భూముల ధరల్లో గ్రోత్


 బొబ్బిలి : బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో రూ. 840లున్న స్వ్కేర్ మీటరు ధర రూ. 950లకు పెంచారు. దీనికి సంబంధించి ఏపీఐఐసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బొబ్బిలిలో 1996లో 1,150 ఎకరాల విస్తీర్ణంలో గ్రోత్‌సెంటర్ ప్రారంభించారు. ఫేజ్-1, ఫేజ్-2ల్లో దాదాపు 850 ఎకరాల్లో ప్లాట్లు వేసి పరిశ్ర మలకు కేటాయించారు. స్థలాలకు డిమాండ్ పెరుగుతున్నప్పుడల్లా ఏపీఐఐసీ అధికారులు ధరలు పెంచుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇక్కడ ధరలు పెంచడం ఇదే మొదటి సారి.

 

 భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో కూడా ధరలు పెంచాలని నిర్ణయించి నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నిలిపివేశారు. భూముల ధరలను పెంచుతూ ఉత్తర్వులు వెలువడగానే ఆన్‌లైన్‌ను కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతం బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో 51 ప్లాట్లు పారిశ్రామికవేత్తల కోసం ఖాళీగా ఉన్నాయి. దాదాపు 76.42 ఎకరాల విస్తీర్ణంలో ఖాళీ భూములున్నాయి.

 

 ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల కోసం గతంలో కేటాయించిన స్థలాలు తీసుకోవడానికి ఆయా వర్గాలు ముందుకు రాకపోవడంతో వాటిని కూడా జనరల్ కేటగిరీ మార్చారు. జిల్లాలోని కంటకాపల్లి ఏపీఐఐసీ భూముల ధర ప్రస్తుతం స్క్వేర్ మీటరు రూ. 350 లుంది. అక్కడ 19 ఎకరాల స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. నెల్లిమర్లలో స్క్వేర్ మీటరు ధర రూ. 1120లుంది. అక్కడ 1500 స్క్వేర్‌మీటర్ల ఏకండీ ప్లాట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే విజయనగరంలోని పరిశ్రమల వాడలో స్క్వేర్ మీటరు ధర రూ. 3360లుంది.

 

 మరో రెండు పారిశ్రామికవాడలు

 ప్రస్తుతం జిల్లాలో ఉన్న నాలుగు పారిశ్రామికవాడలు కాకుండా మరో రెండు కొత్తగా రానున్నాయి.. గజపతినగరం సమీపంలో మరుపల్లి వద్ద 80 ఎకరాల్లో ఫుడ్ పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబందించి స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. మరో నెల రోజుల్లో ఏపీఐఐసీ చేతికి ఆయా భూములు రానున్నాయి. రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద 187 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటు చేయనున్నారు.. దీని కోసం ఇప్పటికే స్థలాలను కేటాయించేశారు.

 

 బీసీలకూ రాయితీ కల్పన

 పరిశ్రమల కేటాయింపులో బీసీలకు కూడా రాయితీలు కల్పిస్తూ ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం రాయితీ ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి బీసీలను కూడా చేర్చింది. 33 శాతం రాయితీని 50 శాతానికి పెంచింది. 50 శాతంగానీ, రెండు లక్షల రూపాయల వరకూ గానీ రాయితీని కల్పించనున్నారు.

 

 లీజుకు చెల్లుచీటీ...

 ఏపీఐఐసీలో ఇప్పటివరకూ లీజు పద్ధతిలోనే భూములు కేటాయించేవారు. ఇకపై డెరైక్టు అమ్మకాలకు తెర తీశారు. ఇప్పటివరకూ స్థలానికి దరఖాస్తు చేసుకున్న వారికి స్థలాన్ని కేటాయిస్తే దానిని అభివృద్ధిచేశాకతరువాత పదేళ్లకు వారి పేరు సేల్ డీడ్ జరిగేది. భూములు కేటాయించిన రెండేళ్ల వరకూ నిర్మాణాలకు అవకాశం కల్పించి, ఆ తరువాత ఎనిమిదేళ్ల పాటు దానిని నిర్వహిస్తే అప్పుడు సేల్ డీడ్ రాసేవారు. ఆ తరువాత 99 ఏళ్లకు పూర్తిగా లీజ్‌కు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు తక్షణమే సేల్ చేసే పద్దతికి శ్రీకారం చుట్టారు.

 

 ప్రభుత్వ భూములుగా నమోదు

 బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని దాదాపు మూడువందల ఎకరాల భూములు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదవ్వడంతో రిజిష్ట్రేషన్లకు అభ్యంతరాలొస్తున్నాయి. ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వ్యాపారవేత్తలు రిజిష్ట్రేషనుకు వెళ్లే సరికి సబ్ రిజిస్ట్రార్ పుస్తకాల్లో అవి ప్రభుత్వ భూములుగా రెవెన్యూ అధికారులు చూపించారు. గతంలోనూ ఇలాంటి సమస్య ఉంటే ఏపీఐఐసీ అధికారులు పరిష్కరించారు. ఇప్పుడు అదే సమస్య ఉత్పన్నమవ్వడంతో వ్యాపారవేత్తలు ఆవేదన చెందుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top