అబార్షన్‌ మాత్రలు మింగించిన హెచ్‌ఎం

అబార్షన్‌ మాత్రలు మింగించిన హెచ్‌ఎం - Sakshi


► మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం  చేసుకున్న హెచ్‌ఎం

► కట్నం తీసుకురావాలంటూ వేధింపులు

► ఆడపిల్ల పుడుతుందేమోనని అబార్షన్‌ మాత్రలు మింగించి  గదిలో బంధింపు

► ఫిర్యాదు చేసిన మూడు నెలలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు

► కేసులు పెడితే..పలుకుబడితో తొక్కేస్తానంటూ హెచ్‌ఎం బెదిరింపులు

► న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితురాలు




కందుకూరు రూరల్‌ : మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే  ఓ హెడ్‌మాస్టర్‌ రెండో వివాహం చేసుకుని..ఆమెను కట్నం కోసం వేధించడమే కాక అబార్షన్‌ మాత్రలు మింగించి ఓ గదిలో బంధించాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు మూడు నెలల పాటు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని బాధితురాలు వాపోతోంది. బాధితురాలు సీహెచ్‌.వెంకట సుహాసిని తెలిపిన వివరాల మేరకు..వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలేనికి చెందిన బీరకాయల మాధవరావు ప్రస్తుతం కందుకూరు పట్టణంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు.


ముండ్లమూరివారిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఉలవపాడుకు చెందిన సీహెచ్‌.మాలకొండయ్య రెండో కుమార్తె సుహాసినిని గతేడాది డిసెంబర్‌ 31వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. సుహాసిని మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని ఉంది. మాధవరావు మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నానని అందరికీ చెప్పాడు.


తీరా పెళ్లి పీటలపై విడాకుల పత్రాలు చూపించాలని ఒత్తిడి చేయడంతో అప్పటికప్పుడు మొదటి భార్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని..తన ఇష్టపూర్వకంగా సుహాసినిని వివాహం చేసుకుంటున్నానని హామీ పత్రాలు రాసి అతని కుటుంబ సభ్యులు కూడా సంతకాలు చేసిచ్చాక పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి సమయంలో కట్నకానుకల ప్రస్తావన తేలేదు. కాపురం పెట్టిన కొద్దిరోజులకే వారిమధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.


కట్నం పేరుతో డబ్బులు తీసుకురావాలని..కొంత బంగారం చేయించమని సుహాసినిపై ఒత్తిడి చేశాడు. సుహాసిని వాళ్లు ముగ్గురు ఆడపిల్లలు. తండ్రి, అక్క మరణించారు. తండ్రి పింఛన్‌ డబ్బులతో తను, తల్లి, చెల్లెలు ఉండేవారు. ఉన్న ఆస్తిని అమ్మేసి తన వాటా తీసుకురావాలంటూ సుహాసినిని హింసించడం మొదలుపెట్టాడు. మాధవరావు మొదటి భార్యకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కదా..మనకు ఆడపిల్ల చాలని సుహాసిని చెప్పింది. దీంతో ఆగ్రహించిన మాధవరావు ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్‌ చేయిస్తానని హెచ్చరించాడు.


ఈలోపు ఏవో మాత్రలు తీసుకొచ్చి..అవి మింగితే ఆరోగ్యం బాగుంటుందని..పుట్టబోయే బిడ్డ కూడా బాగుంటుందని చెప్పడంతో నమ్మి సుహాసిని మింగింది. మింగిన తర్వాత ఒక గదిలో ఉంచి బయటకు రానివ్వలేదు. దీంతో అబార్షన్‌ అయి తీవ్రంగా నీరసించిపోయిన సుహాసినిని జనవరి 26వ తేదీన ఉలవపాడులోని ఆమె పుట్టింటి వద్దకు కారులో తీసుకొచ్చి వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి వెంకట సుహాసినిని పట్టించుకోలేదు. పెళ్లి చేసిన పెద్దల ద్వారా రెండు, మూడు సార్లు పంచాయితీ పెట్టించినా లాభం లేకుండా పోయింది.


ఆమె నాకు వద్దు..అవసరమైతే నష్టపరిహారం ఇస్తానన్నాడు. మాధవరావుపై ఫిబ్రవరిలో ఉలవపాడు, కందుకూరు పోలీస్‌స్టేషన్లలో సుహాసిని ఫిర్యాదు చేసింది. కేసులు పెడితే ఏమవుతుంది..నాకున్న పలుకుబడితో తొక్కేస్తానని బెదిరిస్తున్నారని సుహాసిని ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు పోలీసులను అడగడంతో ఫిర్యాదుపై ఈనెల 23న  కేసు కట్టారని..అయినా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.


కేసు నమోదు చేశాం..ఇన్‌చార్జ్‌ ఎస్సై ప్రభాకర్‌రావు

సీహెచ్‌.వెంకటసుహాసిని ఫిర్యాదు మేరకు 23వ తేదీ సాయంత్రం కేసు నమోదు చేశాం. రెండు స్టేషన్ల పరిధిలో కేసు ఉంది. మాధవరావు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో అరెస్టు చేస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top