వస్తున్నారు.. వెళ్తున్నారు

వస్తున్నారు.. వెళ్తున్నారు


సాక్షి ప్రతినిధి, కడప:

 పళ్లు ఊడగొట్టేందుకు ఏ రాయి అయితేనేం... అన్నట్లుగా మంత్రుల పర్యటనలు సాగుతున్నారుు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆమాత్యుల పర్యటనలు విందులకే పరిమితమవుతున్నారుు. టీడీపీ నేతల పరపతి పెంచితే అదే పదివేలు అన్నట్లుగా వారి పర్యటనలు తలపిస్తున్నాయి. పరిటాల సునీత మొదలు డిప్యూటీ సీఎం చిన రాజప్ప వరకూ చేపట్టిన జిల్లా పర్యటన అందుకు  నిదర్శనంగా నిలుస్తున్నాయి. శాఖా పరంగా అభివృద్ధిపై చర్చకంటే అధికారపార్టీ నాయకుల్ని సంతృప్తి పర్చడంతోనే ముగుస్తున్నారుు.



 జిల్లాలో శరవేగంగా చోటుచేసుకున్న పలు అభివద్ధి పనులు ఆర్ధాంతరంగా నిలిచిపోయాయి. అధికారంలో ఉన్నవారు వాటిని పూర్తి చేసి ప్రజావిశ్వాసం పొందాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా అభివృద్ధి పనులపై అధికార పార్టీ నేతలకు శ్రద్ధ ఇసుమంతైనా కన్పించడం లేదు. నాలుగునెలల్లో మంత్రులు పర్యటనలు మినహా జిల్లాకు ఒనగూరిందేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. తుదకు ఎయిర్‌పోర్టు సామర్థ్యం మేరకు పనులు పూర్తి అయినా ప్రారంభోత్సవానికి కూడా పాలకులు వెనకగుడుకు వేస్తున్న పరిస్థితి.



కలెక్టరేట్ భవన సముదాయం, ఐజీ కార్ల్ పశుపరిశోధన కేంద్రం దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు ఉన్నా జిల్లాకు తెప్పించుకోలేని దుస్థితి. మైలవరం, గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాళెం, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లల్లో సులువుగా 30 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. ఆ దిశగా పాలకపక్షం చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు అధికంగా ఉన్నాయి. ఏమంత్రి పర్యటన ఉన్నా, అధికారపార్టీ నేతలకు తమ ఇళ్లుకు రావాలనే తపన తప్పా, ప్రాంతం అభివద్ధికి యోగ్యం కావాలనే తలంపు కన్పించలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.



 ఇసుమంతైనా అభివృద్ధి ఏదీ....

 జిల్లాలో ఇప్పటి వరకూ ఏడుగురు మంత్రులు పర్యటించారు. మంత్రుల పర్యటనలను పరిశీలిస్తే అధికార పార్టీ నేతల మెప్పు మినహా ఏమాత్రం అభివృద్ధి ఏదని విశ్లేషకులు పశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రాభవం కోసం మినహా ప్రాంతాల అభివృద్ధిపై శ్రద్ధ లేదని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, రావెళ్ల కిశోర్‌బాబు, శిద్ధా రాఘవరావు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, డిప్యూటీ ముఖ్యమంత్రి (హోంమంత్రి) చిన రాజప్పలు పర్యటించారు.



ఈ ఏడుగురు మంత్రుల పర్యటనలు నాయకుల గ్రామాలు, ఇళ్లతో ముడిపడి ఉంది. శాఖ పరంగా లోటుపాట్లపై సమీక్షలు నిర్వహించడంలో దాదాపు విఫలం అయ్యారనే ఆరోపణలు విన్పిస్తోన్నాయి. ఒకవేళ సమీక్షలు చేపట్టినా అధికార పార్టీ నాయకుల కోసమే అన్నట్లుగా వ్యవహరించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. జిల్లాలో మెట్ట సేద్యం అచ్చిరాక, రైతన్నలు అనేక అవస్థలు పడుతున్నారు. పండ్లతోటల రైతుల స్థితి రోజురోజుకూ దీనస్థితిగా మారుతోంది. వారికి శాశ్వత పరిష్కార మార్గంగా అడుగులు పడుతాయనే ఆశలు ఏమాత్రం కన్పించడం లేదని విశ్లేషకులు భావిస్తోన్నారు.

 

 ఆయా శాఖలల్లో గ్రిప్ కోసమే....

 మంత్రులు పర్యటిస్తే శాఖ పరంగా సమీక్షలు నిర్వహించి ఆశాఖలో జిల్లాకు యోగ్యకరంగా ఉంటారని భావించేవారు. అయితే ఆయాశాఖల్లో తెలుగుతమ్ముళ్లు పరపతి పెంచేందుకు మంత్రులు పర్యటనలు సాగుతున్నారుు. డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి చిన రాజప్ప పర్యటన సైతం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగు తమ్ముళ్లుకు అండగా నిలవని అధికారులను ఆదిశగా ప్రోత్సహించేందుకే ఆయన పర్యటన ఉన్నట్లుగా పరిశీలకులు ఆరోపిస్తున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top