ఎలా అనుమతులిచ్చారు?


  •  బాణ సంచా దుకాణాలను పరిశీలించిన జిల్లా విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ

  •  రెవెన్యూ, ఫైర్ అధికారులపై అసహనం

  • గుంతకల్లు టౌన్: ‘చుట్టూ ఇళ్లు..ఆపై స్కూళ్లు..కనీసం ఫైర్ ఇంజన్ వచ్చేందుకు దారి కూడా లేదు.. ఆ మాత్రం కనిపించదా..జనవాసాల మధ్య బాణ సంచా దుకాణాల ఏర్పాటుకు ఏ విధంగా అనుమతులిచ్చారు’అని జిల్లా విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ అనిల్‌బాబు రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘బాణ సంచా దుకాణాల ఏర్పాటులో భద్రత ఎంత?’ అనే శీర్షికతో  ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.



    నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని పాతగర్ల్స్ హైస్కూల్‌లో  ఏర్పాటు చేయించిన బాణ సంచా దుకాణాలను  చూసి ఆయన అసహనం వ్యక్తం చేశారు. గుంతకల్లులో ఇంకెక్కడా స్థలమే లేనట్టు ఇరుకు సందుల్లో అనుమతిలిస్తే, దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు భాధ్యత వహిస్తారని డీటీ మునివేలును నిలదీశారు. కమిటీ అంగీకారం మేరకే అనుమతులిచ్చామని డీటీ చెప్పడంతో ఆయన ఒకింత ఆగ్రహానికి గురయ్యారు.



    ఈ రోజు పేపర్ చూస్తేనే మీ నిర్వాకం ఏంటో అర్థమవుతోందిన్నారు.  దుకాణాల వద్ద ఫైర్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచాలని ఫైర్ అధికారిని ఆదేశించారు.  పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్‌ఐ శ్రీనివాసులును ఆదేశించారు. అనంతరం రిటైల్ వ్యాపారస్థుల వద్దకు వెళ్లి సరుకు ఎక్కడి నుండి కొనుగోలు చేశారు? వాటికి సంబంధించిన బిల్లులు చూపమని అడుగగా వ్యాపారులు బిక్కమొహం వేశారు.   పొంతనలేని సమాధానాలిచ్చేందుకు యత్నించడంతో ఎస్పీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



    టపాసుల కొనుగోలుదారులకి కచ్చితంగా బిల్లులివ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నా. సాయంత్రం ఒన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గుంతకల్లులో దుకాణాల ఏర్పాటుకు రెవెన్యూ, ఫైర్, పోలీసు అధికారులు అడ్డగోలుగా అనుమతిలిచ్చారన్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి లేకుండా  జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పట్టణంలోని ఇద్దరు హోల్‌సేల్ వ్యాపారుల గోదాములను తనిఖీ చేశామన్నారు. వారి నుంచి మొత్తం రూ.16 లక్షలను అడ్వాన్స్ ట్యాక్స్ కింద చెక్కుల రూపంలో తీసుకున్నామని తెలిపారు.   తనిఖీల్లో విజిలెన్స్ డీసీటీఓ చెన్నయ్య, ఇంజనీర్ విశ్వనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top