కట్టుబట్టలే మిగిలాయి..

కట్టుబట్టలే మిగిలాయి.. - Sakshi


♦ పసుమర్రులో ఘోర అగ్ని ప్రమాదం

♦ 6 నివాస గృహాలు దగ్ధం

♦ రోడ్డున పడిన 8 కుటుంబాలు

♦ రూ.7 లక్షల వరకూ ఆస్తి నష్టం అంచనా

 

 పసుమర్రు (పామర్రు) : ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో  8 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. మండల పరిధిలోని పసుమర్రు గ్రామ శివారు ప్రాంతమైన వీరాబత్తినవారి పురంలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి. ఆ ప్రాంతంలోని పురుషులందరూ వ్యవసాయ పనులకు వెళ్లిగా, మహిళలు దుస్తులు ఉతుక్కునేందుకు  గ్రామంలోకి వెళ్లారు. ఆ సమయంలో బత్తుల నాగమురళి ఇంటి నుంచి గ్యాస్ బండ పేలి పైకి లేవడంతో పెద్ద శబ్దం వచ్చింది. గమనించిన స్థానికులు వచ్చి చూసేసరికి మురళి ఇంటిలో నుంచి నిప్పులు రావడం గమనించారు. వెంనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.



 ఈ లోపు వీస్తున్న గాలులకు మంటల మరింత వ్యాపించి  చుట్టుపక్కల ఉన్న ఇళ్లకూడా అగ్నికి ఆహుతవ్వడమే కాకుండా మరో మూడు సిలెండర్‌లు పేలి పోయాయి. సుమారు రూ.7 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.



 మిన్నంటిన రోదనలు..

 తాము ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఉన్న ఇళ్లు తిరిగి వచ్చేసరికి బూడిదగా మారిపోయాయని బాధిత కుటుంబాలు భోరుమన్నాయి. గృహోపకరణాలతో పాటు మినుముల బస్తాలు, నగదు, బంగారం, విద్యార్థుల సర్టిఫికెట్లు, విలువైనపత్రాలు అగ్గిపాలైయ్యాయని వాపోతున్నారు. పామర్రు, మువ్వ మండల అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. తహశీల్దార్ ఏవీఎన్‌ఎస్ మూర్తి, ఎంపీడీవో జె.రామనాథం, ఏఎస్‌ఐ కోటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ భవానీ ప్రసాద్, వీఆర్వో శ్రీనివాసరావు బాధితులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  



 బాధిత కుటుంబాల వివరాలివే..

 పస్తాల బుజ్జి, పస్తాల ధనమ్మ, వేమూరి మురళి, కంచర్ల భూషమ్మ, పస్తాల ఆంజనేయులు, పస్తాల నాగమురళి, పస్తాల నాగరాజు, పస్తా ఈశ్వరరావులను బాధిత కుటుంబాలుగా గుర్తించారు. ఇదే కాకుండా ఘటనలో వీరాబత్తిన రాంబాబు, నిమ్మగడ్డ నాగస్వామిలకు చెందిన పశుశాలలు, గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top