రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారు


 గిద్దలూరు : రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు ఓటుకు కోట్లు కుమ్మరించే పనిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, సంతనూతలపాడు, అద్దంకి ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ కోసం వెళుతున్న ఎమ్మెల్యేలు గిద్దలూరులోని లక్ష్మీ డెయిరీలో భోజనం చేశారు.



అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహించిన వారు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిచిపోయాయని, ఏ ఒక్కపథకం అమలు కావడం లేదన్నారు. పాఠశాలలు ప్రారంభమై 20 రోజులైనా నేటికీ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్క పాఠశాలను ప్రారంభించలేదన్నారు.



 రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం

 రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టడం లేదని, రైతులను గాలికి వదిలేసి ఇబ్బందుల్లోకి నెట్టేశారన్నారు. పొగాకు, పత్తి పండించిన రైతులకు గిట్టుబాటు ధరల్లేక పంటను అమ్ముకోలేక, నిల్వలు ఉంచుకునే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనలు చేస్తున్నారన్నారు. శనగ పంటకు ధరల్లేక గృహాల్లోనే నిల్వలు ఉన్నాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రయత్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడి మంత్రులతో మాట్లాడించారన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి బయ్యర్లకు చెప్పినా పొగాకు ధరల్లో కదలికలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.



పొగాకు పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంటను ఎందుకు కొనుగోలు చేయడం లేదని వారు ప్రశ్నించారు.  పొగాకు కొనుగోళ్ల విషయంలో వైఎస్సార్‌సీపీ అనేక సలహాలు, సూచనలు చేసిందని అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.  ప్రభుత్వం పొగాకును ముందుగా కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని, వ్యాపారులు సైతం అదే ధరలకు కొనుగోలు చేస్తారన్నారు.   192 మిలియన్ క్వింటాళ్ల పప్పు శనగలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అసలు కొనుగోళ్లు చేపట్టలేదన్నారు.  

 

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు

 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఓటుకు కోట్లు పోస్తున్నారని, ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని వారు ప్రశ్నించారు. ఎంపీటీసీలను తీసుకెళ్లి నెల్లూరులోని లాడ్జిలో దించారని, వారికి ఎంత ఇచ్చి తీసుకెళ్లారని ప్రశ్నించారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ప్రజలు టీడీపీకి ఎన్ని సీట్లు ఇచ్చారు...నైతికంగా గెలిచే అవకాశం లేకున్నా ఓటుకు కోట్లు గుమ్మరించి రాజకీయాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రాష్ర్టంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారంటూ గవర్నరును నాలుగు పర్యాయాలు కలిసినా ఎలాంటి స్పందన లేదన్నారు.  

 

 కేసులు తప్పించుకునేందుకు కృష్ణా జలాల తాకట్టు

  కృష్ణా నదిపై తెలంగాణ లో పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారని, దాని వలన రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో కృష్ణాజలాల కొరత ఏర్పడుతుందన్నారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ వద్ద కృష్ణా జలాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ఆయన రాష్ర్ట ప్రజల సంక్షేమం కోసం కృష్ణా జలాలను ఇస్తున్నారని, కానీ చంద్రబాబు కృష్ణా జలాలను ఏకంగా తాకట్టు పెట్టి కేసు నుంచి తప్పించుకునేందుకు చూస్తున్నాడన్నారు.



మహిళా సంక్షేమం, రైతుల సంక్షేమం విస్మరించారని, రైతులకు రుణమాఫీ చేయమంటే పరిశ్రమలకు రుణమాఫీ చేసి కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని, అందుకు ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనరు మోపూరి బ్రహ్మం, నాయకులు దప్పిలి విజయభాస్కర్‌రెడ్డి, దమ్మాల జనార్ధన్, పూలి బాలంకిరెడ్డి, రాజేశ్వరరెడ్డి, కటకం శ్రీనివాసులు, సీవిఎన్.ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top