ప్రత్యేక హోదాపై నీళ్లు?

ప్రత్యేక హోదాపై నీళ్లు? - Sakshi


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా లేనట్లేనని పరోక్షంగా తేల్చిచెప్పిన కేంద్రం

 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నీళ్లు చల్లినట్టేనా! ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన హోదాపై కేంద్ర సర్కారు చెప్పిన మాటలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమీ ఉండబోదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పరోక్షంగా తేల్చిచెప్పింది. ఇప్పటివరకు ఇచ్చిన ఆర్థిక సాయం, మినహాయింపులతో సరిపుచ్చుకోవాలని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ విభజన సమయంలో సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో చేసిన వాగ్దానం, ఆ మేరకు నాడు కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రస్తుత ఎన్డీఏ సర్కారు పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదన్నది తేలిపోయింది. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ.. మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు.

 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నీళ్లు చల్లినట్టేనా! ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన హోదాపై కేంద్ర సర్కారు చెప్పిన మాటలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమీ ఉండబోదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పరోక్షంగా తేల్చిచెప్పింది. ప్రత్యేక హోదా కేటగిరీ కలిగిన రాష్ట్రాలకూ తాజా బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళిక సాయం (ఎస్‌పీఏ) కేటాయించలేదని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇందర్‌జిత్ సింగ్ స్పష్టం చేశారు. అంటే ఇకపై స్పెషల్ కేటగిరీ స్టేటస్ హోదా రాష్ట్రాలకు ఇప్పటివరకు ఉన్న ప్రయోజనాలేవీ ఉండవని పరోక్షంగా చెప్పారు. కేవలం ఎక్స్‌టెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు(ఈఏపీ) సాయం కొనసాగుతుందన్నారు. ఏపీ, తెలంగాణ సహా ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోరాయని వివరించారు. శుక్రవారం లోక్‌సభలో తెలంగాణ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఏపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు ప్రత్యేక హోదాపై ప్రశ్నలు అడిగారు. ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక హోదా విన్నపాలు వచ్చాయా? ఏయే అంశాల ప్రాతిపదికన ప్రత్యేక హోదా కల్పిస్తున్నారు? ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాలకు ఈ హోదా ఉంది? అని వారు ప్రశ్నలు సంధిం చారు. వీటికి కేంద్రమంత్రి ఇందర్‌జిత్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తారా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టి.. ప్రత్యేక హోదా పొందేందుకు అవసరమైన ప్రాతిపదికలను ఏకరువు పెట్టారు. జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డీసీ) ప్రణాళిక సాయం అందుకునేందుకు గతంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్‌ను  ఇచ్చేదని,  మంత్రి తెలిపారు. ఇందుకు పర్వతప్రాంతమై ఉండడం గాని, తక్కువ జనసాంద్రత లేదా అధిక గిరిజన జనాభా, సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం, ఆర్థికంగా, మౌలిక వనరులపరంగా వెనకబడి ఉండడం తదితర పరిమితుల్లో ఉండే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమలయ్యేదన్నారు.



‘‘ప్రత్యేక హోదాకల రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సాయం(ఎన్‌సీ ఏ)లో ప్రాధాన్యం ఉండేది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటా తక్కువగా ఉండేది. ప్రత్యేక హోదా రాష్ట్రాలకే ప్రత్యేక ప్రణాళిక సాయం (ప్రత్యేక ప్రాజెక్టుల కోసం 90% గ్రాంటుగా) ఉండేది. వీటితోపాటు ప్రత్యేక కేంద్ర సాయం (100%) ఉండే ది. ఎక్స్‌టెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు-ఈఏపీ(విదేశీ సంస్థల ఆర్థిక సాయం)ల విషయంలో ప్రత్యేక హోదా కల రాష్ట్రాలకు 90% గ్రాంటుగా ఇచ్చేవారు. జనరల్ కేటగిరీ రాష్ట్రాలైతే ఈఏపీల విషయంలో మొత్తం రుణంగా పరిగణిస్తారు. అయితే 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల  అనంతరం తాజా బడ్జెట్‌లో... సాధారణ కేంద్ర సాయం(ఎన్‌సీఏ), ప్రత్యేక కేంద్ర సాయం(ఎస్‌సీఏ), ప్రత్యేక ప్రణాళిక సాయం(ఎస్‌పీఏ) కేటాయించలేదు. కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని పథకాలు రద్దయ్యాయి. కొన్ని కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ఈఏపీ సాయం కొనసాగుతుంది’’ అని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రీతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పన్ను రాయితీ ప్రోత్సాహకాలు అమలవుతున్నాయన్నారు.

