ఈదురుగాలుల బీభత్సం


* ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

* కూలిన చెట్లు.. హోర్డింగ్‌లు... కరెంటు స్తంభాలు...

* తెగిన కరెంట్ తీగలు... గాడాంధకారంలో వీధులు

* పార్వతీపురం, బొబ్బిలి, ఎస్‌కోటలో కారు చీకట్లు


పార్వతీపురం/బొబ్బిలి/శృంగవరపుకోట: పార్వతీపురం, బొబ్బిలి, శృంగవరపుకోట పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి రోిహణి ఎండలు, ఉక్కబోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయగా... సాయంత్రమయ్యేసరికి ఉన్నట్టుండి కరిమబ్బులు కమ్ముకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈదురు గాలి ఎక్కువైంది.



దానికి ఉరుముల మెరుపులతో కూడిన వర్షం తోడయ్యింది. ఈదురు గాలులకు వీధుల్లో దూళి రేగి, వాహనాలు, రిక్షాలను ఎగరేసుకుపోయింది. పార్కింగ్ వాహనాలను నేల పడేసింది. పట్టణ మెయిన్ రోడ్డులోని పెద్ద పెద్ద హోర్డింగులు, చిన్న చిన్న వ్యాపార షాపుల బోర్డులు గాలికి ఎగిరిపోయాయి. అలాగే పార్వతీపురంలోని కర్షకమహర్షి ఆస్పత్రి ముందున్న తురాయి చెట్టు కూకటి వేళ్లతో కూలిపోయింది. దీని కింద పలు ద్విచక్రవాహనాలున్నాయి. అలాగే సుదర్శన్ షాపీపై ఉన్న హోర్డింగ్ భయాన్ని గొలిపేలా వేలాడుతోంది. అలాగే హోటల్ కిన్నెర సమీపంలో మేడపై ఉన్న సోలార్ ప్లేట్లు ఎగిరి మెయిన్ రోడ్డుపై ముక్క ముక్కలుగా ఎగిరిపడ్డాయి.



అలాగే సిబ్బన్న భవనం సమీపంలోని ఆస్పత్రి హోర్డింగ్‌లు నేలపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలి, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీలో-4, బైపాస్ రోడ్డులో-5 గౌడవీధిలో- 2, సాయిబాబా టెంపుల్ వద్ద 2 పెద్ద స్తంభాలు కూలిపోయి, వైర్లు తెగిపోయినట్లు విద్యుత్‌శాఖ ఏడీ ఎల్ సత్యనారాయణ తెలిపారు. ఇంకా మండలాల్లో పరిస్థితి తెలియరాలేదని, రాత్రికి విద్యుత్ సరఫరా చేయడం ఇబ్బందేనని చెప్పారు. గాలికి కేబుల్స్ కూడా తెగిపోవడంతో నెట్ సేవలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ గాలికి అరకొరగా ఉన్న మామిడి పంట నేలరాలిపోయినట్లు రైతులు వాపోతున్నారు.

 

బొబ్బిలిలో...

బొబ్బిలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌వద్ద చెట్టుకూలి ప్రహరీ ధ్వంసమైంది. పార్వతీపురం రోడ్డులో విద్యుత్ హైటెన్షన్ వైర్లపై చెట్టుకూలింది. దీనితో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న చెట్టు కొమ్మ విరగడంతో తె ర్లాం మండలం కూనాయవలస గ్రామ మాజీ సర్పంచ్ కర్రి  ప్రభాకరరావుకు చెందిన కారు ధ్వంసమైంది.. కొమ్మ కారు ముందు భాగంపై పడగానే డ్రైవరు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది.. పట్టణంలోని పలు హోర్డింగులు ఈ గాలులకు నేలకొరిగాయి.



తారకరామాకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో చెట్టు కూలాయి.. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం ముందుకు కదలలేని విధంగా బలమైన గాలులు వీయడంతో ద్విచక్ర వాహనాలు, కార్లలోప్రయాణించే వారు ఇబ్బందులు పడ్డారు. రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లో కూడా గాలులు బీభ త్సం సృష్టించాయి. ఎలక్ట్రికల్ డీఈ మాసిలామణి సబ్‌స్టేషన్లను, తెగిన విద్యుత్ తీగలను పరిశీలించారు.

 

అరగంట గాలితో అతలాకుతలం

శృంగవరపుకోటలో శుక్రవారం రాత్రి 7.30గంటలకు ఆరంభమైన గాలులు సుమారు 20నిమిషాలు కలవర పెట్టాయి. హుద్‌హుద్ బీభత్సాన్ని జ్ఞాపకం చేశాయి. బలమైన ఈదురు గాలుల తాకిడికి పట్టణంలో పలు దుకాణాలపై బోర్డులు, హోర్డింగ్‌లు, కటౌట్‌లు నేలకూలాయి, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. మారిన వాతావరణంతో జనం ఒక్కసారిగా  ఇళ్లలోకి పరుగులు తీశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top