ఇకనైనా మారండి..!

ఇకనైనా మారండి..! - Sakshi


హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించండి...

చట్టం...కట్టుదిట్టం

{పమాదాల నివారణకు బెల్ట్ బిగిస్తున్న యంత్రాంగం


 

తాటిచెట్లపాలెం : విశాఖపట్నానికి చెందిన రవికుమార్ కొత్తకారుని కొనుగోలు చేశాడు. ఈ సంతోషకరమైన సమయంలో తన కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్దామనుకుని బయలుదేరాడు. రోడ్‌పై రయ్ రయ్ మంటూ పరిమితికి మించినవేగంతో ముందుకుదూసుకుపోతున్నాడు. వాహనాన్ని నడుపుతూ కుటుంబంతో కబుర్లు చె ప్పుకుంటూ వాహనాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఎక్కడనుంచో పరిగెత్తుకొచ్చిన కుక్క రోడ్డుకు అడ్డుగా పరిగెత్తింది. దానిని తప్పించే ప్రయత్నంలో స్టీరింగ్ ను ఒక్కసారిగా మలుపుతిప్పాడు రవికుమార్. ఈ క్రమంలో ఆ కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా కారు అద్దాల్లోంచి బయటకు నెట్టివేయబడ్డారు. ఇంకే ముంది.. తీవ్రమైన గాయాలతో ఆర్తనాదాలు చేసే వారు కొందరైతే, అప్పటికే మరణించిన వారు మరికొందరు.  ప్రమాదం జరగకపోయినా అనుకోకుండా జరిగిన హఠాత్తు పరిణామానికి వీరంతా బలయ్యారు. ఎంతో ఆనందంగా బయలుదేరిన వీరంతా ప్రయాణసమయంలో  సీటు బెల్ట్ వాడకం పై దృష్టిసారించి ఉంటే  వారంతా తిరిగి ఇంటికి క్షేమంగా చేరేవారు.



 ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు...  

 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాహనప్రమాదాలు జరగడంలో చోటుచేసుకునే ఐదు రిస్క్ ఫ్యాక్టర్స్‌ను విడుదలచేసింది. అందులో డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, స్పీడింగ్, శిరస్త్రాణం, సీటు బెల్ట్ ధరించకపోవడంతో పాటుగా పిల్లల పరిమితుల్ని (ఛైల్డ్‌రెస్ట్రైన్ట్స్) అందులో చేర్చింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడంతో వాహన చోదకులు నిత్యం ఏదో మూల ప్రమాదాలకు గురవుతున్నారు. శిరస్త్రాణం ధరించకపోవడంతో ద్విచక్రవాహనచోదకులు ప్రాణాలు కోల్పోతుంటే, సీటు బెల్టు ధరించకపోవడంతో ఇతర వాహనాల్లో ప్రయాణించేవారు సైతం ప్రాణాలను కోల్పోతున్నారు. వీరిలో ప్రముఖ రాజకీయనాయకులు గోపీనాథ్‌ముండే, శోభానాగిరెడ్డి, ఎర్రన్నాయుడు వంటి వారూ ఉండడం విశేషం.

 

 చట్టం...ఇక కట్టుదిట్టం..

 మోటారు వెహికల్ యాక్ట్ , 1988 ప్రకారం వాహనదారుడు ప్రయాణ సమయంలో సీట్‌బెల్ట్ ధరించనట్టయితే రూ.100 నుంచి గరిష్టంగా రూ.200 వరకూ ట్రాఫిక్ పోలీసులు వసూలు చేస్తున్నారు. సరేలే వందా రెండు వందలే కదా అని చేతులు దులిపేసుకునే రోజులు పోయాయి. ఆ ఆలోచన నేటితో వదిలేయాల్సిందే.  



 ఆగస్టు 1 నుంచి వ్యవహారం పూర్తి భిన్నంగా మారుతోంది. ఇకపై హెల్మెట్‌ధారణ చేయనివారి పట్ల, కారు డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్ సీట్‌బెల్ట్ ధరించని పక్షంలో వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు..హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తే  వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలనీ, సదరువ్యక్తి హెల్మెట్ కొనుగోలు చేసి సంబంధిత బిల్లును చూపిస్తే నామమాత్రపురుసుముతో వారిని వదిలిపెట్టనున్నారు. సీటు బెల్టు పెట్టుకోని కారుడ్రైవర్ నుంచి మొదటిసారి తప్పిదంగా భారీ జరిమానా విధించి రెండోసారి ఇదే పొరపాటు సంబంధిత డ్రైవర్ చేసినట్టయితే అతని లెసైన్స్ రద్దు చేస్తారు.



 కేసుల నమోదు...

2014 సంవత్సరంలో నగర పరిధిలో మొత్తం 21500 సీట్‌బెల్ట్ కేసులు నమోదు అయ్యాయి. తద్వారా వచ్చిన ఆదాయం రూ.21,50,000 2015 సంవత్సరంలో 11534 కేసులు నమోదు కాగా తద్వారా రూ. 11,53,400 జరిమానల రూపంలో నగర ట్రాఫిక్ పోలీసులు వసూలు చేశారు.

