ప్రజలు గౌరవించేలా నడచుకుంటా

ప్రజలు గౌరవించేలా నడచుకుంటా

  •      మీట్ ది ప్రెస్‌లో భూమన కరుణాకర రెడ్డి

  •      తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పా

  •      70 వేల గడపలు తొక్కి ప్రజాసమస్యలు తెలుసుకున్నా

  •      టీటీడీ చైర్మన్‌గా మహిళా క్షురకులను నియమించా

  •      తాగునీటి ఎద్దడి పరిష్కారానికి రాజీలేని పోరాటం

  •  సాక్షి, తిరుపతి: ‘‘మా ఎమ్మెల్యే ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.. మా సమస్యలు పట్టించుకుని పరిష్కరిస్తారని, ప్రజలు నన్ను గౌరవించే విధంగా నడచుకుంటా’’ అని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

     

    ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ హోటల్‌లో ఏపీడబ్యూయూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. ఆయన తో పాటు మీట్ ది ప్రెస్‌లో వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, నేతలు భూమన్, రామచంద్రారెడ్డి, ఎస్‌కే.బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ, తాను అధికారంలోకి రాగానే తిరుపతిని సాంస్కృతిక నగరం, సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు.



    తిరుపతి నగరంలో అత్యవసర సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళతామని చెప్పారు. తిరుపతి నగరం అభివృద్ధికి రూ.450 కోట్లు ఇస్తామని ఉప ఎన్నికలప్పుడు చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ తరువాత రూపాయి కూడా విదిల్చలేదన్నారు. రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలు, అనర్థాలు ఏంటనేది నాలుగు నెలల పాటు ప్రజలకు విడమర్చి చెబుతూ, సమైక్యాంధ్ర కోసం ఉద్యమించానని గుర్తు చేశారు. తిరుపతి ప్రజలు మానవ విలువలు, తాత్విక చింతన ఉన్న తనలాంటి వారినే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని కోరారు.

     

     తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో గళం




     తిరుపతి నుంచి ఎన్నికైన ఏ ఇతర ఎమ్మెల్యేలు గతంలో తిరుపతి సమస్యలపై అసెంబ్లీ లో గళమెత్తిన సందర్భం లేదు. ఆ ఘనత నాకే దక్కుతుంది. తిరుపతి నియోజకవర్గ సమస్యలపట్ల, నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం అనుసరించిన మోసపూరిత వైఖరి పట్ల అసెంబ్లీలో నాలుగుసార్లు గళం వినిపించా. అసెంబ్లీ సాక్షిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ అంశంపై ఎండగట్టా.

     

     రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలపై అసెంబ్లీలో నాలుగున్నర గంటలు అనర్గళంగా ప్రసంగించి అందరి మన్ననలు అందుకున్నా

     

     తిరుపతి నగరంలోని వార్డుల్లో కాలినడకన పర్యటించి 625 రోజుల్లో 70 వేల గడపలు ఎక్కి  ప్రజా సమస్యలు లోతుగా తెలుసుకున్నా. నగరంలో ఎక్కడ ఏవార్డులో ప్రజలు ఏ తరహా సమస్య ఎదుర్కొంటున్నారన్న దానిపై నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది.

     

     తిరుపతి తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అనేకసార్లు ధ ర్నాలు చేసి, ప్రజల తరఫున పోరాటం చేశా.

     

     టీటీడీ చైర్మన్‌గా చాలా చేశా..




     తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆలయంలో తొలిసారిగా మహిళా క్షురకులను నియమించేందుకు చర్యలు తీసుకున్నా.

         

     30 వేల పేద జంటలకు రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు ఉచితంగా జరిపించాం.

         

     ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, కోట్లాదిమంది హిందువులు వీక్షిస్తున్న ఎస్వీ భక్తిచానల్ ఏర్పాటు నా ఆలోచనే.

     

     శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు శ్రీవారి కళ్యాణాలు ప్రారంభించాం.

         

     తిరుపతిలో వేదవిశ్వవిద్యాలయం స్థాపన కూడా నా కృషే. వేదం చదివే విద్యార్థులకు భవిష్యత్ లేదన్న ఆందోళనను పరిష్కరించి, వేదపాఠశాల విద్యార్థులకు రూ.3 లక్షల డిపాజిట్ స్కీం అమలు చేశాం.

         

     తిరుపతిని సాంస్కృతిక నగరంగా రూపొందించేందుకు గతంలో తెలుగుభాష బ్రహ్మోత్సవాలు, ఉగాది సంబరాలు, గ్రామీణ క్రీడలు ఇలా అనేక కార్యక్రమాలను జయప్రదం చేశాం.

     

     హిందువుల్లో అనైక్యత ఏర్పడిన సమయంలో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పీఠాధిపతులతో తిరుమలలో సమ్మేళనం నిర్వహించా.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top