చరిత్ర హీనులే..

చరిత్ర హీనులే.. - Sakshi


అభివృద్ధికి సహకరించకుంటే   చరిత్ర హీనులే..

తాగునీరు కలుషితం చేస్తే చర్యలు తప్పవు

ఆస్పత్రుల పనితీరుపై  తనిఖీలు నిర్వహించండి

వృద్ధుల ఇళ్లకెళ్లి రేషన్ సరకులు ఇవ్వండి

‘మీ కోసం’లో కలెక్టర్ బాబు.ఎ


 

మచిలీపట్నం (చిలకలపూడి) : ‘జిల్లాలో రాజధాని నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా జిల్లాస్థాయి అధికారులు కొంత మంది పని నుంచి తప్పించుకుంటున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్నారు.. వారెవరో నాకు తెలుసు.. అభివృద్ధికి సహకరించని అధికారులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు’ అంటూ కలెక్టర్ బాబు.ఎ భావోద్వేగంగా మాట్లాడారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ గంధం చంద్రుడు, ఇన్‌చార్జి    డీఆర్వో పి.సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సహకరించాలని కోరారు. పోలవరం, గన్నవరం ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు, జాతీయ రహదారుల విస్తరణ, కనకదుర్గ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం వంటి అభివృద్ధి పనుల కోసం తాను విశ్రాంతి లేకుండా రోజుకు 22 గంటలు పని చేస్తున్నానని, అధికారులు సహకరించకపోతే ఎలాగని ప్రశ్నించారు.



వైద్యాధికారులపై ఆగ్రహం

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకల దాడిలో బిడ్డ చనిపోయిన ఘటన తరువాతకూడా జిల్లాలో వైద్యాధికారులు స్పందించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధికారిని బాధ్యులుగా నియమించాలని తాను ఆదేశించినా ఇప్పటి వరకూ అమలుకాలేదని పేర్కొన్నారు. ఆస్పత్రుల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచిం చారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు ప్రతి గురువారం కచ్చితంగా పీహెచ్‌సీలను తనిఖీచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని వెంటనే వారిని సస్పెండ్ చేసి, తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.



తాగునీరు కలుషితం చేస్తే ఎవరినీ వదలొద్దు

తాగునీరు అందటం లేదని, నీరు కలుషితమైందని పదేపదే ఫిర్యాదుల వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరిం చాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాగునీరు కలుషితం చేస్తున్న చేపల చెరువుల యజమానులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో పని చేస్తున్న ఏపీఎంలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికల కోసం పదిసార్లు తానే ఫోన్          చేయాలా అని ప్రశ్నించారు. రోజూ నివేదికలు పంపని ఏపీఎంలను విధుల నుంచి తొలగించాలని పీడీ చంద్రశేఖర్‌రాజుకు సూచించారు. కదల్లేని స్థితిలో ఉండే వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి ఈ పోస్ విధానంలో రేషన్ సరకులు అందించాలని డీఎస్‌వో డి.రవికిరణ్‌కు సూచించారు. మీ కోసం కార్యక్రమానికి రాని ఎక్సైజ్, మైనింగ్ శాఖ ఏడీ, ఆర్‌ఐవో, డీఎం సివిల్ సప్లయీస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. డీఎంహెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరి, డీఈవో కె.నాగేశ్వరరావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణ, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఎ.వి.డి.నారాయణరావు, సర్వే శాఖ ఏడీ విజయకుమార్, ఎక్సైజ్ ఎఈఎస్ ఎం.సునీత, సీపీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top