తెలంగాణలో ఉండనివ్వరు.. ఏపీకి రానివ్వరు!

తెలంగాణలో ఉండనివ్వరు.. ఏపీకి రానివ్వరు!


త్రిశంకుస్వర్గంలో ఉద్యానవర్సిటీ సిబ్బంది

సాక్షి, అమరావతి: ‘‘దశాబ్దాల పాటు విద్యా బోధన చేశాం. ఇప్పుడేమో తెలంగాణలో వద్దంటారు, ఆంధ్రా వాళ్లు రానివ్వరు.. ఏడాదిన్నరగా తాము పడుతున్న మనోవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మాకెందుకీ శిక్ష’’ అని ఉద్యాన వర్సిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సేవల్ని వినియోగించుకోవాలని, తెలుగు రాష్ట్రాలలోని రెండు ఉద్యానవన యూనివర్సిటీ రిజిస్ట్రార్లు తలుచుకుంటే తమ సమస్యను గంటలో పరిష్కరిం చవచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే... రాష్ట్ర విభజన అనంతరం ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని రెండుగా విభజించారు.



వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్నాయి. ఈ సంస్థల ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజనకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. ఇవి రాకుండానే యూని వర్సిటీకి తెలంగాణలో అనుబంధంగా ఉన్న ఉద్యాన కళాశాలలు, ఇతర పరిశోధన సంస్థలలో పని చేస్తున్న ఆంధ్రా స్థానికత కలిగిన 33 మందిని 2015 నవంబర్‌ 27న తెలంగాణ నుంచి రిలీవ్‌ చేశారు. రిలీవ్‌ చేసేటప్పుడు ఆంధ్రాలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యానవన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌ను కూడా సంప్రదించాలి. అలాంటిదేమీ జరక్కుండానే వీళ్లను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేయడంతో వాళ్లిప్పుడు త్రిశంకుస్వర్గంలో ఉన్నారు.



పెరిగిన అధికారుల వేధింపులు!

రిలీవ్‌ ఆర్డర్లతో ఆంధ్రాకు వెళ్లిన ఈ 33 మందిని తీసుకునేందుకు అక్కడి విశ్వవిద్యాలయం అధికారులు తిరస్కరించారు. తిరిగి వాళ్లు తెలంగాణకు వస్తే బాపూజీ విశ్వవిద్యాలయం వారు.. రిలీవ్‌ అయిన తర్వాత ఇక అవకాశమే లేదన్నారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక కొందరు జీతభత్యాలు, పోస్టింగ్‌ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఉభయుల వాదన విన్న హైకోర్టు.. ఉద్యోగం సంగతి తర్వాత చూద్దాం, జీతాలను మాత్రం 52, 48 నిష్పత్తిన ఇవ్వండని రెండు వర్సిటీలను ఆదేశించింది. జీతాలయితే వస్తున్నాయి గానీ పని లేదు. ప్రమోషన్లు లేవు. కరవుభత్యాలు, ఇంక్రిమెంట్లు లాంటివేవీ లేవు. జూనియర్లు సీనియర్లవుతున్నారు. ఎక్కడో చోట పోస్టింగ్‌ ఇచ్చి తమ సేవల్ని వినియోగించుకోవాలని అటు గవర్నర్‌ మొదలు ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వినతిపత్రాలిచ్చినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top