ఆస్పత్రా.. చెత్తకుప్పా?


  •   ఇంత చెత్త నిర్వహణా?

  •      మీఇల్లు అయితే ఇలాగే ఉంటుందా?

  •      డీఎంఅండ్‌హెచ్‌ఓ తీవ్ర ఆగ్రహం

  •      ఇద్దరికి రెండునెలల జీతాల నిలుపుదల

  •      మరో ఇద్దరి తొలగింపునకు ఉత్తర్వులు

  • రావికమతం : ‘ఇది ఆస్పత్రా.. చెత్తకుప్పా! మీ ఇల్లయితే ఇలాగే ఉంచుతారా?  మీ తీరు మారదా? అంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆర్. శ్యామల స్థానిక వైద్యాధికారి వాసవిపై, ఎస్‌పీహెచ్‌ఓ పార్థసారథిపై, సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. రావికమతం పీహెచ్‌సీని ఆమె శనివారం  తనిఖీ చేశారు. అన్ని గదులనూ క్షుణ్నంగా పరిశీలించారు.



    ఆస్పత్రిలో ఎక్కడికక్కడ చెత్తపేరుకుపోయి ఉండడం , ఆపరేషన్ గదిలో చీపుర్లు ఉండడం, వాడిన సెలైన్లు, సూదులు అలాగే ఉండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల గదిలో బెడ్‌లు తుప్పు పట్టి ఉండడంపై మండిపడ్డారు. ఇతర సమస్యలపై వైద్యాధికారి వాసవిపై, స్టాఫ్‌నర్స్ దేవిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.



    ‘మీ ఇల్లు ఇలాగే ఉంచుతారా? ఇలా ఉంటే రోగులెవరైనా వస్తారా?’ అని మందలించారు. వైద్యులు, సిబ్బంది తీరు ఇలాఉంటే డెలివరీలకు ఇక్కడికి ఎవరైనా ఎందుకొస్తారని ప్రశ్నించారు. అక్కడికి చోడవరం సీనియర్ క్లస్టర్ ఆధికారి పార్థసారథిని నిలదీస్తూ, ఆస్పత్రిలో పరిస్థితులను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయనను హెచ్చరించారు.

     

    జీతాల నిలుపుదలకు ఉత్తర్వులు



    పనితీరు అపసవ్యంగా ఉన్న రావికమతం స్టాఫ్ నర్స్ దేవికి, స్వీపర్‌కు రెండునెలల పాటు జీతం నిలిపివేయాలని ఆమె ఆదేశించారు. విధులు సక్రమంగా నిర్వర్తించని ఇద్దరు కంటింజెంట్ వర్కర్‌లను విధులనుంచి తొలగించాలని ఆదేశించారు. హెచ్‌వీ అప్పలనర్సమ్మను బూరుగుపాలెం పీహెచ్‌సీకి డెప్యుటేషన్‌పై పంపాలని ఆదేశించారు.

     

    కలుషిత జలాలే కారణం

     

    జ్వరాలు ప్రబలి ముగ్గురు మృత్యువాత పడిన కన్నంపేట గ్రామాన్ని డీఎంహెచ్‌ఓ సందర్శించారు. జ్వరాలకు కారణం ఆ గ్రామంలో మంచినీటి ట్యాంకునుంచి సరఫరా అవుతున్న తాగునీరే కారణమని నిర్ధారించారు. తక్షణం ఆనీటి సరఫరా నిలిపివేసి, ప్రత్యామ్నాయంగా నీరు అందించాలని ఆదేశించారు. వమ్మవరం గ్రామంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ కార్యక్రంంలో ఎస్‌పీహెచ్‌ఓ సుజాత పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top