చార్జిషీట్ మీడియాకు ఎలా లీకైంది?


కొన్ని పత్రికల్లో దీనిపై కథనాలెలా వస్తున్నాయి?

వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ కోర్టు జడ్జి ప్రశ్న

ఈ కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ న్యాయవాది




హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీట్ మీడియాకు ఎలా లీక్ అయిందని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ప్రశ్నించారు. ‘చార్జిషీట్‌ను మీడియాకు ఎవరు ఇస్తున్నారు? నేనే ఇంకా చదవలేదు. చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరోపణలు తదితర అంశాలపై యథాతథంగా కొన్ని పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి’ అని అన్నారు. చార్జిషీట్‌లోని సమాచారాన్ని సీబీఐ ఇస్తోందా? నిందితుల తరఫు న్యాయవాదులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. చార్జిషీట్‌లోని అంశాలను పేర్కొంటూ కథనాలను ప్రచురిస్తుండడంపై జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిశీలనలో ఉన్న చార్జిషీట్‌లోని అంశాలను పేర్కొంటూ మీడియా కథనాలను ఎలా ప్రచురిస్తుందని ప్రశ్నించారు. మీడియా ట్రయల్స్ చేయడం సరికాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసినా... చార్జిషీట్ దాఖలు చేసిన వెంటనే, కోర్టు పరిశీలనలో ఉండగానే అందులోని అంశాలను పేర్కొంటూ వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. ‘సీబీఐ సమర్పించిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉంది. కోర్టు నుంచి బయటకు వెళ్లే అవకాశం లేదు. చార్జిషీట్‌లోని అన్ని అంశాలను, డాక్యుమెంట్లను పరిశీలించి విచారణకు స్వీకరించిన తర్వాతే నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు అందజేస్తుంది. కోర్టు నుంచి గానీ, మా నుంచి గానీ చార్జిషీట్ లీక్ అయ్యే అవకాశం లేదు.  సీబీఐ మాత్రమే దాన్ని లీక్ చేసే అవకాశం ఉంది’ అని తెలిపారు. చార్జిషీట్ మీడియాకు ఎలా అందిందో తమకు తెలియదని సీబీఐ స్పెషల్ పీపీ కోర్టుకు నివేదించారు.



నిబంధనలకు లోబడే తమకు భూకేటాయింపులు జరిగాయని, ఈ కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ హెటిరో డ్రగ్స్ ఎండీ శ్రీనివాసరెడ్డి, హెటిరో సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను మంగళవారం విచారించిన సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కంపెనీల్లో ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండానే డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ వాదనలు వినిపిస్తోందని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అభియోగాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారంగా చూపించి, వాదనలు వినిపిస్తే వాటికి తాము వివరణ ఇస్తామని నివేదించారు. ఈ సందర్భంగా చార్జిషీట్‌లోని పేర్కొన్న అంశాలను సీబీఐ తరఫు న్యాయవాది చదివి వినిపిస్తూ.. నిందితులపై అభియోగాలు నమోదు చేయవచ్చని నివేదించారు. ఈ పిటిషన్‌పై వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.

 



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top