హై అలర్ట్

హై అలర్ట్


ఐబీ హెచ్చరికలతో    పోలీసుల అప్రమత్తం

సీఆర్‌డీఏ పరిధిలో నిఘా మరింత పటిష్టం

కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం


 

విజయవాడ సిటీ : ‘ఉగ్రమూకలు ఏ రూపంలోనైనా రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. నిఘాను పటిష్టం చేసి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయండి’ అంటూ కేంద్ర నిఘా సంస్థ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘాను పటిష్టం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో గస్తీని పెంచారు. ఇటీవల చోటుచేసుకుంటున్న ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లోని పోలీసులను అప్రమత్తం చేస్తూ కేంద్ర నిఘా సంస్థ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులను పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ అలర్ట్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు విదేశీ ప్రతినిధులు బస చేసిన ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. సీఎం క్యాంప్ ఆఫీసులోకి పూర్తి తనిఖీల తర్వాతనే పంపుతున్నారు.



రద్దీ ప్రాంతాల్లో..

నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసు పహారాను పెంచారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ వద్ద గస్తీని ముమ్మరం చేశారు. ఏఏ ప్రాంతాల్లో జనావాసాలు రద్దీగా ఉంటాయనేది గుర్తించి ఆయా చోట్ల సాయుధ పోలీసులతో పహారా నిర్వహిస్తున్నారు.  ప్రజలు అధికంగా సందర్శించే బీసెంట్‌రోడ్డు, రాజీవ్‌గాంధీ పార్కు, బెంజిసర్కిల్ ప్రాంతాల్లో మరింత అప్రమత్తమయ్యారు. షాపింగ్ మాల్స్ సహా ప్రైవేటు సంస్థల్లో సీసీ కెమెరాలను వినియోగంలోకి తేవాలంటూ యజమానులకు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు జరుపుతున్నారు. తగిన రశీదులు లేని వాహనాలను సీజ్ చేయాలంటూ పోలీసు అధికారులు దిగువ స్థాయి అధికారులకు సూచిస్తున్నారు.

 

ప్రయాణ ప్రాంగణాల్లోనూ..

ప్రయాణికులు ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్కరి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు వివిధ విభాగాలకు చెందిన నిఘా సిబ్బందిని మోహరించారు. ప్రయాణికులెవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ తర్వాతనే వదలాలంటూ పోలీసు అధికారులకు ఉన్నత స్థాయి ఆదేశాలు అందాయి.  



 దుర్గగుడిపై..

 రాష్ట్రంలోని రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భద్రతను పెంచారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే వ్యక్తుల కదలికలు గమనించేందుకు షాడో పార్టీలను నియమించారు. భక్తుల ముసుగులో అసాంఘికశక్తుల రాకను నిలువరించేందుకు  అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.

 

 

గుంటూరు నగరంపై డేగకన్ను..


గుంటూరు : నూతన రాజధాని నిర్మాణం జరుగనున్న గుంటూరులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జిల్లా పోలీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. ఉగ్రజాడపై నిఘా ఉంచాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి తోడు కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు సైతం గుంటూరు నగరంపై డేగకన్ను వేశారు. మూడు నెలల క్రితం సెమి ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు నిర్వహించిన సంఘటనకు సంబంధించి వారి మూలాలు గుంటూరు, విజయవాడలో ఉంటాయని వార్తలు వినరావడంతోఅప్పట్లో పోలీసులు పూర్తి స్థాయిలో నిఘాను పటిష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో నిత్యం విదేశీ ప్రతినిధులు పర్యటిస్తున్న నేపథ్యంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇంటిలిజెన్స్ పోలీసులు కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top