పేదల నిధులకు భారీ కోత!

పేదల నిధులకు భారీ కోత! - Sakshi

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై సర్కారు చిన్నచూపు

  • బడ్జెట్ కేటాయింపుల్లో రూ.1,859 కోట్ల మేరకు కత్తెర

  • విద్య, వైద్య, ఆరోగ్య రంగాల కేటాయింపుల్లోనూ కోతలు

  • సాక్షి, హైదరాబాద్: పేద  వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిజానికి ఆయా వర్గాలను దొంగ దెబ్బ తీస్తోంది. వారికి చెందాల్సిన సంక్షేమ నిధుల్లో భారీగా కోతలు పెడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు సగం కూడా ఖర్చు చేయలేదు. పైగా ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తుండగా బడ్జెట్ కేటాయింపుల్లో సగానికి పైగానే కోత విధించింది.



    ప్రణాళికేతర రెవెన్యూ వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమ పథకాలకు రూ. 3,644 కోట్లు కేటాయించారు. అయితే డిసెంబర్ వరకు కేవలం రూ. 1,072 కోట్లే రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసింది. తాజాగా జనవరి నుంచి మార్చి వరకు కేవలం రూ.713 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. అంటే బడ్జెట్ కేటాయింపుల్లో సగానికి పైగానే (రూ.1,859 కోట్లు) కోత విధించినట్లు స్పష్టమవుతోంది. బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా మార్జిన్ మనీ కింద, బీసీ అభ్యుదయ యోజన కింద లబ్దిదారులకు రూ.300 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.



    అయితే ఇప్పటివరకు ఒక్కరికి కూడా పైసా సాయం అందించలేదు. అలాగే వైద్యం, ప్రజారోగ్య రంగ కేటాయింపుల్లో కూడా ప్రభుత్వం కోతలు విధించింది. వైద్య, ప్రజారోగ్యానికి రూ.3,339 కోట్లు కేటాయించగా డిసెంబర్ వరకు సగం కూడా నిధులను విడుదల చేయలేదు. కేవలం రూ.1,161 కోట్లు విడుదల చేయగా ఆ మొత్తం ఖర్చు అయింది. ఇక జనవరి నుంచి మార్చి వరకు మరో రూ.772 కోట్లు మాత్రమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.



    అంటే ఈ రంగానికి రూ.1,406 కోట్ల మేర కోత విధించిందన్నమాట. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, భారీ సాగునీటి పారుదల, రహదారులు-భవనాలు రంగాల కేటాయింపుల్లో కూడా కోతలు విధించింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రణాళికేతర పద్దులో రెవెన్యూ వ్యయం కింద రూ.78,979 కోట్లు కేటాయించింది.



    ఇప్పుడు అందులో ఏకంగా రూ.19,572 కోట్ల మేర కోత విధించాలని నిర్ణయించింది. రూ.78,979 కోట్లలో డిసెంబర్ వరకు రూ.35,666 కోట్లు వ్యయం చేశారు. జనవరి నుంచి మార్చి వరకు మరో రూ.23,739 కోట్లే వ్యయం చేయాలని నిర్ణయించారు. అంటే మొత్తంగా రూ.59,406 కోట్లే ఖర్చు చేయనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top