కాలేజీల తీరు మారలేదు


  • లోపాల సవరణకు మరో 45 రోజుల గడువు

  • ఆపైనా సరిదిద్దుకోకుంటే గుర్తింపు రద్దు

  • జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ రమణరావు

  • సాక్షి, హైదరాబాద్: ఎన్నిసార్లు తనిఖీలు చేసినా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల తీరు మారలేదని, లోపాలు సవరించుకోలేదని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణరావు తెలిపారు. అందుకే వాటిపై ఈసారి కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వివిధ ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఆ మేరకు ప్రమాణాలు పాటించనందున ఈ విద్యా సంవత్సరంలో 163 కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశామన్నారు.



    గడువులోగా లోపాలను సవరించుకుంటామని యాజమాన్యాలు డిక్లరేషన్లు కూడా ఇచ్చాయన్నారు. అయితే.. గడువు ముగిసినా కళాశాలల  తీరు మారలేదని, 20 కళాశాలలు మినహా మిగిలిన కళాశాలలేవీ తమ లోపాలను సరిదిద్దుకోలేదన్నారు. ఇటీవల ఐఐటీ, బిట్స్ పిలానీ.. తదితర సంస్థలకు చెందిన అధికారులతో (థర్డ్ పార్టీ) వర్సిటీ నిర్వహించిన తనిఖీల్లోనూ అవే లోపాలు బయటపడ్డాయన్నారు.



    చివరి అవకాశంగా ఆయా కళాశాలకు మరో 45 రోజులు గడువిస్తున్నామని, ఆ తర్వాతా లోపాల్ని సరిదిద్దుకోకుంటే గుర్తింపు రద్దు చేస్తామన్నారు. అధ్యాపకుల సమాచారాన్ని తప్పుగా ఇచ్చిన 16 కాలేజీ లపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top