చేనేత కార్మికులను ఆదుకుంటాం


తిరుపతి సిటీ : రాష్ర్టవ్యాప్తంగా పర్యటించి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఎక్సైజ్, చేనేత జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం తిరుపతి గాంధీరోడ్డులోని ఆప్కో విక్రయశాలను ఆయన సందర్శించారు. అక్కడి చేనేత ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రూ.100 కోట్లతో చీరాలలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు.



ప్రాచీన వృత్తి కళాకారులైన చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వారి ఉత్పత్తులకు ప్రోత్సాహం లభించేవిధంగా ఆప్కోను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. చేనేత విక్రయాభివృద్ధికి ఇన్‌సెంటివ్ భృతి, క్లస్టర్లు, నేత బజార్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులపై పడిన అదనపు సుంకాన్ని తగ్గించేందుకు నూలు, సిల్క్స్ దిగుమతులపై రాయితీని ప్రవేశపెడుతున్నామన్నారు.



ప్రభుత్వ వసతి గృహాలకు దుప్పట్లు, విద్యార్థులకు యూనిఫాం, ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రిని చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల డెరైక్టర్లు మిద్దెల హరి, పడిదం చెంగల్‌రావు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రకాశంరోడ్డులోని జోయాలుకాస్ జువలరీ ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణ, టౌన్‌బ్యాంకు చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి రామచంద్రరాజు, ఆప్కో డివిజినల్ మేనేజర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

 

నగరమంతా మద్యం తొలగించండి..


 

మద్యం దుకాణాలను తొలగిస్తే నగరమంతా తొలగించాలని.. లేకుంటే అన్నింటినీ అలాగే ఉంచాలని బస్టాండ్ నుంచి కపిలతీర్థం రోడ్డులో తొలగించిన మద్యం దుకాణాల నిర్వాహకులు మంత్రి కే.రవీంద్రను కోరారు. మద్య నిషేధం పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావిస్తే నగరంలో అన్ని దుకాణాలు, బార్లను తొలగించి రూరల్ ప్రాంతాలకు తరలించాలన్నారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో మద్యం దుకాణాల యజమానులు వెనుతిరిగారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top