నకిలీ సర్టిఫికెట్ల హల్‌చల్


  •   కార్యదర్శులు, మాజీ కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ

  •   రియల్ వ్యాపారుల దందా

  •   పట్టించుకోని రెవెన్యూ అధికారులు

  • భూముల ధరలకు రెక్కలొచ్చిన నేపథ్యంలో రియల్ వ్యాపారులు కొత్తరకం మోసాలకు  తెరలేపుతున్నారు. భూములు, స్థిరాస్తుల క్రయ, విక్రయాల లావాదేవీలు నడపడానికి కొంతమంది రియల్ వ్యాపారులు సంబంధిత గ్రామ పంచాయతీ సిబ్బంది సంతకాలను ఫోర్జరీ చేసి  దొంగ ధ్రువీకరణ పత్రాలతో తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఈ విషయం కానూరు పంచాయతీ కార్యదర్శి అప్పల నరసమ్మ సంతకంతో ఓ దొంగ ధ్రువీకరణ పత్రం పుట్టుకు రావడంతో బట్టబయలైంది.

     

    పెనమలూరు : మండల పరిధిలో గతంలో ఎందుకు పనికి రావని  వదిలేసిన పొలాలు, భూములకు సైతం బాగా విలువ పెరిగింది. అయితే సంబంధిత భూములకు సరైన డాక్యుమెంట్లు లేకపోవడం, ప్లాన్లు మంజూరు చేసుకోవడానికి సరైన పత్రాలు లేకపోవడం,పొలం యజమానులు చనిపోతే వారి మరణ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆక్రమాలకు రియల్ వ్యాపారులు,పలువురు భూ యజమానులు  తెరలేపుతున్నారు.



    దీంతో అక్రమార్కులు ఏకంగా  నకిలీ ఫార్మెట్లతో పోర్జరీ సంతకాలు చేసి తొంగ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నారు. అలాగే నకిలీ స్టాంపులతో  సైతం పనులు చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సరిగా క్రాస్ చెకింగ్ లేకపోవడంతో వీటిని యథేచ్ఛగా  చలామణి చేస్తున్నారనే మిమర్శలున్నాయి.

     

    కానూరు కార్యదర్శి సంతకం ఫోర్జరీ...



    మేడసాని వెంకట కోటేశ్వరరావు అనే వ్యక్తి 1978లో చనిపోతే అతని మరణ ధ్రువీకరణ పత్రాన్ని కానూరు గ్రామ కార్యదర్శి అప్పలనరసమ్మ గత ఏప్రిల్ నెలలో జారీ చేసినట్లు  గ్రామ మాజీ సర్పంచికి ఓ వ్యక్తి తీసుకువచ్చి ఇచ్చాడు. ఈ విషయాన్ని  ఆయన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా  పరిశీలించిన ఆమె సర్టిఫికెట్‌పై  ఉన్న తన సంతకం,స్టాంపులు అన్ని దొంగవేనని  ధ్రవీకరించారు.పోరంకికి చెందిన ఓ  రియల్ వ్యాపారి ఈ పనిచేశాడని తేలింది.



    ఇలాగే పోరంకి, కానూరు, తాడిగడప తదితర గ్రామాల్లో గతంలో పని చేసిన కార్యదర్శులు, ప్రస్తుత కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా నిఘా అధికారులు విచారణ చేస్తే నకిలీ సిర్టిఫికెట్లు సృష్టిస్తున్న అసలు సూత్రదారుల గుట్టు బట్టబయలవుతుందని స్థానికులు చెబుతున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top