విజయవాడలో హవాలా.. డాక్టర్లపై కేసులు!

విజయవాడలో హవాలా.. డాక్టర్లపై కేసులు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హవాలా వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో హవాలా వ్యవహారం వెలుగుచూసి పలువురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఇంకా మరువక ముందే విజయవాడలో హవాలా వ్యవహారం కలకలం సృష్టించింది. విదేశాల నుంచి నిధులు తెప్పించుకోడానికి కొంతమంది కార్పొరేట్ వైద్యులు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇందుకోసం ఏజెంట్ బ్రహ్మాజీకి వాళ్లు భారీ మొత్తంలో కమీషన్లు ముట్టజెప్పారు. అయితే కొన్ని నెలలు గడుస్తున్నా రావాల్సిన నిధులు రాకపోవడంతో బ్రహ్మాజీని ఒక కారులో కిడ్నాప్ చేసి, నగరానికి సమీపంలో ఉన్న ఒక మామిడితోటలో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు కూడా చేయించుకున్నారు.



బ్రహ్మాజీ ఆచూకీ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, తొలుత దీన్ని కేవలం కిడ్నాప్, చిత్రహింసల కేసుగానే భావించారు. విషయం తెలిసినా కూడా కొంతమంది పోలీసు అధికారులు డాక్టర్లకు సహకరించారని తెలిసింది. దాంతో ఒక ఏసీపీ, మరో సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం హవాలా వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. తీగ లాగితే డొంక మొత్తం కదలడంతో నగరంలోని హెల్ప్ ఆస్పత్రి చైర్మన్, ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, అదే ఆస్పత్రి ఎండీ సీహెచ్ రవికుమార్, మరో ఆస్పత్రి ఎండీ మైనేని హేమంత్‌లతో సహా మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది. కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



మంత్రి జోక్యం.. రాజీకి యత్నం

రంగురాళ్ల వ్యాపారి, హవాలా ఏజెంటు అయిన బ్రహ్మాజీకి కొంతమంది టీడీపీ నేతలతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసును రాజీ చేయడానికి టీడీపీ నేతలు రంగప్రవేశం చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన ఒక మంత్రి వద్ద పీఏగా వ్యవహరిస్తూ, నామినేటెడ్ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇప్పటికే ఒక వైద్యుడి ఇంటి వద్దకు వెళ్లి, బ్రహ్మాజీ కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ కేసులో ఉన్న ఒక వైద్యుడికి విజయవాడకు చెందిన ఓ పత్రికా ప్రతినిధి కూడా బంధువు కావడంతో ఆయన సైతం ఇందులో జోక్యం చేసుకుని వైద్యుల మీద కేసులు రాకుండా చూసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆ మార్గంలో వెళ్తే కుదరదని భావించి.. నేరుగా బ్రహ్మాజీ కుటుంబ సభ్యులతోనే డీల్ చేస్తున్నారు. కేసు నమోదైన ముగ్గురిలో ఒక వైద్యుడు అనంతపురం జిల్లాలోని ఒక టీడీపీ ఎమ్మెల్యే ఆశ్రయం పొందినట్లు తెలిసింది. బ్రహ్మాజీ లాంటి చాలామంది విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top