నేతలకు కేసుల నుంచి రక్షణా?

నేతలకు కేసుల నుంచి రక్షణా? - Sakshi




వారేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా: హైకోర్టు

1999లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మెమోపై మండిపాటు

అది సామాన్యుల పట్ల వివక్ష చూపే విధంగా ఉందని ఆక్షేపణ

 

 సాక్షి, హైదరాబాద్: మద్యం సిండికేట్లకు సంబంధించిన వ్యవహారం హైకోర్టులో సోమవారం కీలక మలుపు తిరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను కాపాడేందుకు 1999లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన మెమో చట్టబద్ధతను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులను రక్షించేందుకు ప్రభుత్వం మెమో జారీ చేసిందంటే అది సామాన్యుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. వారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద ఇటువంటి రక్షణ (ఇమ్యూనిటీ) ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా రక్షణ కల్పించేందుకు వారేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా! అని వ్యాఖ్యానించింది.

 

 మద్యం సిండికేట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తినీ వారి హోదాలకతీతంగా విచారించేలా ఏసీబీని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ.ఎం.దేబరా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని కన్నా ముందు మద్యం సిండికేట్లకు సంబంధించిన నివేదికను కోర్టు ముందుంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య మరో పిల్ దాఖలు చేశారు. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం... సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ దేబరా తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ... 1999లో జారీ అయిన మోమో గురించి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

 

 ఆ మెమో ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తే... వారిపై కేసు నమోదు చేయకుండా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించాలని... దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసే సలహా కమిటీ నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ మెమో వల్ల ఏసీబీ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయలేకపోయారని, మద్యం సిండికేట్లతో సంబంధం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, చట్టం ముందు అందరూ సమానమేనని... గూండాలు, మోసగాళ్లను నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) కింద విచారించి శిక్షిస్తున్నప్పుడు, ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రత్యేక రక్షణలు ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మెమోను ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా... అందుకు ఆయన కొంత సమయం కావాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. మెమోపై మంగళవారం తమ నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top