వివక్ష.. అక్రమాలు తేటతెల్లం!


 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  హుదూద్ తుపాను విజయనగరం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఉన్నోడు లేనోడు అని కాకుండా అందరికీ నష్టం వాటిల్లింది. ఒక్కొక్కరినీ ఒక్కో రూపంలో నష్టపరిచింది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కొనుగోలు చేద్దామన్నా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో రోజురోజుకూ వెల్లువెత్తుతున్న ఆవేదనను దృష్టిలో పెట్టుకుని సర్కార్ స్పందించింది. తక్షణ సాయం కింద సరుకులు విడుదల చేసింది. పెరిగిన  ధరలు నియంత్రించాలంటే యుద్ధ ప్రాతిపదికన నిత్యావసర సరుకులను ఉచితంగా ఇవ్వాలని  నిర్ణయించింది.

 

 కాకపోతే పంపిణీకొచ్చేసరికి వివక్ష చోటు చేసుకుంది. తొలుత పంపిణీ కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసింది. ఇక, గులాబీ కార్డుదారులకు, రేషన్‌కార్డుల్లేని వారికి మొండి చేయి చూపింది. వారికి ఒక్కబియ్యం గింజ కూడా అందని పరిస్థితి నెలకొంది. ఇక, తక్షణ సాయంలోనూ పలువురు డీలర్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నాయకుల అండతో ఒక్కొక్క కార్డుదారుని నుంచి ఐదేసి కిలోలను వెనకేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా గోనెసంచి కోసం రూ.20 వసూలు చేస్తూ తుపాను బాధితులను దోపిడీ చేస్తున్నారు.హుదూద్ దెబ్బకు జిల్లాలోని 12 మండలాలు పూర్తిగా, 22 మండలాలు పాక్షికంగా నష్టపోయినట్టు అధికారులు గుర్తించారు. తీవ్ర ప్రభావం ఉన్న మండలాల్లో  25 కిలోల బియ్యం, మూడు కిలోల బంగాళ దుంపలు, రెండు కిలోల ఉల్లిపాయలు, కిలో చక్కెర, అర కిలో కారం,

 

 కిలో ఆయిల్, కిలో ఉప్పు, రెండు కిలోల కందిపప్పు, ఐదు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయాల్సి ఉంది. పాక్షికంగా దెబ్బతిన్న మండలాల్లో 10 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో ఉప్పు, కిలో పామాయిల్, కిలో కందిపప్పు పంపిణీ చేయాలి.  అయితే, కందిపప్పు జిల్లాకు రాలేదు. దీంతో మిగతా సరుకులన్నీ పంపిణీ చేస్తున్నారు.  తెలుపు రేషన్‌కార్డు దారులకు మాత్రమే పంపిణీ చేసి, గులాబీ కార్డుదారులకు, రేషన్‌కార్డుల్లేని వారికీ మొండి చేయి చూపుతున్నారు. పక్కనున్న విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం తెలుపు, గులాబీ అనే తేడా చూడకుండా రేషన్‌కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేస్తున్నారు. రేషన్‌కార్డుల్లేని వారికీ కూడా ఏదొక గుర్తింపు పత్రం చూసి సరుకులిస్తున్నారు. కానీ, జిల్లాలో తెలుపు రేషన్‌కార్డుదారులకు తప్ప మరెవ్వరికీ నిత్యావసర సరుకులు ఇవ్వడం లేదు. దీంతో 45 వేల మందికి సాయమందని పరిస్థితి నెలకొంది. ఇప్పుడా సరుకులేమయ్యాయన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని నిఘా సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

 

  తక్షణ సాయంలోనూ చేతివాటం

  ప్రభుత్వమందించే తక్షణ సాయంలోనూ పలువురు డీలర్లు కక్కుర్తి పడుతున్నారు. సరుకులన్నింటిలోనూ తూకంలో కోత పెడుతున్నారు. 25 కిలోల బియ్యం పంపిణీ చేసే చోట 5 నుంచి 7 కిలోలు, 10 కిలోల బియ్యం పంపిణీ చేసే చోట 2 నుంచి 3 కిలోలు కన్నం వేస్తున్నారు. ఒక్క బియ్యం విషయంలోనే కాదు మిగతా సరుకులు తూచేటప్పుడూ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే డీలర్లపై జిల్లా అధికారులకు అనేక ఫిర్యాదులొచ్చాయి. గంట్యాడ, గుర్ల, బొబ్బిలి, భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల, డెంకాడ తదితర మండలాల్లోనైతే బాధితులు గోల పెడుతున్నారు.   గంట్యాడ, భోగాపురం, పార్వతీపురంలో కేసులు నమోదయ్యాయి. మెంటాడ మండలం కుంటినవలస, గుర్ల తమ్మిరాజుపేట డీలర్లపై విజయనగరం ఆర్డీఓకు శుక్రవారం ఫిర్యాదులొచ్చాయి.  

 

 గోనె సంచికి రూ.20 వసూలు

 ఇదంతా ఒక ఎత్తు అయితే ఇద్దరేసి కార్డుదారులకు కలిపి 50 కిలోల బస్తాను ఇచ్చినప్పుడు గోనె సంచికోసమని వారి వద్ద నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. వారికి ఉచితంగా అందజేసిన బియ్యం ధర రూ.50. వారి వద్ద నుంచి  రూ.20 వసూలు చేస్తుంటే బాధితులకు అందేది కేవలం రూ.30 సాయం మాత్రమే. బాధితులకు అందజేసిన బియ్యంపై మాఫియా కన్ను కూడా పడింది. ప్రతి నెలా కోటా సరుకు రూపంలో వస్తున్న బియ్యాన్ని డీలర్లు, వ్యాపారులు, మిల్లర్లు వ్యూహాత్మకంగా కొనుగోలు చేసి, రీసైక్లింగ్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు భారీగా బియ్యం విడుదలవడం, ఉచితం కావడంతో కన్నేశారు. అవకాశం ఉన్న చోట పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్లకు పలుచోట్ల టీడీపీ నాయకులు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

 

 అలాగే అమలు చేద్దాం ః కలెక్టర్

 ఇతర జిల్లాల్లో ఇస్తే గనక గులాబి రేషన్‌కార్డులకు తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులను అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. సరుకులు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్‌కు ఆదేశాలిస్తానని చెప్పారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు గులాబీ కార్డు దారులకు సరుకులు అందిస్తామన్నారు.

 

 మేం తుపాను బాధితులం  కాదట

 హూదూద్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయినవారమే. అయినా మాకు గులాబీ రంగు కార్డు  ఉందని నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వడం లేదు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి  అడిగినా గులాబీ రంగు కార్డు  ఉన్నవారికి  ఇవ్వమని  కరాఖండిగా రెవెన్యూ  సిబ్బంది  చెప్పారు. గులాబీ రంగు కార్డు ఉన్నంతమాత్రాన మేం తుపాను బాధితులంకాబోమా... నిత్యవసర  సరుకులు మాకూ ఇవ్వాలి.  

 - వై.జగన్మోహన్‌రావు,

 విశ్రాంత  ఉద్యోగి, జామి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top