గుబాళించని కాఫీ

గుబాళించని  కాఫీ


హుద్‌హుద్ ధాటికి  పంట నాశనం

 భారీగా ధరలు పతనం

 కిలో గింజలు రూ.150




పాడేరు: ఏటా గిరిజన రైతులను ఆదుకుంటున్న కాఫీకి ఈ ఏడాది మన్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. హుద్‌హుద్ ధాటికి ఈ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో కాఫీ గింజలకు రెట్టింపు ధర లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా బ్రెజిల్, వియత్నాం దేశాల్లో కాఫీ దిగుబడులు తగ్గడంతో ఏజెన్సీలో సేంద్రియ పద్ధతిలో పండించిన కాఫీకి బెంగళూరు మార్కెట్‌లో డిమాండ్ ఉండేది. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఆ రెండు దేశాల్లో దిగుబడులు పెరిగాయి. బెంగళూరు మార్కెట్‌లోని పెద్ద వ్యాపారులంతా విదేశాల్లో కాఫీ గింజల కొనుగోలుపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. కిలో రూ.150లకు మించి విజయవాడ వ్యాపారులు ఏజెన్సీలో కాఫీ గింజలను కొనుగోలు చేయడం లేదు. ఏజెన్సీలో లక్షా 40 వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. 96 వేల ఎకరాల్లోని వాటి నుంచి ప్రస్తుతం ఫలసాయం వస్తోంది. గతేడాది 6 వేల టన్నుల కాఫీ గింజల దిగుబడితో రూ.11.40 కోట్ల వ్యాపారం జరిగింది. కిలో రూ.190 నుంచి రూ.210లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది పూత బాగా వచ్చింది.



సుమారు 7 వేల టన్నుల దిగుబడి ఉంటుందని ఐటీడీఏ కాఫీ విభాగం, కేంద్ర కాఫీబోర్డు అధికారులు అంచనా వేశారు. ఈ తరుణంలో హుద్‌హుద్ కారణంగా 30 వేల ఎకరాల్లోని తోటలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం 4,800 టన్నుల దిగుబడి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెండు వారాలుగా కాఫీ గింజల లావాదేవీలు సాగుతున్నాయి. కిలో రూ.140 నుంచి రూ. 150లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు తగ్గడంతో ధర రూ.200 నుంచి రూ.250 మధ్య ఉంటుందని ఆశపడిన గిరిజన రైతులకు నిరాశే మిగిలింది.

 





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top