ఇలా అయితే విలువేముంది


పార్లమెంటు సమావేశాలున్నందున వాయిదా వేయమన్నా మంత్రి అయ్యన్న వినలేదు..

పైగా సొంత పార్టీ వాడినైన నాపైనే విమర్శలు చేశారు

సీఎంకు ఫిర్యాదు చేసిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి

పిలిచి మాట్లాడతానని ఎంపీకి సర్దిచెప్పిన బాబు


 

విశాఖపట్నం: తాను లేని సమయంలో రాష్ర్టమంత్రి అయ్యన్నపాత్రుడు జిల్లాపార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామా నాయుడుతో కలిసి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో శుక్రవారం పెద్ద ఎత్తునఅభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడాన్ని తప్పుబడుతూ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. శనివారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి జిల్లాపార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బాబుకు వివరించారు. ఈ విషయాన్ని శనివారం రాత్రి స్థానిక విలేకర్లకు ఫోన్‌లో తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి  కార్యక్రమాలు చేపట్టవద్దని జిల్లా అధికారులను కోరాను..లిఖితపూర్వకంగా లేఖ కూడా ఇచ్చాను.



అయినాపట్టించుకోలేదు..కార్యక్రమాలను ఆపలేదు. ఇలా అయితేమాకు విలువేం ఉంటుంది..మేము నియోజకవర్గంలో తిరగాలా? వద్దా లేకపోతే ఢిల్లీలోనే కూర్చో మంటే అక్కడే ఉండిపోతాం. అధికారులు మా మాట వినకపోతే ఎలా ఒక ఎంపీనైనా నా మాటకే విలువ లేదు..ఇక పార్టీలో మిగిలిన వారి మాట అధికారులెలా వింటారు. మీరే చెప్పండి అంటూ సీఎంకు ఎంపీ మొరపెట్టుకున్నారు. సీనియర్ మంత్రి అయిన అయ్యన్న ఒక నియోజక వర్గంలో పర్యటించేటప్పుడు ఆ నియోజకవర్గ ఎంపీకి సమాచారం ఇవ్వాలన్న ఆలోనచన కూడా చేయలేదు. పైగా నాపై లేనిపోని ఆరోపణలుగుప్పించారు. పార్టీలో గ్రూపులకు ఆజ్యం పోస్తున్నారు..పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బాధిస్తున్నాయి. మీరు చక్కదిద్దాలి అంటూ సీఎంను కోరినట్టు తెలియవచ్చింది. కాగా ఎంపీ చెప్పిన విషయాన్ని విన్న ముఖ్య మంత్రి చంద్రబాబు మంత్రి అయ్యన్న, జిల్లా పార్టీఅధ్యక్షుడు రామానాయుడ్ని పిలిపించి జరిగిన విషయాన్ని ఆరా తీస్తానని సర్దిచెప్పారు. దీంతో మంత్రుల మధ్య నెలకొన్న విబేధాలు మరింత ముదురి పాకాన పడినట్టయ్యింది. ఈ పరిణామాలు దీనికి దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు మదనపడుతున్నారు.

 

మేం నియోజకవర్గంలో తిరగాలా? వద్దా.. లేకపోతే ఢిల్లీలోనే కూర్చో మంటే అక్కడే ఉండిపోతాం. అధికారులు మా మాట వినకపోతే ఎలా ఒక ఎంపీనైనా నా మాటకే విలువ లేదు.. ఇక పార్టీలో మిగిలిన వారి మాట అధికారులెలా వింటారు.   -అవంతి

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top