హాంఫట్!

హాంఫట్! - Sakshi

  • ఇప్పటికే ఎక్కువ శాతం ఆక్రమణ

  •  ఉన్నవాటిపైనా రియల్టర్ల కన్ను

  •  పట్టించుకోని పాలకులు, అధికారులు

  •  ముస్లిం మైనారిటీల ఆందోళన

  • ఇబ్రహీంపట్నం : పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులు, భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. వక్ఫ్‌బోర్డు అధికారులు కూడా సరిగా పట్టించుకోకపోవడంతో మండలంలోని 90 శాతం భూములు కబ్జాకు గురయ్యాయి. 1962వ సంవత్సరంలో వక్ఫ్ గెజిట్‌లో పేర్కొన్న ప్రకారం కొండపల్లి శాంతినగర్‌లోని ముర్తుజా అలీ పంజా కింద ఆర్‌ఎస్ నంబరు 212ఏ, 212బీలలో 18.30 ఎకరాల మాన్యం భూమి, బ్యాంక్ సెంటరులో 293 సర్వే నంబరులో 1,800 చదరపు గజాల భూములు ఉన్నాయి.



    ఈ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. బ్యాంక్ సెంటర్‌లో ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. మసీదు గడ్డ కింద ఆర్‌ఎస్ నంబరు 289లో ఉన్న 15 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కొందరు భవనాలు కూడా నిర్మించుకున్నారు. కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఉన్న బొమ్మలకాలనీలోని పురాతన మసీదును సైతం కొందరు ఆక్రమించుకుని ఏకంగా కాపురం ఉంటున్నారు. ఈ మసీదు కింద ఉన్న భూములను కొందరు ఆక్రమించి నిర్భయంగా విక్రయిస్తున్నారు.

     

    మిగిలిన భూములను ఆక్రమించుకునేందుకు..



    మండలంలోని గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, దొనబండ, దామలూరు, ఈలప్రోలు గ్రామాల్లోనూ వందలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. మసీదులు, శ్మశానాలు, పంజాలు, దర్గాలు, ఖాజీమాన్యం, జాగీర్‌దార్ మాన్యం తదితర ఆస్తులు, భూములను కొందరు పెద్దలు ఆక్రమించారు. మరోవైపు విజయవాడను రాష్ట్ర రాజధానిగా ప్రకటించడంతో మిగిలిన భూములపై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఈ పరిస్థితుల్లో తమ భూములను పరిరక్షించుకునేందుకు అధికార టీడీపీ తరఫున ముస్లిం ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ లేరని, కనీసం మైనారిటీ శాఖకు మంత్రిగా తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నియమించలేదని ముస్లింలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

     

    పంచాయతీ, రెవెన్యూ వర్గాల నిర్లక్ష్యం వల్లే..



    మైనారిటీలకు చెందిన ఆస్తులు, భూములను కాపాడాల్సిన బాధ్యత వక్ఫ్‌బోర్డుపై ఉంది. ప్రభుత్వం 2002 జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 374 ప్రకారం వక్ఫ్ బోర్డు భూములను పర్యవేక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులపై కూడా ఉంది. కానీ, వక్ఫ్ భూములు ఆక్రమించుకున్నవారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొందరు రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి తప్పుడు ఎన్‌వోసీలు ఇస్తున్నారు.



    వాటి సాయంతో సర్వే నంబర్ మార్చుకుని, సమీప డోర్ నంబరు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులకు అన్నీ తెలిసినా మామూళ్లు తీసుకుని ఇళ్లు, ఇతర నిర్మాణానాలకు అనుమతులు ఇస్తున్నారు. పన్నులు కూడా వసూలు చేస్తున్నారు. కబ్జాదారులు అక్రమ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ అధికారులు జారీచేసిన ఎన్‌వోసీలు, పంచాయతీకి పన్నులు చెల్లించిన రశీదులు చూపించి కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.

     

    వక్ఫ్ భూములపై ప్రభుత్వ కన్ను!  

    విజయవాడ కేంద్రంగా నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో భూ సేకరణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని ఖాజీమాన్యం, జాగీర్‌దార్ మాన్యం భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం.

     

     ఆక్రమణదారులకే కొమ్ముకాస్తున్నారు

     కొండపల్లి గ్రామంలో సర్వే నంబర్లు 438/1,  289, 293లలో ఉన్న వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారులు ఆక్రమణదారులకే కొమ్ముకాస్తున్నారు. దీంతో ఆక్రమణదారులకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. వక్ఫ్ చట్టాన్ని కఠినంగా అమలు చేసి కబ్జాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.

      - ఎస్‌ఏ రెహ్మాన్, న్యాయవాది, కొండపల్లి

     

     మైనారిటీ అధికారులు ఆదేశిస్తేనే చర్యలు

     కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి గ్రామాల్లో ఖాజీమాన్యం, వక్ఫ్‌భూములు ఉన్నమాట వాస్తవమే. ఈ భూములు అన్యాక్రాతమైతే ముస్లిం మైనారిటీ అధికారులే ముందుగా స్పందించాలి. ఆక్రమణలపై మైనారిటీ అధికారులు రాత పూర్వకంగా ఉత్తర్వులు అందజేస్తేనే రెవెన్యూ శాఖ తరఫున మేము స్పందింస్తాము. నేను వచ్చిన తర్వాత అటువంటి ఉత్తర్వులేమీ అందలేదు. వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాము.  

     - హరిహర బ్రహ్మాజీ, తహశీల్దార్, ఇబ్రహీంపట్నం

     

     చర్యలు తీసుకుంటున్నాం

     ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యం ఆక్రమించిన 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టించాము. కొండపల్లి శాంతినగర్, బ్యాంక్ సెంటర్, బొమ్మలకాలనీల్లో ఉన్న భూముల ను ఆక్రమించుకుని భవనాలు నిర్మించుకున్నవారిలో కొందరికి నోటీసులు ఇచ్చాము. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. మిగిలిన వారికి కూడా నోటీసులు ఇచ్చి తప్పకుండా భూములను కాపాడటానికి చర్యలు తీసుకుంటాము. 

    - అహ్మద్, వక్ఫ్‌బోర్డు జిల్లా ఇన్‌స్పెక్టర్, విజయవాడ

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top