 

  సీట్‌బెల్ట్ ఎందుకంటే...?


సీట్‌బెల్ట్..అనుకోకుండా ప్రమాదం సంభవించినప్పుడు లిప్తపాటుకాలంలో వాహనచోదకుడికి రక్షణ కల్పించే కవచం.వాహనం నడిపే సమయంలో అత్యవసరంగా బ్రేక్ వేసినపుడు గానీ, పక్కకు మలుపు తిరిగినపుడు ముందుకు పడకుండా కాపాడుతుంది ఈ సీట్‌బెల్ట్. సీటుబెల్ట్ ధరించి స్టీరింగ్ వీల్, డాష్ బోర్డు, విండ్‌షీల్ట్‌లను మనం ఢీకొనే ప్రమాదాన్ని నివారించవచ్చును.నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సర్వే ప్రకారం సీటు బెల్ట్ వినియోగం వల్ల ప్రతి యేటా దాదాపు 15 వేల మంది ప్రమాదాల సమయంలోనూ బతికి బయటపడగలుతున్నారు.{పయాణ సమయంలో సీట్ బెల్ట్ ధరించడం వల్ల ముఖ్యమైన శరీర అవయవాలను కాపాడబడతాయి.హఠాత్తుగా ప్రమాదం సంభవిస్తే ఆ సమయంలో సీట్‌బెల్ట్ ధరిస్తే వాహనం లోపలే ఉండగలరు.

 

 పిల్లలకు ఇలా రక్షణ...


పిల్లల్ని వెనుక సీటులోనే కూర్చోనివ్వడం,  విధిగా సీట్‌బెల్ట్ వాడేలా చూడటం ముఖ్యంఅమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం పుట్టిన సమయంనుంచి 2 సంవత్సరాలు వయసున్న పిల్లలను రియర్ ఫేసింగ్ కారుసీట్‌లో కూర్చోబెట్టాలి.2 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలను ఫార్వర్డ్ ఫేసింగ్ కారుసీట్‌లో కూర్చోబెట్టాలి. 5 సంవత్సరాలు ఆపై వయసు ఉన్న పిల్లలను బూస్టర్ సీటులో కూర్చోబెట్టాలి.వయసుతో సంబంధం లేకుండా సీట్‌బెల్ట్ సెట్ అయినట్టయితే వారికి బూస్టర్ సీట్ అవసరంలేదు.

 

అవగాహన కల్పిస్తున్నాం...


నగర పరిధిలో సీటు బెల్ట్ ధరించకుండా ప్రయాణించేవారి సంఖ్య పెరిగిపోతోంది. వీరందరిపై మేం కొరడా ఝులిపిస్తున్నాం. ఈ విషయమై పలు అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. హెల్మెట్ ధారణ లేకుండా, అలానే సీట్‌బెల్ట్ లేకుండా ప్రయాణం సాగించడం క్షేమకరం కాదు. ఒక వేళ ప్రమాదం సంభవించినపుడు ముఖ్యమైన అవయవాలపై ప్రభావం పడుతుంది.

 - కింజరపు ప్రభాకర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ విభాగం

 

 కఠిన చర్యలు

 సీట్ బెల్ట్‌ధరించని వారిపై పలు కేసులు నమోదుచేస్తున్నాం. నేషనల్ హైవేలో ప్రమాదాల సంఖ్య రానురానూ పెరుగుతోంది. క్రమంలో సీట్‌బెల్ట్ ధరించని వారు ప్రమాదం సంభవించిన సమయంలో తీవ్ర గాయాలపాలవుతున్నారు. చిన్నదిగా కనిపించి, తేలికగా తీసుకునే ఈ సీట్‌బెల్ట్ వ్యవహారం, అకస్మాత్తుగా జరిగే ప్రమాదంతోనే కనువిప్పు కలిగిస్తుంది. కుటుంబ రక్షణకు సీట్ బెల్ట్ రక్షణగా ఉంటుందనడంలో ఏమాత్రం సంశయం లేదు.

 - సుధాకర్, ట్రాఫిక్ ఎస్‌ఐ, 4వ పట్టణ పోలీస్‌స్టేషన్

 

ఆలోచన మారాలి...

 వాహనచోదకులు సీట్‌బెల్ట్ ధరించపోవడం వల్లనే చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. సీటు బెల్ట్ ధరించినట్టయితే చిన్న చిన్న గాయాలతోనైనా బయటపడే పరిస్థితి ఉంటుంది. సీట్‌బెల్ట్ వాడని పక్షంలో ఎదురుగా అమర్చిన ఎయిర్‌బెలూన్స్ ప్రమాద సమయంలో ఓపెన్ కావు. తద్వారా ప్రమాద తీవ్రత మరింత జరిగే ఆస్కారమూ ఉంది.  ప్రతి ఒక్కరు  తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని సీట్‌బెల్ట్ వాడడం శ్రేయస్కరం.

 - కె.మహేంద్రపాత్రుడు, ఏడీసీపీ, నగరట్రాఫిక్ విభాగం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top