పొదుపు కోసమట.. కోతకు వేళాయె!


వ్యవసాయానికి ‘కెపాసిటర్ల’ లంకె

 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉచిత విద్యుత్‌కు, కెపాసిటర్లకు లంకె వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులు కెపాసిటర్లు బిగించుకోవాలని విద్యుత్‌శాఖ ఒత్తిడి తెస్తోంది. విద్యుత్ పొదుపు పేరిట ఉచిత విద్యుత్‌కు-కెపాసిటర్లకు లంకె వేసేందుకు జిల్లా విద్యుత్‌శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కెపాసిటర్లను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందా? రైతులే భరించాలా? అనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కెపాసిటర్ల భారాన్ని రైతులే భరించక తప్పదని అధికారులే అనధికారికంగా పేర్కొంటున్నారు. మొత్తం మీద ఉచిత విద్యుత్ అని ఒకవైపు అంటూనే... మరోవైపు కెపాసిటర్ల రూపంలో పరోక్షంగా రైతులపై ప్రభుత్వం భారం మోపేందుకు సిద్ధమైందన్నమాట.

 

ఒక్కో కనెక్షన్‌కు రూ.2 వేల భారం

 ప్రతీ రైతు కెపాసిటరు కొనాల్సి రానుండటంతో వారిపై భారీగా భారం పడనుంది. ఒక కెపాసిటర్‌ను కొనుగోలు చేయాలంటే సుమారు రూ.2 వేల మేరకు వెచ్చించాల్సి రానుంది. జిల్లాలో లక్షా 11వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో కనెక్షన్‌కు రూ.2వేల చొప్పున... రూ.22.20 కోట్ల మేర రైతులపై భారం పడనుంది. వాస్తవానికి కెపాసిటర్లను బిగించుకోవడం ద్వారా రైతులకు ఒరిగే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా విద్యుత్ పొదుపు అయితే ఆ మేరకు విద్యుత్ సంస్థలకు అదనపు విద్యుత్ కొనుగోలు భారం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా లాభం చేకూరనుంది. కెపాసిటర్ల భారాన్ని కూడా విద్యుత్ సంస్థలే భరించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇందుకు భిన్నంగా రైతులపై మోపేందుకు సిద్ధపడటాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

 

ఉచిత పథకానికి తూట్లు

వాస్తవానికి గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో విద్యుత్ చార్జీలు చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మంది రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. పలువురు జైళ్లపాలు కూడా అయ్యారు. ఏకంగా రూ.1250 కోట్ల మేరకు రైతులు విద్యుత్ చార్జీల రూపంలో బకాయి పడ్డారు. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పాత బకాయిలను రద్దు చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులనూ రద్దు చేయడంతో పాటు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, కేవలం నెలకు రూ.20 చొప్పున సర్వీసు చార్జీలు చెల్లించాలని కోరారు.



వాస్తవానికి నెలకు రూ.20 కూడా ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు వసూలు చేసిన సంఘటనలు లేవు. ఆయన మరణానంతరం రైతుల నుంచి బకాయిపడ్డ సర్వీసు చార్జీలను వసూలు చేశారు. అంతేకాకుండా క్రమంగా ఉచిత విద్యుత్‌కు పరి మితులు విధించడం ప్రారంభించారు. గతంలో ఒక రోజులో వ్యవసాయానికి 7 గంటలు సరఫరా కాకపోతే.. మరుసటి రోజు మిగిలిన సమయాన్ని భర్తీ చేసేవారు. అంటే ఒక రోజు వ్యవసాయానికి కేవలం 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయితే.. మిగిలిన 2 గంటల సమయా న్ని మరుసటి రోజు భర్తీ చేసేవారన్నమాట. అయితే, దీనిని ప్రస్తుతం రద్దు చేశారు.



ఒక రోజు లో వ్యవసాయానికి 7 గంటల్లో కోత పడితే దీని ని భర్తీ చేయడం లేదు. అంతేకాకుండా వ్యవసా య విద్యుత్ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లను బిగించే ప్రక్రియను సైతం తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా అయ్యే ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లను బిగించి.. ఎంత విద్యుత్ సరఫరా అవుతుందో లెక్కించాలనేది ఆలోచనగా ఉంది. ఒకవేళ నిర్ణీత లక్ష్యం కంటే అధిక విద్యుత్ సరఫరా అయితే అలాంటి కనెక్షన్లపై ఓ కన్నేసి... విద్యుత్ సరఫరా సమయాన్ని తగ్గించాలనే ఎత్తుగడలో విద్యుత్‌శాఖ నిమగ్నమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top