కట్టినవాడే.. కన్నం వేశాడు!


ముందు కొందరు ఆగంతకుల పరుగులు.. వారిని వెంటాడుతూ మరికొందరు.. ఆ వెంటనే తుపాకుల కాల్పులు.. సినిమాల్లో తప్ప ప్రత్యక్షంగా ఇటువంటి సంస్కృతి గానీ.. దృశ్యాలు గానీ కనీవినీ ఎరుగని పాలకొండ పట్టణం బెదిరిపోయింది. ఆ తర్వాత తెలిసింది.. ఒడిశా దొంగలను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు ఈ వేట సాగించారని..! ఒడిశా దొంగలు ఇక్కడికెలా వచ్చారు?.. వారి అనుపానులు పోలీసులకెలా తెలిశాయంటే.. రాయగడలో తీగ లాగితే పాలకొండలో డొంక కదిలింది. అక్కడ జరిగిన భారీ చోరీకి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే సూత్రధారి.. పాత్రధారి అని తెలిసింది. తాపీమేస్త్రీ అయిన ఆ ఘనుడు కట్టిన ఇంటికే కన్నం వేయించాడని తేలింది. దాంతో వేట సాగింది.. ఐదుగురు పట్టుబడ్డారు. కొంత సొత్తూ దొరికింది.

 

* పాలకొండలో తేలిన రాయగడ భారీ చోరీ కేసు

* ఎస్.కె.రాజపురంవాసే సూత్రధారి

* 15 ఏళ్ల క్రితమే రాయగడలో స్థిరనివాసం

* తాపీమేస్త్రీగా ఉంటూ నేరస్తుడు శివతో చెలిమి

* మరో పదిమందితో కలిసి బంగారు వర్తకుడి ఇంటికి కన్నం

* రూ.1.50 కోట్ల బంగారం, నగదు చోరీ

* మోయలేక 80 కేజీల వెండి వదిలిపెట్టారు

* క్లూ ఇచ్చిన భూగృహ నిర్మాణం

* మేస్త్రీని అదుపులోకి తీసుకొని వల వేసిన పోలీసులు

* దొరికిపోయిన ప్రధాన నిందితుడితోసహా ఐదుగురు

పాలకొండ: దొంగల వేట.. తుపాకుల కాల్పుల ఘటనతోనే హడలిపోయిన పాలకొండవాసులు ఈ ఘటనలో పట్టుబడినవారు కరుడుగట్టిన నేరస్తులని.. వారికి తమ ప్రాంతానికి చెందిన వ్యక్తే ఆశ్రయమిచ్చాడని తెలుసుకొని ఉలిక్కిపడుతున్నారు. మిగిలిన నిందితుల్లో కొందరు ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నారన్న ప్రచారం జరగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల ఆరో తేదీన ఒడిశాలోని రాయగడలో జరిగిన భారీ చోరీ.. ఆ నేపథ్యంలో బుధవారం పాల కొండలో జరిగిన ఘటనలపై ‘సాక్షి’ పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఈ మొత్తం చోరీ ఘటన వెనుకీలక సూత్రధారి, పాత్రధారి పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఎస్.కె.రాజపురం గ్రామానికి చెందిన ఓ తాపీమేస్త్రి అని పోలీసువర్గాల ద్వారా తెలిసింది.

 

15 ఏళ్ల క్రితం వలస

సదరు తాపీమేస్త్రి 15 ఏళ్ల కిందట పనుల కోసం రాయగడ వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. తాపీ మేస్త్రీగా ఉంటూ సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి పాత నేరస్తుడైన శివతో పరిచయం ఏర్పడింది. అతని ఇంటిని కూడా ఈ మేస్త్రీయే నిర్మించాడు. అప్పటినుంచి ఇద్దరూ సన్నిహితంగా ఉంటూ రౌడీయిజంతో చిన్నచిన్న సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మేస్త్రీ ఇంటికి సమీపంలోనే పట్టణానికి చెందిన బంగారు వర్తకుడు కింతలి రమేష్ భారీ భవంతిని నిర్మించారు. దీని నిర్మాణపనులను ఈ మేస్త్రీకే అప్పగించారు. ఈ భవనంలో అండర్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల రమేష్ కుటుంబంతో తిరుపతి వెళ్లారు. ఈ విషయం తెలిసిన మేస్త్రీకి ఆ ఇంటిపై కన్నుపడింది.



