హై సెక్యూరిటీ!

హై సెక్యూరిటీ! - Sakshi


డిసెంబర్ మొదటివారం నుంచి జిల్లాలో అమలు

కొత్త వాహనాలకు తప్పనిసరి యూనిట్ కార్యాలయాల్లో ఏర్పాట్లు

 


విజయవాడ : రాష్ట్ర నూతన రాజధాని విజయవాడలో ఇకపై నూతన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి కానున్నాయి. మరి కొద్దినెలల్లో జిల్లాలో పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమం అమలు కానుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో దీనిని అమలులోకి తెచ్చారు. డిసెంబర్ మొదటి వారం  నుంచి జిల్లాలోనూ దీనిని అమలులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయించారు. ఆర్టీసీ దీనిని మరో ఏజెన్సీకి అప్పగించింది. ఈ క్రమంలో జిల్లాలోని రవాణా శాఖ యూనిట్ కార్యాలయాల్లో వీటి కోసం ప్రత్యేకంగా గదులు కేటాయించారు. ప్రధానంగా వాహనాలను వినియోగించి చేసే నేరాల నియంత్రణకు, కొన్ని ప్రత్యేక కేసుల్లో పోలీసుల దర్యాప్తుకు దోహదపడేలా ఈ నంబర్ ప్లేట్ల కార్యక్రమాన్ని రూపొందించారు.



కసరత్తు వేగవంతం...



జిల్లాలోని రవాణాశాఖ యూనిట్ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి ఏజెన్సీలకు ప్రత్యేకంగా గదులు కేటాయించారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయంలోనే దీనిని మొదలుపెట్టారు. ఇది కొన్ని జిల్లాలకే పరిమితమైంది. విజయవాడ రాష్ట్ర నూతన రాజధాని కావటంతో ఇక్కడ తప్పనిసరిగా దీనిని అమలులోకి తేవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విజయవాడలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం, ఉయ్యూరు, నందిగామ తదితర యూనిట్ కార్యాలయాల్లో నంబర్ ప్లేట్ల ఏర్పాటుకు అవసరమైన పనులు మొదలుపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతి కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించి, నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసే మిషనరీకి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్‌ను పూర్తిచేసి కార్యాలయాలను రవాణా శాఖ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు కొద్దిరోజుల్లో ప్లేట్ల తయారీ మిషన్లను ఏర్పాటుచేసే సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవడం తదితర పనులు పూర్తిచేసి దీనిని మొదలుపెట్టనున్నారు.




వాహనాల భద్రత కోసమే...



ప్రధానంగా వాహనాల భద్రత కోసమే వీటిని అమలులోకి తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేకంగా తయారయ్యే ఈ నంబర్ ప్లేట్లను వాహనాలకు అమర్చడం ద్వారా వాహనాలకు భద్రతతో పాటు దొంగ వాహనాల నుంచి కొంత రక్షణ ఉంటుంది. ప్రత్యేకమైన మెటాలిక్, క్రోమియంతో పాటు ఇతర లోహాలతో దీనిని తయారు చేస్తారు. సాధారణ నంబర్ ప్లేట్లలా కాకుండా వాహనంలో అంతర్భాగంగా ఉండేలా దీనిని అమరుస్తారు. ఒకవేళ దీనిని తొలగించాలంటే వాహన అడుగు భాగం కొంత దెబ్బతినే రీతిలో పకడ్బందీగా దీనిని అమరుస్తారు. ముఖ్యంగా భద్రత కోసమే ఈ చర్యలు చేపడుతున్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వివిధ నేరాలకు పాల్పడేవారు తాము వినియోగించే వాహనాల నంబర్ ప్లేట్లు మార్చివేసి యథేచ్ఛగా కార్యకలాపాలు చేస్తున్నారు. దీనివల్ల పోలీసుల దర్యాప్తు ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ క్రమంలో నిందితులు తేలిగ్గా తప్పించుకునే అవకాశముంటోంది. ప్రస్తుతం ఏర్పాటుచేయనున్న హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను మార్చటం అంత సులువు కాదు. ఒకవేళ వాటిని మార్చినా వెంటనే తెలిసిపోతుంది. ఇది పోలీసుల దర్యాప్తులో కీలకంగా దోహదపడుతుంది.



ముందు కొత్త వాహనాలకు..



 ప్రస్తుతం జిల్లాలో నెలకు సగటున 200 నుంచి 300 వరకు కార్ల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. తొలిదశలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలోనే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ నిబంధనను తప్పనిసరి చేసి అమలు చేయనున్నారు. ఆ తర్వాత మరో ఆరు నెలల కాలవ్యవధిలో జిల్లాలో ఉన్న పాత వాహనాలకు కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు.

 

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top