మాత్రంగా ఇస్తున్న వేతనాలను కూడా సకాలంలో ఇవ్వక పోవడంతో అవస్థలు పడుతున్నాం.                   -ఎం.రమణ, సమన్వయకర్త

 

వేతనాలు విడుదలయ్యాయి   

వేతనాల విడుదలలో జాప్యం  వాస్తవమే. ప్రస్తుతం మండల సమన్వయకర్తలకు మూడు నెలలు, గ్రామ సమన్వయకర్తలకు 6 నెలల వేతనాలు విడుదలయ్యాయి. కొద్ది రోజుల్లోనే  వేతనాలు బట్వాడాచేస్తాం

 -ఎన్.ఆర్.వి.కుమార్,  జిల్లా డిప్యూటీ డెరైక్టర్, వయోజన విద్య

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top