విషయాన్ని స్నేహితుడు శివకు తెలియజేశాడు. ఇంటిలో ఎక్కడ ఏం ఉన్నాయి, అండర్ గ్రౌండ్‌కు దారి తదితర వివరాలన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. అందరూ కలిసి చోరీకి ప్లాన్ చే శారు. సమీపంలోనే ఉన్న రైల్వేస్టేషన్ నుంచి రైల్వే ట్రాలీని దొంగిలించి తెచ్చుకున్నారు. మొత్తం 12 మంది ఈ నెల ఆరో తేదీ తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు 80 కేజీల వెండిని రెండు మూటలుగా కట్టారు. ఇంతలో అండర్ గ్రౌండ్‌లో దాచిన రూ.1.20 కోట్ల విలువైన బంగారం, రూ.30 లక్షల నగదు కంటపడటంతో.. బరువుగా ఉన్న వెండి మూటలను విడిచిపెట్టి బంగారం, నగదు మాత్రం తీసుకొని రైల్వేస్టేషన్‌కు చేరుకొని.. అక్కడి నుంచి చెరోవైపు వెళ్లిపోయారు.



రాయగడలో సంచలనం సృష్టించిన ఈ చోరీ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఇంట్లో అండర్ గ్రౌండ్ ఉందని, ఆ విషయం ఇంటి యజమానితోపాటు ఇంటిని నిర్మించిన మేస్త్రీకి మాత్రమే తెలుసన్న సమాచారం అందింది. అతనిపై అనుమానం మొదలైంది. మేస్త్రీ  కదలికలపై నిఘా పెట్టారు. కాగా అప్పటికే అతను తన స్వగ్రామైన ఎన్.కె.రాజపురం చేరుకున్నట్టు పసిగట్టారు. రెండు రోజుల కిందట కొందరు పోలీసుల వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.



అతని నుంచి సమాచారం సేకరించి ప్రధాన నిందితుడు శివ కోసం గాలం వేశారు. మేస్త్రీతోనే అతనికి ఫోన్ చేయించి తన గ్రామానికి వచ్చేయాలని, ఇక్కడైతే ఎటువంటి సమస్య ఉండదని నమ్మబలికించారు. దాంతో శివ నలుగురు అనుచరులను, చోరీ చేసిన బంగారం, నగదును తీసుకొని ఎస్.కె.రాజపురం చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఒడిశా పోలీసులు వారిపై దాడికి ప్రయత్నించారు. ఆ విషయం పసిగట్టిన నిందితులు పంట పొలాలవైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.

 

కరుడుగట్టిన నేరస్తులు...

ఒడిశా పోలీసులు పట్టుకున్న వారు కరుడుకట్టిన నేరస్తులని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు శివ ఆరు హత్య కేసులతో సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు చెబుతున్నారు. పలు కేసుల్లో నేరస్తులను పట్టుకోవడంలోనూ పాలకొండ పోలీసులకు శివ సహాయం చేసినట్టు కూడా తెలుస్తోంది. గత ఏడాది జరిగిన ఓ దొంగతనం కేసులో ఒడిశా దొంగలను పట్టుకోవడానికి స్థానిక పోలీసులు శివ సాయం తీసుకున్నారని తెలుస్తోంది.



కాగా పట్టుబడిన ఐదుగురు మినహా మిగిలిన నిందితులు కూడా ఈ పాలకొండ పరిసరాల్లోనే ఉన్నట్లు తెలిసింది. పట్టుబడినవారు కూడా గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. భోజనాల కోసం వీరు పలు అయ్యప్ప దీక్షా శిబిరాల వద్దకు హాజరైనట్టు పేర్కొంటున్నారు. కరుడుగట్టిన నేరస్తులతో స్థానిక వ్యక్తి సావాసం చేయడం, నేరాలకు పాల్పడడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

 

బంగారం, నగదు ఏమైనట్టు?

ప్రధాన నిందితుడు శివ నుంచి పోలీసులు రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే మిగతా బంగారం, నగదు ఏమయ్యాయన్నదానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. నిందితుల వద్ద ఒక పెద్ద బ్యాగు ఉండేదని దాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. వారు ఒడిశా పోలీసులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలకొండకు చెందిన వ్యక్తి ఇంటిలోనూ కొంత మొత్తం దాచి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీరందరినీ ప్రస్తుతం ఒడిశా పోలీసులు రాయగడకు తరలించి విచారణ జరుపుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top