మెట్రోకు ఓకే !


- అమరావతికి హైస్పీడ్ రైళ్లు!

- శ్రీధరన్ డీపీఆర్‌ను ఆమోదించిన సర్కారు

- త్వరలో డీఎంఆర్‌సీ ఆధ్వర్యంలో నిర్మాణం

- వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది 40 శాతం

- జపాన్ కంపెనీ నుంచి 60 శాతం రుణం!

సాక్షి, విజయవాడ బ్యూరో :
ఇక నవ్యాంధ్ర రాజధానిలో హైస్పీడ్‌రైళ్లు పరుగులు తీయనున్నాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకోసం రాష్ట్రంలోని మెట్రోప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించడంతో ప్రాజెక్టుకు మార్గం సుగుమమైంది. రూ.5,705 కోట్ల అంచ నా వ్యయమున్న ఈ ప్రాజెక్టును శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్‌సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) చేపట్టనుంది.



ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని జపాన్‌కు చెందిన జైకా వంటి విదేశీ కంపెనీల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్ర భుత్వం భావిస్తోంది. భూసమీకరణకయ్యే రూ.769 కోట్ల ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో కొనుగోళ్లకయ్యే ఖర్చులో ఆరు శాతం మొత్తాన్ని సర్వీసు చార్జిగా తీసుకుని డీఎంఆర్‌సీ నిర్మాణాన్ని చేపడుతుంది.



తొలి నుంచి అనుకున్నట్లుగానే ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు కారిడార్లను 25.76 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మెట్రో మెయిన్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్, బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకూ 12.76 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో పెనమలూ రు వరకూ ఒకటో కారిడార్ నిర్మితమవుతుంది.



రెండవ కారిడార్‌ను బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు అక్కడి నుంచి నిడమానూరు వరకూ 13 కిలోమీటర్ల మేర 13 స్టేషన్లతో నిర్మిస్తారు. భవిష్యత్తులో చేపట్టే రెండో దశ ప్రాజెక్టులో ఒక టో కారిడార్‌ను రాజధాని వరకూ పొడిగిస్తారు. ఇందుకోసం బస్టాండ్ సమీపంలో కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించి అక్కడి నుంచి కారిడార్‌ను తుళ్లూరు వరకూ పొడిగిస్తారు. రెండో దశలోనే రెండవ కారిడార్‌ను ఒకవైపు గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ, మరోవైపు గొల్లపూడి సెంటర్ వరకూ విస్తరిస్తారు.



రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరలో రూపొందించనున్నారు. 25.76 కిలోమీటర్ల తొలి దశ మెట్రో ప్రాజెక్టును 2019కల్లా పూర్తి చేస్తామని ప్రారంభంలో గంటకు 40 నుంచి 50 వేల మంది ప్రయాణిస్తారని డీఎంఆర్‌సీ అంచనా వేసింది. 2019 నాటికి గంటకు 2.91 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని ట్రాఫిక్ సర్వే ద్వారా తేల్చారు. మెట్రో రైళ్లలో 5 కిలోమీటర్ల వరకూ టికెట్ ధర రూ.10, 5 నుంచి పది కిలోమీటర్లయితే రూ.20, పది కిలోమీటర్లు దాటితే రూ.30గా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ధరల ద్వారా ఏడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టు ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు.



మరోవైపు రాజధాని అమరావతిని హైస్పీడ్ రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించే విషయంపై ప్రభుత్వం డీఎంఆర్‌సీ సలహాను కోరింది. బెంగళూరు నుంచి అమరావతి, విశాఖపట్నం నుంచి అమరావతి మీదుగా తిరుపతి వరకూ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి శ్రీధరన్‌ను కోరారు. అలాగే విజయవాడ-మంగళగిరి-గుంటూరు-తెనాలి సర్క్యూట్‌ను మెట్రో నుంచి మినహాయించి ర్యాపిడ్ రైల్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించాలని శ్రీధరన్ డీపీఆర్‌లో ప్రతిపాదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top