అడిగింది రూ.88కోట్లు ఇచ్చింది రూ.4కోట్లు

అడిగింది రూ.88కోట్లు  ఇచ్చింది రూ.4కోట్లు - Sakshi


అంతన్నారు.. ఇంతన్నారు.. ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.. నిధులడిగితే నివేదిక ఇవ్వమన్నారు.. చివర్లో మొండిచేయి చూపారు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రిని అన్నింటా అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం నిధుల విడుదలలో మాత్రం ఘోరంగా ప్రవర్తించింది. ఆస్పత్రిలో రోగుల మౌలిక వసతుల కోసం రూ.88 కోట్లు అడిగితే.. రూ.4కోట్లు విడుదల చేసి ఆశ్చర్యపరిచింది.

 

లబ్బీపేట : విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ప్రభుత్వం రిక్తహస్తం చూపింది. నిరుపేద రోగులకు కనీస వైద్యసేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రూ.88.98 కోట్లు అవసరమని కోరగా, రూ.4 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొంది. ఆగస్టు చివరి వారంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకల దాడితో ఓ పసికందు మృతిచెందిన సంఘటన అనంతరం మంత్రులతో పాటు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ కూడా విజయవాడ ప్రభుత్వా స్పత్రిని రెండుసార్లు సందర్శించారు.  సౌకర్యాల లేమితో ప్రసూతి వార్డులో రోగులు పడుతున్న ఇబ్బందులను   ప్రత్యక్షంగా చూశారు. ఆస్పత్రిలో అవసరమైన సౌకర్యాలపై నివేదిక రూపొందించాలని అసిస్టెంట్ కలెక్టర్ సలోమి  సుడాన్‌ను ఆదేశించారు.

 

హెచ్‌వోడీలతో సమావేశమై..


అసిస్టెంట్ కలెక్టర్ నెల రోజుల పాటు పలుమార్లు ప్రభుత్వాస్పత్రిని సందర్శించడంతో పాటు ెహ చ్‌వోడీలు, అధికారులతో సమావేశమయ్యారు. ఆయా విభాగాలకు కావాల్సిన పరికరాలు, సిబ్బంది, భవన నిర్మాణాలు వంటి అంశాలపై నివేదికలు తీసుకున్నారు. అలా వైద్యులు, అధికారులు ఇచ్చిన రిక్వైర్‌మెంట్ ఆధారంగా ప్రభుత్వాస్పత్రిలో కనీస వైద్య సేవలు అందాలంటే రూ.88.98 కోట్లతో సివిల్ వర్క్స్, స్టాఫ్ రిక్వైర్‌మెంట్, సెక్యూరిటీ ప్లాన్, శానిటేషన్, ఎక్యుప్‌మెంట్ కొనాలని కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు.

 

 రూ.4 కోట్లు విదిల్చి..

 ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాల కోసం రూ.88.98 కోట్లు కావాలని కలెక్టర్ కోరగా, ప్రభుత్వం కేవలం శాతం కూడా విడుదల చేయలేదు.

 కేవలం రూ.4 కోట్లు కేటాయించినట్లు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఈనెల 21న జీవో 616ను విడుదల చేసింది. ఈ నిధులు ప్రసూతి, పిడియాట్రిక్ విభా          గానికే సరిపోవని, దీనిని బట్టి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో వెల్లడవుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

 డయాగ్నో బ్లాక్‌కు నిధుల విడుదల

 రెండేళ్ల కిందట డయాగ్నోస్టిక్ బ్లాక్‌లో మౌలిక సదుపాయాల కోసం పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం రూ.2.22 కోట్లు విడుదల చేసిందని ఈనెల 21న వైద్య ఆరోగ్యశాఖ జీవో 692 విడుదల చేసింది. వాటితో పాటు రూ.50 లక్షలతో మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు రూ.32 లక్షలతో ఎయిర్ కండీషన్లు అమర్చనున్నారు. మరో రూ.70 లక్షలతో 315 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్, 250 కేవీఏ జనరేటర్ సెట్‌ను కొనుగోలు చేయనున్నారు.  లిఫ్ట్ ఏర్పాటుకు రూ.70 లక్షలు కేటాయించినట్లు జీవోలో పేర్కొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top