పేదలందరికీ రెండు పడకల ఇళ్లు

ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి మృణాళిని - Sakshi

  • రాష్ట్ర వ్యాప్తంగా 1.24 లక్షల ఇళ్లు మంజూరు చేస్తాం 

  • గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని 

  • ఆమదాలవలస: రాష్ట్రంలోని పేదలందరికీ రెండు పడకల ఇళ్ల మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేశామని గృహ నిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ప్రభుత్వవిప్‌ కూన రవికుమార్‌ అధ్యక్షతన ఆమదాలవలస పట్టణ పరిధి తిమ్మాపురం గ్రామంవద్ద హుద్‌హుద్‌ తుపాను నిధులు 24.85 కోట్ల వ్యయంతో 512 గృహాల నిర్మాణానికి ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. ముందుగా పట్టణ శివార్లలో ఉన్న ఎన్‌.టీ.ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళు లర్పించారు. తరువాత మండలంలోని ఈసర్లపేట వద్ద ఉన్న అక్కుల పేట ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల చేశారు. తిమ్మాపురం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. హుద్‌హుద్‌ నిధులతో రాష్ట్రంలోని 2500 మంది పేదలకు రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. 2004 సంవత్సరానికి ముందర నిర్మించిన ఇళ్లకు మరమ్మతుల కోసం రూ.10వేలు మంజూరు చేస్తామన్నారు. ఎన్‌టీఆర్‌ గృహకల్ప పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.3.50 లక్షలు, బీసీలకు 2.25 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. బీసీలకు 1.24 లక్షల ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 74వేల ఇళ్లు మంజూరు లక్ష్యమన్నారు. కార్యక్రమంలో  శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ప్రభుత్వ విప్‌ కూనరవికుమార్, ఆమదాలవలస మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత, వైస్‌ చైర్‌పర్సన్‌ కూన వెంకట రాజ్యలక్ష్మి, ఎంపీపీ తమ్మినేని భారతమ్మ, కలెక్టర్‌ లక్ష్మీ నృసింహం, జేసీ వివేక్‌యాదవ్, డీఆర్‌డీఏ పీడీ తనూజరాణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భాస్కరరావు, వైస్‌ చైర్మన్‌ అన్నెపు భాస్కరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ బి.రాము తదితరులు పాల్గొన్నారు. 

     

    గ్యాస్‌ కనెక్షన్లు ఏవమ్మా? 

     

    అక్కులపేట ఎత్తిపోతల పథకం ప్రారంభానికి వెళ్లిన మంత్రి మృణాళిని, విప్‌ రవికుమార్‌కు ఈసర్లపేట తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. రోడ్లు నిర్మించలేదని, గ్యాస్‌ కనెక్షన్లు కోసం టీడీపీ కార్యకర్తలు డబ్బులు వసూలు చేసి ఇంతవరకూ మంజూరు చేయలేదని గోడు వినిపించారు. అయితే, మహిళలకు సమాధానం చెప్పకుండా మంత్రి పర్యటన కొనసాగించారు. ఎత్తిపోతల పథకం ప్రారంభంలో అపశృతి జరిగింది. అక్కడ స్విచ్‌ ఆన్‌ చేయగానే రెండు మోటార్లలో ఒక మోటారు నుంచి మంటలు వచ్చి కాలిపోయింది. 

     

    పట్టాలిస్తామని చెప్పి... 

     

    ఇళ్ల పట్టాలు ఇస్తామని టీడీపీ నేతలు గ్రామాల్లో ప్రచారం చేశారు. దీంతో పట్టణంలోని పేదలందరూ ఉదయం 9.30 గంటలకే తిమ్మాపురం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. తీరా మంత్రి వచ్చే సరికి 12గంటలు కావడం, మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమావేశం కొనసాగించడంతో మహిళలు అవస్థలు పడ్డారు. తాగునీరు కూడా అందక నరకయాతన ఎదుర్కొన్నారు. తీరా సమావేశంలో ఒక్కరి పేరు కూడా చదవకపోవడం, పట్టాలు అందజేయకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. సభ వద్ద తతంగాన్ని చూసిన కొందరు  పేదల గృహాలు కూడా టీడీపీ నాయకులే కాజేసేలా ఉన్నారని నిట్టూర్చారు. 

     
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top