వర్షపాతం సాదారుణం

వర్షపాతం సాదారుణం


వరుణుడు జిల్లాపై కరుణ చూపడం లేదు. అక్కడక్కడ చిరు జల్లులు కురిపించి మాయమవుతున్నాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విధంగానైనా జిల్లాలో వర్షాలు పడతాయని ఆశించిన అన్నదాతకు నిరాశే మిగిలింది. అక్కడక్కడా వర్షాలు పడినా అవి ఎందుకూ ఉపయోగపడడం లేదు.  కేవలం తొమ్మిది మండలాల్లోనే ఆశించిన మేర వర్షపాతం నమోదయింది. చాలా చోట్ల నాట్లు వేయలేని  పరిస్థితి నెలకొంది. చెరువులు కూడా ఎండిపోవడంతో ఈ సీజన్‌లో సాగు చేసేదెలా అని రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 

 విజయనగరం వ్యవసాయం:  వరుణుడు  కరుణ కొన్ని మండలాలకే పరిమితం అయింది. జిల్లాలో 34 మండలాలకుగాను కేవలం తొమ్మిది  మండలాల్లోనే ఆశించిన స్థాయిలో వర్షం పడింది. మిగిలిన 25 మండలాల్లో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయింది.  అల్పపీడనం కారణంగా నిన్నటి వరకు కురిసిన వర్షాల వల్ల జిల్లాలో  కొన్ని మండలాల రైతులకు మాత్రమే ఉపయోగకరం కానుంది. 25 మండలాల్లో  పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. నారుమళ్లకు కాస్త ఉపయోగపడినా నాట్లు వేయడానికి మాత్రం  సరిపడా వర్షం కురవలేదు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరి 1,16,536 హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ అధికారులు భావించారు. అయితే ఇప్పటి వరకు 1527 హెక్టార్లలో మాత్రమే సాగయింది. అదికూడా ఎద పద్ధతిలో సాగుచేశారు.  

 

 నిండని చెరువులు,గుంతలు

  70 శాతం భూముల్లో వర్షధారంపైనే ఆధార పడి పంటలు వేస్తారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవని కారణంగా  జలాశయాల్లో కూడా నీరు చేరలేదు. దీంతో వీటి కింద ఉన్న ఆయకట్టు భూముల్లో ఉభాలు ప్రారంభం కాలేదు. జిల్లాలో తొమ్మిది వేల  చెరువులున్నాయి. వీటిలో 90 శాతం చెరువులు నీరు లేక ఎండిపోయి నెర్రెలు వారి దర్శనమిస్తున్నాయి.చిన్న చిన్న నీటి గుంతల్లో కూడా నీరు చేరలేదు.

 

 80 శాతం నారుమళ్లు సిద్ధం

 జిల్లాలో ఇంతవరకు 80 శాతం మాత్రమే నారుమళ్లు సిద్ధమయ్యాయి. ఇంకా 20 శాతం మంది నారుపోయాల్సి ఉంది. నారు  పోయడానికి సరిపడా తడి లేకపోవడంతో వారు వెనుకాడుతున్నారు. ఎక్కడా ఉభాలు ప్రారంభంకాలేదు. ఈపాటికే ఉభాలు ప్రారంభమైతే ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చేంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షా లు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.   

 

 9 మండలాల్లోనే ఆశించిన స్థాయిలో వర్షం  

 జిల్లాలో కేవలం తొమ్మిది మండలాలు మక్కువ, గజపతి నగరం, గుర్ల, బొండపల్లి, నెల్లిమర్ల, ఎస్.కోట, సాలూరు, పాచిపెంట, బలిజిపేటల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది.

 

 1527 హెక్టార్లలో ఎద పద్ధతిలో సాగు

 వర్షాలు లేకపోవడం వల్ల జిల్లాలో 1,527 హెక్టార్లలో వరి పంటను ఎద పద్ధతిలో వేశారు. కురుపాం మండలంలో 66 హెక్టార్లు, బలిజిపేటలో 1094 హెక్టార్లు, బొబ్బిలిలో 142 హెక్టార్లు,సాలురులో 89 హెక్టార్లు, రామభద్రపురంలో 48 హెక్టార్లు, మెరకముడిదాం 20 హెక్టార్లు, కొమరాడలో మూడు, గరుబుబిల్లిలో 65 హెక్టార్లలో  వరి పంటను సాగు చేశారు.

 

 వచ్చే నెల మొదటి వారంలోగా నాట్లు వేసుకోవచ్చు

 నెలాఖరు లోగా  వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసినట్టయితే వచ్చేనెల మొదటి వారంలోగా నాట్లు వేసుకోవచ్చు. ఆగస్టు 15వ తేదీ  వరకు వర్షాలు కురవనట్టయితే మధ్యస్తరకాలైన ఎన్‌ఎల్‌ఆర్ 34449, ఎంటీయూ 1001 రకాలను డ్రమ్ సీడర్‌తోగానీ, సీడ్ డ్రీల్‌తోగానీ వేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో పత్తికి ప్రత్యామ్నాయంగా శనగ, మొక్కజొన్న పంటలను వేసుకోవాలి.

 -డి.ప్రమీల,వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top