 

 హడావుడిగా అర్ధరాత్రి కేంద్రం ప్రకటన



న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఉండబోదని పార్లమెంట్‌లో కేంద్రం పరోక్షంగా తేల్చిచెప్పడం.. దీనిపై ఏపీలో నిరసనలు,  వ్యక్తమైన నేపథ్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కేంద్రం స్పందించింది. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యేక హోదాపై ప్రతిపాదన అందిందని, దీనిపై వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు కొనసాగుతున్నట్లుగా వెల్లడించాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై  ఏ నిర్ణయం తీసుకోలేదని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది చెప్పారు.   

 

చంద్రబాబు ఏం చేశారు?


 

ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిక్కుల్లో ఉందంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఆ హోదా సాధించలేకపోయారు. బీజేపీని ఒప్పించకపోవడం వెనక చంద్రబాబు చేసిన స్వయంకృతాపరాధాలే ఎక్కువున్నాయని ఏపీకి చెందిన ఒక ఎంపీ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ‘‘ఒకవైపు రాష్ట్రం చిక్కుల్లో ఉందంటూనే రాజధానికి భూసేకరణ పేరుతో ఆర్థిక భారం కలిగించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఎలా నమ్ముతుంది? నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున ఆ స్థాయిలో ఒత్తిడి చేయాలి.



ఎందుకంటే విభజన సమయంలో ప్రధానే హామీ ఇచ్చారు. పైగా కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇలాంటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు కూడా వచ్చేవి కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరో ఎంపీ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు వస్తాయనుకున్నా.. అందులో చాలా వరకు ఎన్డీఏ, యూపీఏ సంబంధిత పార్టీల పాలనలోనే ఉన్నాయి. వాటిని ఒప్పించడం ఎన్డీఏకు సమస్య కాదు. హామీ ఇచ్చింది యూపీఏ, అమలుచేయాల్సింది ఎన్డీఏ కాబట్టి ఆ సమస్య ఉత్పన్నమే కాదు’’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో సాంకేతిక కారణాలేవీ అడ్డులేవు. ప్రత్యేక హోదా కోసం సంతృప్తిపరచాల్సిన నిబంధనల్లో.. ‘ఆర్థిక వనరుల లేమి’ అన్న అంశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇది వర్తిస్తున్నందున ప్రత్యేక హోదాకు అర్హత ఉన్నట్టే! అయినా చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించడంలో రాజీ పడుతున్నారన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. విభజన సమయంలో ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ కూడా డిమాండ్ చేసింది. అయినా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గట్టిగా పట్టుపట్టకపోవడం రాష్ట్ర ప్రజలకు మింగుడుపడడం లేదు.

 

ఏమయ్యాయి నాటి వాగ్దానాలు..?



‘‘13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తాం. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి సంవత్సరంలోనే రెవెన్యూ లోటు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అపాయింటెడ్ డే నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అందేవరకు ఈ రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు వీలుగా 2014-15 సాధారణ బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం’’ అని విభజన సమయంలో రాజ్యసభలో చర్చ సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ ఇదీ! 2014 మార్చిలో ఏపీకి స్పెషల్ స్టేటస్ అమలు చేయాలని కేంద్ర కేబినెట్  కూడా ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. అయితే ఇప్పుడు వీటికి విలువ లేకుండా పోయింది. మొన్నటి కేంద్ర బడ్జెట్ ప్రసంగంలోనే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఉండబోదని పరోక్షంగా చెప్పారు. ‘చట్టబద్ధమైన అన్ని హామీలకు కట్టుబడి ఉంటాం’ అని మాత్రమే ఆయన పేర్కొన్నారు.



ఆ ప్రకటనతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనుమానాలు వెల్లువెత్తినా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు ‘హోదా’ వస్తుందంటూ ఇన్నాళ్లూ మభ్యపెడుతూ వచ్చారు. కానీ ఇకపై ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ప్రత్యేక సాయమేదీ అందదని, కేవలం విదేశీ రుణాలతో నడిచే ప్రాజెక్టులు(ఈఏపీ) ఇచ్చే సాయంలో 90 శాతం గ్రాంటుగా ఇవ్వడం కొనసాగుతుందని కేంద్రం తేల్చేసింది. అంటే ఇకపై కొత్తగా ఏ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఉండదని, ఇప్పుడు ఉన్న రాష్ట్రాలకు కూడా కేవలం ఈ విదేశీ రుణం గ్రాంటుగా అందే వెసులుబాటు ఉంటుందని చెప్పకనే చెప్పింది. వాస్తవానికి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రణాళిక సాయం(ఎస్‌పీఏ) కింద ఏటా వందల కోట్ల నిధులందుతాయి. వాటిలో 90 శాతం గ్రాంట్లుగానే పరిగణిస్తారు. 10 శాతం మాత్రం తిరిగి చెల్లించాలి. ఈ హోదా లేని రాష్ట్రాలకు కేవలం 30 శాతం మాత్రమే గాంట్లుగా ఇస్తారు. మిగిలినదంతా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top