ఆశలు పట్టాలెక్కేనా


మళ్లీ రైల్వే బడ్జెట్ వచ్చేసింది. అవే పాత ప్రతిపాదనలు.. డిమాండ్లు. రైల్వే బడ్జెట్‌లో ఏటా జిల్లాకు మొండిచేయి చూపుతుండగా.. ఈసారైనా న్యాయం చేస్తారని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభును కలిసి పలు ప్రతిపాదనలు అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ హామీలు పట్టాలెక్కుతాయో లేదో చూడాలి.

 

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈసారైనా మోదీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు న్యాయం చేస్తుందా? నేడు ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్‌లో  కొత్త ప్రాజెక్టులు దక్కుతాయా అన్నది పలువురిని వేధిస్తున్న అంశం. గత ఏడాది జూలైలో మోదీ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకాశం జిల్లాకు మొండిచెయ్యి మిగిలింది. ఈ ప్రాంతానికి ఒక్క కొత్త ప్రాజెక్టుగానీ, కొత్తరైలు గానీ మంజూరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో ప్రస్తావించిన అంశాలను కూడా రైల్వే మంత్రి పరిగణనలోకి తీసుకోకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈసారి రైల్వే మంత్రి సురేష్‌ప్రభును ఎంపీలు కలిసినపుడు సానుకూలంగా స్పందించడంతో బడ్జెట్ పట్ల ఆశాభావం వ్యక్తమవుతోంది.

 

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్:

 ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్‌కు నిధులు మంజూరైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ లైన్‌పై అనేక మార్లు సర్వేలు జరిగినా నిధులు మాత్రం మంజూరు కాలేదు.  అయితే 2013-14 బడ్జెట్‌లో  50:50 శాతంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. దీనికి రెండేళ్ల క్రితం రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇదే రైల్వేలైనును అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చొరవతో అద్దంకిలోగుండా వెళ్లేలా డిజైన్ మారుస్తూ కూడా రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. దీనికి నిధులు కేటాయించాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.

 

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రతిపాదనలివీ...

ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పలు ప్రతిపాదనలను రైల్వే మంత్రి ముందుంచారు. ఇప్పటికే ఒకటికి రెండుసార్లు రైల్వే మంత్రిని కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు పగటిపూట సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వేయాలని ఎంపీ 2015-16 బడ్జెట్ కోసం ప్రతిపాదన పెట్టారు. ముంబై నుంచి గుంటూరుకు వయా గుంతకల్ మీదుగా కొత్త రైలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల కర్నూలు, మహబూబ్‌నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వేలాదిమంది ముంబైలో నివసించే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదించారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు గిద్దలూరు మీదుగా మరో ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

 

విజయవాడ - గూడూరు మార్గంలో సరుకు రవాణా కోసం మూడో లైన్ వేయాలన్న ప్రతిపాదన,ఒంగోలు నుంచి దొనకొండ రైల్వే లైను, ఒంగోలులో ఏర్పాటు చేసే ఎస్కలేటర్లు, లిఫ్ట్స్, నడికుడి నుంచి శ్రీకాళహస్తి రైల్వే లైను, విశాఖపట్నం నుంచి గుంటూరు వరకూ వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల వరకూ పొడిగించాలని,  గుంటూరు - ద్రోణాచలం మధ్య నడిచే  రైలును గుంతకల్ వరకూ పొడిగించాలని, నంద్యాల  - కర్నూలు మధ్య నడుస్తున్న డెమో రైలును గిద్దలూరు వరకూ, తెనాలి మార్కాపురం మధ్య నడుస్తున్న రైలును గిద్దలూరు వరకూ, సాయినగర్ షిర్డీ నుంచి విజయవాడ వరకూ ఉన్న ఎక్స్‌ప్రెస్‌ను గూడూరు జంక్షన్ వరకూ పొడిగించాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయో లేదో చూడాలి.

 

డిమాండ్లు...

కేరళ ఎక్స్‌ప్రెస్, జోథ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, జైపూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లకు ఒంగోలులో హాల్ట్ కేటాయించాలి. తిరుమలా ఎక్స్‌ప్రెస్, సర్కార్ ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, సింహపురి ఎక్స్‌ప్రెస్‌లను టంగుటూరులో ఆపాలని, శబరి ఎక్స్‌ప్రెస్, పద్మావతి ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లను సింగరాయకొండలో ఆపాలని, హౌరా వెళ్లే ఎస్‌ఎస్‌పీఎన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు దొనకొండలో ఆపాలని, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను కురిచేడులో, పూరీ నుంచి బెంగళూరు వెళ్లే గరీభ్ధ్‌న్రు గిద్దలూరులో ఆపాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిని రైల్వే మంత్రి ఆమోదిస్తారా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top