Alexa
YSR
'తెలుగువారి గుండె చప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు.. నా జన్మ ధన్యమైనట్టే'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్కథ

చనిపోయిన వ్యక్తికి వైద్యం..

Sakshi | Updated: December 06, 2014 03:26 (IST)
చనిపోయిన వ్యక్తికి వైద్యం..

చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుని బంధువుల ఆందోళన
రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించి మోసం చేశారని మండిపాటు
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందని ఆస్పత్రి అద్దాలు ధ్వంసం


చీరాలలో ‘ఠాగూర్’ తరహా మోసం
ఠాగూర్ చిత్రంలో ఓ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ఓ ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి మృతుని బంధువుల నుంచి వైద్యులు రూ.లక్షలు దండుకుంటారు. విషయాన్ని కథానాయకుడు గ్రహించి వైద్యుల గుట్టురట్టు చేస్తాడు. చీరాలలో అచ్చం అలాగే జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు వైద్యులు చికిత్స అందించారు. బంధువులతో రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టించారు. చివరకు గుంటూరు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ ఆటో డ్రైవర్‌ను పరిశీలించిన వైద్యులు.. ఇతడు చనిపోయి ఇప్పటికే రెండు రోజులైందని చెప్పడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరొక్కసారి అందరూ ఠాగూర్ చిత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
 
చీరాల : వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన గవిని నాగరాజు (30) పురుగుమందు తాగి గత నెల 20న ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసి అప్పులు పాలవడంతో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో పురుగుముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు నాగరాజును చీరాలలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. 15 రోజులు పాటు చికిత్స అందించారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు.

గురువారం సాయంత్రం 3గంటల సమయంలో నాగరాజుకు సీరియస్‌గా ఉందని, గుంటూరు తరలించాలని వైద్యులు చెప్పడంతో బంధువులు హుటాహుటిన అక్కడికి తీసుకెళ్లారు. నాగరాజు చనిపోయి రెండు రోజులైందని వైద్యులు ధ్రువీకరించడంతో బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతుని బంధువులు, గ్రామస్తులు పోస్టుమార్టం అనంతరం చీరాల వచ్చి గడియారస్తంభం వద్ద ధర్నా చేశారు. వైద్యశాల అద్దాలు పగలగొట్టారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆందోళన చేశారు. 15 రోజులు పాటు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరకు ప్రాణాలు పోగొట్టారని, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక దశలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను నియంత్రించారు. ఈ సంఘటనపై వైద్యశాల డాక్టర్లు మాత్రం తమ తప్పు ఏమీలేదని, సక్రమంగా వైద్యం చేశామని, అవసరమైతే కేసు పెట్టుకోవాలని ఉచిత సలహా కూడా ఇవ్వడం గమనార్హం.

విచారణ జరిపించండి : ఎమ్మెల్యే ఆమంచి
నాగరాజు మృతిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సూచించారు. ఆటో డ్రైవర్ మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలని, వైద్యశాలను సీజ్ చేయాలని కోరారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాగరాజు మృతదేహాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోతుల సునీత పరిశీలించారు. మృతుని బంధువులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామన్నారు.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

జనమంతా ఖుష్‌

Sakshi Post

BJP, Congress Slam Kejriwal Over Promise To Abolish House Tax

Opposition BJP and Congress on Saturday dubbed Delhi Chief Minister Arvind Kejriwal’s promise to abo ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC