పట్టిసీమతో చరిత్ర సృష్టిస్తాం

పట్టిసీమతో చరిత్ర సృష్టిస్తాం - Sakshi


పట్టిసీమ ఎత్తిపోతల శంకుస్థాపన సభలో చంద్రబాబు

పనులు పూర్తయ్యే వరకు ప్రాజెక్టు వద్దే పడుకుంటానని వ్యాఖ్య


 

 (పోలవరం నుంచి సాక్షి ప్రతినిధి)  పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ వద్ద గోదావరి జలాలను కృష్ణానదికి తరలించేందుకు రూపొందించిన ఎత్తిపోతల పథకానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో బాబు సుదీర్ఘంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగా నిలిచే ఉభయగోదావరి జిల్లాల రైతులకు ఎట్టి పరిస్థితుల్లోను అన్యాయం చే యబోమని, సముద్రంలోకి వృథాగా పోతున్న వరద నీటిని మాత్రమే పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు తరలిస్తామని చెప్పారు.



రెండు జిల్లాల్లో నీటి అవసరాలు తీరిన తర్వాత, ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఎకరం తడిపిన తర్వాతే  మిగులు జలాలను పట్టిసీమ ద్వారా మళ్లిస్తామన్నారు. అది కూడా గోదావరిలో 14 మీటర్లు పైబడిన వరద నీటిని మాత్రమే తరలిస్తామని పేర్కొన్నారు. వాస్తవానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.67 మీటర్ల ఎత్తువరకు నీళ్లుంటే గోదావరి జిల్లాల డెల్టా ప్రాంతానికి సరిపడా సాగు, తాగునీరు అందుతుందని చెప్పారు. పట్టిసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులూ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైతే తాను గతంలో చేసిన పాదయాత్రలో మాదిరిగా ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు అక్కడే పడుకుంటానని వ్యాఖ్యానించారు.



పోలవరం నాలుగేళ్లలో పూర్తి



కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోలవరం పూర్తయ్యేలోగా గోదావరి డెల్టాలో రబీ సాగుకు ఇబ్బందులు తలెత్తకుండా సీలేరు జలాలను ఉపయోగిస్తామన్నారు. అవసరమైతే సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని కూడా నిలిపేసి గోదావరి జిల్లాలకు నీరు తరలిస్తామని చెప్పారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.



నా వల్లే తెలంగాణ ముందుంది..



విభజనతో దివాళా తీసిన రాష్ట్రానికి ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవాలని చంద్రబాబు తన ప్రసంగంలో పదేపదే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, తన హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి వల్లే ఇప్పుడు తెలంగాణ రాష్ర్టం ఆదాయంలో ముందుందని చెప్పారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పూర్తి విజన్‌తో ముందుకెళుతున్నామన్నారు.

 

సొంతూరు కంటే నాకు పశ్చిమగోదావరే ఎక్కువ




మా సొంత జిల్లా, సొంతూరు కంటే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లానే తనకు ఎక్కువని చెప్పారు. ఎప్పటికీ జిల్లాకు రుణపడి ఉంటానని పదేపదే పేర్కొన్న చంద్రబాబు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.  ప్రతిష్టాత్మక నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ను ఈ జిల్లాలోనే నెలకొల్పుతామని, చేపల, రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేందుకు మెరైన్ యూనివర్సిటీని కూడా పశ్చిమలోనే నెలకొల్పుతామని ప్రకటించారు.

 

‘సాక్షి’పై అక్కసు




 సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో ‘సాక్షి’ దినపత్రికపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తప్పుడు వార్తలు రాస్తున్నారు.చేసిన అవినీతికి ఆస్తులు అటాచ్‌మెంట్లు చేసే పరిస్థితిలో ఉన్నా.. ‘సాక్షి’ పేపర్‌లో అయితే దుర్మార్గంగా రాస్తున్నారు.. పట్టిసీమతో గోదావరి నీళ్లు ఎత్తి ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పోలవరం, పులిచింతల ఉంది.. నాగార్జునసాగర్, గాలేరు నగరి.. కడపలో 70 టీఎంసీలు నిల్వ చేసే పరిస్థితి ఉంది.. వీటన్నింటిలో కృష్ణానది స్థిరీకరణను బట్టి నీటిని నిల్వ చేసే అవకాశముంది అని చెప్పుకొచ్చారు.



ఏయ్ పోలీస్.. వాళ్లను కంట్రోల్ చేయండి



 సభలో ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఆందోళనకారులు నినాదాలు చేయగా, బాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏయ్ పోలీస్.. వాళ్లను కంట్రోల్ చేయండి.. ఇలాంటివి ఇక్కడొద్దు.. ఏమన్నా ఉంటే నా వద్దకు తీసుకురండి.. అని ఆదేశించారు. అయితే పోలీసులు ఆందోళనకారులను సభ నుంచి బలవంతంగా పంపించివేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పట్టిసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తున్న రైతులను పదుల సంఖ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా పోలీసులు కనిపించారు.



శ్రీకృష్ణరాజ్యం ఎవరూ కోరుకోరు: టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బాబు పట్టిసీమ సభలో మాట్లాడుతూ రామరాజ్యం కావాలని అందరూ కోరుకుంటారు.. శ్రీకృష్ణరాజ్యం కావాలని ఎవరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ తన పాలనలో శ్రీరామరాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు.



పోలవరం పనుల పరిశీలన: పట్టిసీమ బహిరంగ సభ అనంతరం బాబు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్దకు హెలికాప్టర్‌లో వెళ్లి అక్కడి నుంచి వ్యూ పాయింట్‌కు చేరుకున్నారు. నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top