ఈసారి ఏడుతో సరి


  •    సమైక్య ఉద్యమం ఎఫెక్ట్  టెన్త్‌లో దిగజారిన ఫలితం

  •      92.87 ఉత్తీర్ణత శాతంతో జిల్లాకు ఏడో స్థానం

  •      గత ఏడాదికంటే తగ్గిన ఉత్తీర్ణత శాతం

  •      241 పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు

  •  

    చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఉధృతంగా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపింది. 2012-13 విద్యాసంవత్సరంలో 94.92 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధిం చిన జిల్లా ఈసారి 92.87 శాతం ఉత్తీర్ణత సాధించి 7వ స్థానంతో సరిపెట్టుకుంది.



    మొత్తం 51,116మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా, 47,472 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 26,539 మందికిగాను 24,468 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 24,577 మందికిగాను 23,004మంది ఉత్తీర్ణులయ్యారు. 2010-2011, 2011-2012 విద్యాసంవత్సరాల్లో జిల్లాకు వరుసగా నాలుగో స్థానం రాగా, 2012-2013లో మొదటి స్థానం వచ్చింది.



    విద్యాశాఖ, ఉపాధ్యాయవర్గాలు మళ్లీ మొదటి స్థానం వస్తుందని భావించినా జిల్లాకు ఏడో స్థానమే వచ్చింది. గత సంవత్సరం కాస్త తక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాసినప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతంతో  పోల్చుకుంటే ఈసారి 2.05 శాతం ఉత్తీర్ణత తగ్గింది.

     

    బాలికలదే పై చేయి



    పదేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో పైచేయి సాధిస్తున్న బాలికలు ఈసారి కూడా బాలుర కంటే 1.4 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యూరు. బాలుర  ఉత్తీర్ణత శాతం 92.2 ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 93.6గా నమోదయింది. కాగా జిల్లాకు ఊరట కలిగే విషయం ఏంటంటే పరీక్ష రాసిన విద్యార్థుల్లో 383 మంది 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించారు.



    ఈ అంశంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం పొందింది. అన్ని డివిజన్లలో కలిపి 241 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. గత సంవత్సరం 206 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, ఈసారి ఆ సంఖ్య పెరిగింది. చిత్తూరు డివిజన్‌లో 115 ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించగా, తిరుపతిలో 53, పుత్తూరులో 65, మదనపల్లెలో 8 పాఠశాలలకు వంద శాతం ఫలితాలు వచ్చాయి.

     

    కస్తూర్భా పాఠశాలల్లో మంచి ఫలితాలు



     రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్భా గాంధీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పది ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. రామకుప్పం, రొంపిచెర్ల, గంగవరం, గుడుపల్లె, తంబళ్లపల్లె, కేవీ పల్లె, ఎర్రావారిపాళెం, పెద్దమండ్యం, కుప్పం, శాంతిపురం, ములకలచెరువుల్లోని పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు వచ్చాయి. శాంతిపురం కేజీబీవీలో చదువుతున్న బీవీ.పవిత్ర, కుప్పం కేజీబీవీలో చదువుతున్న ఆర్ పవిత్ర అనే విద్యార్థినులు 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించారు.

     

    సమైక్య ఉద్యమం ప్రభావం



     రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం పదో తరగతి ఫలితాలపై పడింది. జూలై 31వ తేదీ ప్రారంభమైన ఉద్యమం సీమ జిల్లాల్లో ఉధృతంగా జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో అయితే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో చాలా రోజుల పాటు పాఠశాలలు జరగలేదు. అంతేగాక ఆగష్టు 22వ తేదీ నుంచి ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. అక్టోబర్ 10వ తేదీ వరకు ఇది జరిగింది. దీంతో పదో తరగతి విద్యార్థులకు సకాలంలో సిల బస్ పూర్తికాలేదు.



    ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పాలని డీఈవో కోరినప్పటికీ కొంత మంది మాత్రమే స్పందించి పాఠాలు చెప్పారు. ఈ కారణంగానే ఫలి తాలు తగ్గినట్లు విద్యాశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఉద్య మం తర్వాత పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్టడీ మెటీరియల్ ఇచ్చి చదివించినప్పటికీ కొంత మంది విద్యార్థులు పాస్ కాలేకపోయారు. దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గి జిల్లాకు అత్యుత్తమ స్థానం రాలేదని భావిస్తున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top