ఇల్‌హెల్త్ పాలసీ

ఇల్‌హెల్త్ పాలసీ - Sakshi


ఓపీలో నాలుగు సార్లు మాత్రమే పరీక్షలు

మందులు రూ.3వేలకే పరిమితం

ఇన్వెస్టిగేషన్స్‌కు రూ.4వేలు మాత్రమే.. ఆపైన సొంత డబ్బులే..

మధుమేహం, కిడ్నీ వ్యాధులపై పలు నిబంధనలు


 

 

లబ్బీపేట : సాధారణ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు వరాల జల్లు కురిపించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కారనడానికి ఎంప్లాయీస్ హెల్త్ స్కీం నిదర్శనంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు అందరికీ నగదు రహిత వైద్య సేవలు అంటూ కార్డులు పంపిణీచేసిన ముఖ్యమంత్రి సవాలక్ష నిబంధనలు విధించడంతో కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చేతులెత్తేసిన విషయం తెలిసింది. ఓపీ, ఇన్వెస్టిగేషన్, మెడికల్ ఇన్‌లెస్ సేవలపై ఆస్పత్రులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వాటిని భోదనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లోనే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ప్యాకేజీలను సైతం నిర్ణయించింది. ఈ ప్యాకేజీల వల్ల ప్రయోజనం లేదని, హెల్త్ పాలసీ ఇల్‌హెల్త్ స్కీంగా మారిం దని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.



ఓపీ ప్యాకేజీ ఎలా ఉందంటే..



కార్డియాక్ ఫెయిల్యూర్ అయిన ఉద్యోగికి ఏడాదిలో 4 సార్లు ఓపీ పరీక్షలు చేస్తారు. ఐదోసారి అవసరమైతే ఏమిటనేది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో లేదు. ఏడాదికి రూ.3 వేల విలువైన మందులు ఇస్తారు. ఇన్వెస్టిగేషన్స్‌కు రూ.4,090 చొప్పున ఏడాదికి మొత్తం రూ.7,490 సేవలు అందిస్తారు. కార్డియాక్ ఫెయిల్యూర్ అయితే ప్రతి నెలా వైద్య పరీక్షలతో పాటు, రక్తపోటు, సుగర్ పరీక్షలు చేయాలి.

  నెలకు ఇన్వెస్టిగేషన్స్‌కు రూ.1000 నుంచి రూ.1500 ఖర్చవుతుంది. మందులకూ నెలకు అంతే మొత్తం భరించాలి. మరి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ఎలా సరిపోతుందనేది ఉద్యోగులు వాదన.



మందులనూ నిర్ణయించింది



ప్రభుత్వాస్పత్రిల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకూ నిర్వహించే ప్రత్యేక క్లినిక్‌లలో 25 వ్యాధులకు పరిమితం చేసింది. వాటికి సంబంధించి 101 రకాల మందులకు సైతం ప్రభుత్వమే నిర్ధారించింది. ఇంతర మందులు అవసరమైతే పరిస్థితి ఏమిటనేది పేర్కొనలేదు. టైప్ 2 డయాబెటిక్ వారికి ఏడాదికి ఇన్వెస్టిగేషన్స్‌కు (హెచ్‌బీఏ1సీ, ఎఫ్‌బీఎస్, ఎఫ్‌ఎల్‌పీ, సీయూఈ, చెస్ట్ ఎక్స్‌రే, ఈసీజీ, 2డీ ఎకో) రూ.1473 కేటాయించారని, ఈ మొత్తం ఒక్కసారికే సరిపోతుందని వైద్యనిపుణులు పేర్కొం టున్నారు. అయితే మూడు నెలలకు, కనీసం ఆరు నెలలకు ఒకసారైనా ఇన్వెస్టిగేషన్స్ చేయిం చక తప్పదని, ఈ మొత్తం ఎలా సరిపోతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. బ్రాంచియల్ ఆస్తమాకు రూ.1530, నెఫ్రోటిక్ సిండ్రోమ్‌కు రూ.270, కిడ్నీ వ్యాధులకు రూ.1,948, సైకోసిస్‌కు రూ.835, బ్రెయిన్‌స్ట్రోక్‌కు రూ.3,436, వాస్కులర్ ఆక్లూసివ్ డిసార్డర్‌కు రూ.2,011, ఆస్టియో ఆర్థరైటీస్‌కు రూ.1,120, క్రోనిక్ హెపటైటీస్‌కు రూ.980 కేటాయించారు. ఆ ప్యాకేజీల్లో కూడా ఏ పరీక్షలు చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించింది. ఇవి కాకుండా ఇతర పరీక్షలు అవసరమైతే చేతి రుసుము చెల్లించుకోక తప్పదు.



ఉద్యోగుల ఆగ్రహం



ఎంప్లాయీస్ హెల్త్ పాలసీలో ప్రభుత్వ నిబంధనల వల్ల నగదు రహిత వైద్యం సాధ్యంకాదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని నిలిపివేస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం, మరోవైపు ఈహెచ్‌ఎస్ కార్డులపై కార్పొరేట్ ఆస్పత్రులు సేవలు అందించేందుకు సిద్ధంగా లేవన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీంను సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

 

సౌకర్యాలు లేకుండా వైద్యం ఎలా..?

 

ప్రభుత్వాస్పత్రిల్లో కనీస సౌకర్యాలు లేకుండా వైద్యం ఎలా చేస్తారు? మా జీతాల్లో డబ్బు కట్‌చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం చేస్తామంటే ఎలా? ఈ రోజు కాకినాడ ఎన్‌సీసీ కమాండెంట్ జీపు డ్రైవర్‌కు రక్తనాళాలు చిట్లి కాకినాడ ఆస్పత్రిలో చేరితే వైద్యం అందించే పరిస్థితి లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

 - సీహెచ్ శ్రీనివాసరావు, డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు

 

ఒప్పుకొనేది లేదు

 

మా వద్ద డబ్బు తీసుకుని, ప్రభుత్వాస్పత్రిల్లో ఓపీ సేవలు అందిస్తామంటే ఒప్పుకునేది లేదు. గతంలో మాకు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం ఏడాదికి రూ.300 కోట్లు ఖర్చుచేసేంది. ఇప్పుడు మేమే రూ.200 కోట్లు చెల్లిస్తున్నాం. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాకుండా ప్రభుత్వాస్పత్రిలో సేవలు అందిస్తామంటే ఎలా? ఇక హెల్త్ కార్డులెందుకు?



 - వాసు, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ నాయకుడు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top