చేతివాటం


రూ.50 లక్షలు.. 4 ఇంచుల నీళ్లు

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: వేసవిలో ప్రజల దాహార్తిని ఆసరా చేసుకుని కాసుల వర్షం కురిపించుకునేందుకు అధికార పార్టీ నేతలు తహతహలాడుతున్నారు. వేసవికి ముందు హడావుడిగా చేపట్టిన తాగునీటి పథకాల పనులను నామినేషన్‌పై కాజేసేందుకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పత్తికొండ ఊరు చెరువు (పెద్ద చెరువు) నింపే పనులను నామినేషన్‌పై పొందిన అధికార పార్టీ నేతలు.. వేసవి సందర్భంగా చేపట్టనున్న చేతి పంపుల మరమ్మతులు, ప్రైవేటు నీటి సరఫరా పథకాలపైనా కన్నేశారు. మొత్తంమీద వేసవి ప్రణాళిక కింద హడావుడిగా రూ.5.70 కోట్లతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పథకాలపై అధికార పార్టీ నేతలు నామినేషన్‌పై కాజేసేందుకే ప్రణాళిక సిద్ధమైందన్న ప్రచారమూ జరుగుతోంది.

 

 పారిన నీళ్లు పారినట్టే ఇంకుతాయి!

 పత్తికొండ చెరువును నింపేందుకు హడావుడిగా ఏకంగా రూ.50 లక్షల విలువైన పనులను అధికార పార్టీ నేతలకు నామినేషన్‌పై అప్పగించారు. ఇంత ఖర్చు చేసి కేవలం 4 ఇంచుల నీళ్లు మాత్రమే పారించారు. నామినేషన్‌పై ఈ పనులను పొందిన అధికార పార్టీ నేతలు కేవలం 21.5 హెచ్‌పీ మోటారును మాత్రమే బిగించారు. ఈ మోటారుతో కేవలం నాలుగంటే నాలుగు ఇంచుల నీళ్లే పారుతున్నాయి.

 

  ఫలితంగా పారిన నీళ్లు పారినట్టే ఇంకిపోతున్నాయి. ఒకవేళ పారిన నీరు పారినట్టే ఇంకకుండా... చెరువులో చేరిన నీరు ఉంటుందని భావించినా ఇప్పట్లో చెరువు నిండే పరిస్థితులు కనిపించడం లేదు. వాస్తవానికి ఈ చెరువు లోతు ఒక మీటరు ఉంది. ప్రస్తుతం పారుతున్న 4 ఇంచుల నీటిని లెక్కిస్తే ఒక మీటరు నీళ్లు రావడానికి 120 రోజులు పడుతుంది. అంటే ఈ వేసవికి ఈ చెరువు ద్వారా పత్తికొండకు తాగునీరు వచ్చే అవకాశమే లేదు. అంతేకాకుండా.. ఈ పనులను చిన్ననీటి పారుదలశాఖ వారు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈ పనులు మాత్రం గ్రామీణ నీటిపారుదల శాఖకు (ఆర్‌డబ్ల్యుఎస్) అప్పగించారు. మరోవైపు కాలువలో కూడా నీళ్లు లేవు. దీంతో రానున్న రోజుల్లో ఈ బోరు ద్వారా నీరు పారే అవకాశమూ లేదు. మొత్తం మీద అధికార పార్టీ నేతల జేబులు నింపేందుకే ఈ పనులు చేపట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వేసవిని పురస్కరించుకుని ఇన్నాళ్లూ ఎటువంటి పనులు చేపట్టకుండా ఇప్పుడు హడావుడిగా పనులు చేపట్టేందుకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ పనులన్నీ దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

 

 రూ.5.70 కోట్లతో ప్రణాళిక

 ఈ వేసవి కాలంలో మంచినీటి కొరతను తీర్చేందుకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా 89 ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని, 156 ప్రాంతాల్లో ప్రైవేటు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవాలని, 781 బోర్లను మరింత లోతుకు తవ్వాలంటూ మొత్తం రూ.5.70 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఈ పనులన్నీ నామినేషన్ ద్వారా కాజేసేందుకు లేదా... సిండికేటు ద్వారా దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.

 

 బోర్లు ఉన్నా పనిచేయవు...!

 జిల్లాలో మొత్తం ఆవాసాలు 1503 ఉన్నాయి. ఈ ఆవాసాల్లో మొత్తం చేతి పంపులు 12,267 ఉన్నాయి. అయితే, ఇందులో పనిచేస్తున్న చేతి పంపులు కేవలం 10,800 మాత్రమే. అంటే మరో 1467 చేతి పంపులు పనిచేయడం లేదు. అదేవిధంగా సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాలైన....పీడబ్ల్యుఎస్; ఎంపీడబ్ల్యుఎస్ పథకాలు జిల్లాలో మొత్తం 2789 ఉన్నాయి.

 

 ఇందులో పనిచేస్తున్నవి 2619. అంటే మరో 170 పథకాలు పనిచేయడం లేదు. ఇన్నాళ్లుగా వీటి నిర్వహణ చేపట్టకుండా ఇప్పుడు హడావుడిగా వేసవి ముందు  మరమ్మతుల పనులను అధికారులు చేపట్టారు. ఈ పనులన్నింటినీ తామే దక్కించుకునేందుకు ఇప్పటికే అధికార పార్టీ నేతలు పథక రచన సాగించారు. మొత్తం మీద ప్రజల దాహార్తిని కాస్తా తమ కాసుల కక్కుర్తికి అధికార పార్టీ నేతలు ఉపయోగించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top