ఇష్టారాజ్యం


రాజ్యాంగేతర శక్తిగా జన్మభూమి కమిటీలు

 

గ్రామాల్లో హల్‌చల్

పేదలకు పథకాలు అందకుండా అడ్డుకుంటున్న వైనం

ప్రజాప్రతినిధులనూ శాసిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు


 

విజయవాడ : టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తిగా మారాయి. గ్రామాల్లో వీరు చెప్పిందే వేదంగా అధికారులు అమలు చేసే పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగ పరంగా స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ కమిటీల దెబ్బకు దిమ్మతిరిగిపోతున్నారు. తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. ఈ కమిటీల్లో కనీసం ఉన్నత చదువులు చదువుకున్నవారు ఉండాలనే నిబంధన కూడా లేదు. కేవలం అధికార పార్టీకి చెందినవారైతే చాలు. పేరుకు సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులుగా ఉంటారు. వీరు కాకుండా మిగిలిన  ముగ్గురు అధికార పార్టీవారే ఉంటున్నారు. కమిటీలో ఐదుగురు సభ్యులు కాగా, అందులో ముగ్గురు ఆమోదిస్తే దేనికైనా ఆమోదం లభించినట్లే. లేకుంటే ఆ ఫైల్ అక్కడే ఉంటుంది.



పథకం ఏదైనా వీరి అనుమతి తప్పనిసరి...

ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కాలంటే జన్మభూమి కమిటీల ఆమోదం తప్పనిసరి చేశారు. అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జన్మభూమి కమిటీలు సంతకాలు చేస్తేనే ఏదైనా మంజూరు చేస్తారు. దీంతో గ్రామ రాజకీయాలను ఇందులో జోడించి తమకు అనుకూలురైన వారికే వారు సిఫార్సు చేస్తున్నారు. దీంతో మిగిలిన వారికి రుణాలు రావడం లేదు. ఇక ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు ప్రభుత్వ సాయానికే నోచుకోవడం లేదు. సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందాలంటే టీడీపీకి అనుకూలంగా ఉండాలని, తమ పార్టీ జెండా పట్టుకోవాలని జన్మభూమి కమిటీ సభ్యులు తేల్చిచెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది.

 

400 పంచాయతీలకు ఒక్క పేరూ ఇవ్వలేదు...


1994 నుంచి 2014 మధ్య పేదలకు నిర్మించి ఇచ్చిన గృహాల మరమ్మతులకు జిల్లాకు రూ.9 కోట్లు చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఒక్కో గృహానికి మరమ్మతుల కోసం రూ.10 వేలు ఇస్తారు. సాయం ఆయా లబ్ధిదారులకు అందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి అనుమతి లభించాలి. జిల్లాలో అధికార పార్టీ జెండాలు పట్టుకునేందుకు నిరాక రించిన 400 పంచాయతీల నుంచి ఒక్క లబ్ధిదారుని పేరు కూడా జన్మభూమి కమిటీలు ఇవ్వలేదు. గృహ నిర్మాణ శాఖ వారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆయా గ్రామాల్లోని కమిటీలను అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. జన్మభూమి కమిటీల తీరుకు ఇదో ఉదాహరణ. లబ్ధిదారుల పేర్లు ఇచ్చిన పంచాయతీల్లోనూ నిజమైన పేదలకు న్యాయం జరగలేదని సమాచారం.

 

మున్సిపాలిటీల్లో మరింతగా వేధింపులు

 మున్సిపాలిటీల్లో వీరి వేధింపులు మరీ అధికమయ్యాయి. పథకాల పేరుతో పేదలను పీక్కుతింటున్నారు. డబ్బులు ఇస్తేనే సంతకాలు చేస్తామంటున్నారని పేదలు వాపోతున్నారు. కొన్ని వార్డులు, డివిజన్‌లలో తెలుగుదేశం జెండాలు ఇళ్లపై పెడితేనే సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో సాయం రాదని తేల్చి చెబుతున్నారు.

 

 సిగ్గు సిగ్గు...

 ప్రజాప్రతినిధులను, కేంద్ర, రాష్ట్ర చట్టాలను కాదని రూపొందించిన జన్మభూమి కమిటీలు సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ ఏమిటంటే.. విస్సన్నపేట మండలం చెండ్రుపట్ల తండాలో గత డిసెంబర్ ఒకటిన పది ఇళ్లు కాలిపోయాయి. వారంతా పేద ఎస్టీలు. సాధారణంగా ఇళ్లు కాలినవారికి ప్రభుత్వం తక్షణ సాయంతో పాటు ఐఏవై పథకం కింద పక్కా గృహం మంజూరు చేస్తుంది. వీరికి గృహాలు మంజూరు కాకపోవటంతో అధికారుల చుట్టూ తిరిగారు. స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు దృష్టికి తీసుకొచ్చారు. మంజూరు చేస్తామని ఆయనకు అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇళ్లు ఇవ్వలేదు. దీంతో బాధితులు బీజేపీ నేతలతో కలిసి సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అసలు విషయమేమిటంటే వారి ఇళ్లపై టీడీపీ జెండాలు కట్టాలని, అప్పుడే గృహాల మంజూరుకు ఆమోదం తెలుపుతామని జన్మభూమి కమిటీ వారు చెప్పటం. అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ వారు టీడీపీని నిలదీశారంటే జన్మభూమి కమిటీల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీరి తీరు ఎంత శ్రుతిమించిపోతోందంటే.. ఎమ్మెల్యేలు చెప్పినా అధికారులు పనులు చేయటం లేదు. అదేమంటే జన్మభూమి కమిటీ వారు సంతకం చేయకుంటే తామేమీ చేయలేమని చెబుతున్నారు.

 

 టీడీపీలో చేరలేదని ఇల్లు ఇవ్వలేదు

 నేను విజయవాడ 58వ డివిజన్‌లో రాజీవ్‌నగర్ కరకట్టపై ఉంటున్నాను. నా భర్త 2000వ సంవత్సరంలో మృతి చెందాడు. గతంలో సీపీఎంలో ఉన్న నేను ప్రస్తుతం పార్టీలకతీతంగా ఉంటున్నాను. అయితే జన్మభూమి కమిటీ వారు వితంతువుననే సానుభూతి కూడా చూపకుండా టీడీపీలో చేరితేనే నాకు ఇల్లు ఇస్తామంటున్నారు. ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న అనేకమందికి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నిర్మించిన గృహాలు ఇచ్చారు. ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు.

- పి.మణి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top