వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడమెలా?

వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవడమెలా? - Sakshi


మంత్రులు, ముఖ్య నేతలతో బాబు సమాలోచనలు  అసెంబ్లీ వ్యూహంపై చర్చలు

 

 

హైదరాబాద్: శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిలువరించడంపై అధికార తెలుగుదేశం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. గత రెండు రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనలేకపోయామని అసంతృప్తితో ఉన ్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మంత్రులు, ముఖ్యనాయకులతో పలుమార్లు చర్చలు జరిపారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభ మైన గత రెండురోజుల్లో సభ జరిగిన తీరు, ప్రతిపక్షం నుంచి ఎదురైన దాడి, దాన్ని అధికారపక్షంగా ఎదుర్కొన్న తీరుతెన్నులపై ఆయన శాసనసభలో తన చాంబర్లో, ఆ తరువాత క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. మంగళవారం సభ వాయిదా పడిన తరువాత సభలోపల జరిగిన ఘటనల గురించి చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం, హత్యా రాజకీయాలపై చర్చకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండడంతో సోమవారం పూర్తిగా సభా కార్యక్రమాలు జరపలేకపోగా, మంగళవారం ఒక్క ప్రశ్నోత్తరాల కార్యక్రమం మాత్రమే జరిగింది. తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏడు మిషన్లు, విజన్ డాక్యుమెంటు, శ్వేతపత్రాలపై సభ ద్వారా ప్రజలకు వివరించాలని భావించినా అందుకు అవకాశం చిక్కకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తపరిచారని సమాచారం. రాష్ట్రంలో హత్యారాజకీయాలన్న అంశాన్ని తెరపైకి తేవడంద్వారా ప్రజల్లో ఆ అంశంపైనే ప్రధాన చర్చ జరిగేలా వైసీపీ ప్రయత్నిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.



ప్రభుత్వం చేపడుతున్న ప్రధానాంశాల వివరాలు ప్రజలకు చేరకుండా చేయడమే ప్రతిపక్షం లక్ష్యంగా ఉందని చెప్పారు. దీన్ని తిప్పికొట్టడంలో అధికారపక్షంగా సరైన తీరులో నడవలేకపోయామన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సభలో ప్రధాన ప్రతిపక్షం తీరు సరిగాలేదన్న అంశాన్ని ప్రస్ఫుటంగా చెప్పలేకపోయామని అసంతృప్తి వ్యక్తపరిచారు. హత్యారాజకీయాల అంశం నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అపోహలు ప్రజల్లోకి వెళ్తున్నాయని, దీన్ని నిలువరించాలని సూచించారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ తప్పుడు విధానంలో వెళ్తోందని ప్రజలకు అర్థమయ్యేలా వ్యూహాత్మకంగా నడవాల్సిందని ఆయన పార్టీ నేతల సమావేశంలో విశ్లేషించారు. గతరెండు రోజుల పరిస్థితులే బుధవారం కూడా నెల కొనవచ్చని చర్చించారు. సెక్షన్ 344 కింద ఇచ్చిన శాంతిభద్రతలు, హత్యా రాజకీయాలు అంశాన్నే మళ్లీ ఆ పార్టీ ప్రస్తావించి గందరగోళాన్ని లేపుతుంది కనుక దాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆ పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తే రాజకీయ హత్యల అంశం చర్చకు రాకుండా చేయడానికే అధికార పార్టీ ఇలా చేస్తోందన్న అనుమానాలు ప్రజల్లో బలపడతాయి కనుక మరో వ్యూహంలో ముందుకు వెళ్లాలని బాబు సూచించారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top