ఉసురు తీసిన వివాహేతర సంబంధం

ఉసురు తీసిన వివాహేతర సంబంధం - Sakshi


నూజివీడులో వ్యక్తి దారుణహత్య


 


నూజివీడు : నూజివీడు పట్టణం ఎన్టీఆర్ కాలనీ లో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మోతే నాగరాజు (35) దారుణహత్యకు గురయ్యాడు. పాతకక్షలు పురస్కరించుకుని అతని వ్యతిరేక వర్గీయులు కాపుకాసి ఇనుపరాడ్డులతో దాడిచేసి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతనికి సంబంధించిన పలువురిపై దాడిచేసి కొట్టడంతో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు పేర్కొన్నారు.


 

పోలీసుల కథనం ప్రకారం ఎన్టీఆర్ కాలనీకి చెందిన మోతే నాగరాజు కిరాణా, ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అదే కాలనీకి చెందిన మోతే వినోద్‌కు, నాగరాజుకు మధ్య మూడేళ్లుగా పాతకక్షలున్నాయి. వినోద్ భార్య అయిన లిడియాకు, నాగరాజు బావమరిది కుమారుడు అయిన కల్యాణి బాబూరావుకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడడానికి నాగరాజే కారణమని వినోద్ భావించి అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం గొడవలు జరుగగా అప్పట్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అనంతరం గొడవలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం కల్యాణి సాయిబాబు అల్లుడైన కనకారావుపై వినోద్ వర్గం దాడికి యత్నించగా అతను  పారిపోయాడు. దీనిపై కనకారావు ఈనెల 26న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా మోతే వినోద్ సైతం ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మోతే నాగరాజును ఎలాగైనా మట్టుబెట్టాలనే పథకం రచించారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో  పాల ప్యాకెట్లు తెస్తున్న మోతే నాగరాజును కాలనీలోనే వినోద్, దయాకర్, ప్రేమ్‌కుమార్, కార్తీక్ తదితరులు ఆపి ఒక్కసారిగా ఇనుపరాడ్డులతో దాడిచేసి తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.


 

మృతుని కుటుంబ సభ్యులపైనా దాడి


అనంతరం అతనికి సంబంధించిన వారి ఇళ్లపై దాడిచేసి అతని భార్య మోతే మల్లేశ్వరి (33), కుమార్తె  రూతు (16), తల్లి కోటమ్మ (55), బావమరిది కల్యాణి సాయిబాబు (55), సాయిబాబు కుమార్తెలైన రంగమ్మ (33), గీత (25)లపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను 108 వాహనంలో పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి  తరలించారు. నాగరాజును పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లుగా నిర్ధారించారు. మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు మోతే వినోద్, మోతే దయాకర్, మోతే ప్రేమ్‌కుమార్, మోతే లిడియా, పస్తం దుర్గారావు, పస్తం కార్తీక్, పస్తం నాగరాజు, పస్తం కేశవులు, పస్తం అయ్యప్పలపై పోలీసులుకేసులు నమోదు చేశారు.


 

ఆసుపత్రిని సందర్శించిన డీఎస్పీ


సమాచారం అందుకున్న నూజివీడు డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు ఏరియా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. దాడికి సంబంధించిన కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం గొడవలకు కారణమైన వినోద్‌ను కాలనీలో లేకుండా చేయాలని బాధితులతో పాటు కాలనీవాసులు  డీఎస్పీని కోరారు. ఇన్‌చార్జి సీఐ  జయకుమార్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పట్టణ ఎస్‌ఐలు బోనం ఆదిప్రసాద్, షేక్ జాబీర్, రూరల్ ఎస్‌ఐ చిన్న నాగప్రసాద్  క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరించారు.


పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

దాడికి పాల్పడిన నిందితులు మోతే వినోద్, మోతే ప్రేమ్‌కుమార్, పస్తం కార్తీక్, పస్తం దుర్గారావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వేరే స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. వీరు ప్రత్యర్థులపై దాడిచేసిన అనంతరం తమకు కూడా గాయాలయ్యాయంటూ  ఏరియా ఆసుపత్రికి రాగా అక్కడ వారికి వైద్యం చేయించిన తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top