పేదల బియ్యంపై హుదూద్ పంజా!

పేదల బియ్యంపై  హుదూద్ పంజా!


విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ తుపాను భవిష్యత్‌పై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. రేషన్ డిపోల ద్వారా పేదలకందించే బియ్యాన్ని ఎలా సేకరించాలో తెలియని పరిస్థితుల్లో అధికారులున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా లెవీ సేకరణ చేసి పేదోడికి పట్టెడన్నం పెట్టే రేషన్ బియ్యం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. మారిన లెవీ నిబంధనల ప్రకారం పౌరసరఫరాల శాఖ ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రకృతి సహకరించలేదు. లెవీ సేకరణ లక్ష్యాన్ని డిసెంబర్‌లో నిర్ణయిస్తారు. సేకరణ విధానం మారడంతో ముందుగా మేల్కొన్న జిల్లా అధికారులు లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికలు వేశారు. అయితే భీకర గాలులతో విరుచుకుపడిన హుదూద్ వల్ల లెవీ సేకరణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 28 వేల పైచిలుకు హెక్టార్లలో వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి.

 

 దీంతో ధాన్యం దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్త నిబంధనల ప్రకారం 25 శాతం మిల్లర్లు, 75 శాతం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్కసారిగా భారం  పెరిగినా...సేకరణ ప్రభావం ప్రజాపంపిణీపై పడకుండా ముందుగానే ధాన్యం కొనుగోలు చేయాలని యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను జిల్లాలోని మహిళా సంఘాలు, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల సూచి పెంచిన ధరల మేరకే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అధికారుల నిర్ణయం మేరకు గ్రేడ్ ఁఎరూ. రకం క్వింటాలుకు రూ.1400, కామన్ గ్రేడ్ రకం రూ.1360 గా ధర నిర్ణయించారు. పెంచిన కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరతోనే ఈ ఉత్పత్తులను సేకరించాలని నిర్ణయించారు. అంతే కాకుండా  అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహించి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

 

 డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మహిళా సంఘాల ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు, డీసీసీబీ ఆధ్వర్యంలోని సహకార సంఘాల ద్వారా 46 కేంద్రాలు ఏర్పాటు చేసి, మొత్తం 60 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేద్దామనుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 2.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసింది. అయితే అధికారుల అంచనాలను హుదూద్ తలకిందులు చేసింది. అసలే ఖరీఫ్ ఆలస్యం కావడం మరో పక్క  వరి పంట తుపానుతో దెబ్బ తినడం వంటి పరిణామాలతో దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది  దిగుబడి రెండు లక్షల మెట్రిక్ టన్నులయినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారుల అంచనా. గత ఏడాది ధాన్యం దిగుబడి 3.24 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేసి,  ఇందులో స్థానిక అవసరాలకు గాను 30 శాతం మినహాయించి 1.81 లక్షల టన్నుల  లెవీ సేకరణను పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

 

 కానీ 1.46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లెవీ సేకరణ చేశారు. ఈ ఏడాది తుపాను, మారిన విధానం కారణంగా లెవీ సేకరణలో ఇబ్బందులు తప్పవని యంత్రాంగం భయపడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం మిల్లర్లు తాము సేకరించిన ఉత్పత్తుల్లో 25 శాతం మాత్రమే ప్రభుత్వానికి ఇస్తారు. దీంతో ప్రజాపంపిణీకి బియ్యం సరిపడని ప్రమాదముంది. సాధారణంగా దిగుబడి బాగా ఉన్నప్పుడే ధాన్యం సరిపడని పరిస్థితి నెలకొంటే ఇప్పుడీ తుపాను దెబ్బకు మరింత దిగుబడి తగ్గిపోయి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని అంటున్నారు. అంతే కాకుండా తుపాను సాయం కింద ఇప్పటికే ఉన్న లెవీ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయడంతో మరింత లోటు ఏర్పడింది. అంతే కాకుండా మిల్లర్లతో పోటీ ఉండనే ఉంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని ప్రజాపంపిణీకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మిల్లర్ల పోటీని తట్టుకోవాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో ధాన్యం కొనుగోలులో పౌరసరఫరాల శాఖతో మిల్లర్లు పోటీ పడి ధాన్యం దొరక్కుండా చేసే ప్రమాదం ఉంది.

 

 ఈ ఏడాది లెవీ సేకరణ కష్టమే

 జిల్లాలో ఈ ఏడాది 2.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని మొదట అంచనా వేసినా, తుపాను గాలులకు వరి దుబ్బులు, వెన్నెలు దెబ్బతిన్నాయి. దీంతో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గే పరిస్థితులున్నాయి. తద్వారా లెవీ సేకరణ కూడా తగ్గనుంది.

  -  భాస్కర శర్మ, అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్),

 పౌరసరఫరాల శాఖ కార్యాలయం, విజయనగరం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top