‘గ్రిడ్’కు నీటిపారుదలశాఖ గ్రీన్‌సిగ్నల్


  • మంత్రి కేటీఆర్ వెల్లడి

  •  అటవీశాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశం

  •  27నుంచి జిల్లాల్లో పర్యటనలు

  • సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు నీటి పారుదల శాఖ నుంచి రావాల్సిన అన్ని అనుమతులు ఇప్పటి కే లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. అటవీశాఖ నుంచి రావాల్సిన అనుమతుల కోసం అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. వాట ర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వివిధ జిల్లాల్లో జరు గుతున్న ఏర్పాట్లను ఆదివారం ఆయన ఆర్‌డబ్ల్యుఎస్ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వాటర్‌గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఈ నెల 27 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈనెల 27న మహబూబ్‌నగర్, 28న వరంగల్, 29న ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తానన్నారు.

     

    సమాచారంతో సిద్ధంగా ఉండాలి...




    ఆయా జిల్లాల్లో తాను పర్యటనకు వచ్చేసరికి అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన గ్రిడ్ ప్రణాళికలపై ఆయా జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇంటేక్‌వెల్స్, పూర్తి స్థాయిలో పైప్‌లైన్ పరిమాణం, ఏయే వనరుల నుంచి ఎంత నీటిని సేకరించాలనుకుంటున్నారు... వంటి వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పొందుపర్చాలన్నారు.



    జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వివిధ వనరుల నుంచి నీళ్లిచ్చేందుకు అవసరమైన పైప్‌లైన్ నిర్మాణాలు, ఎక్కడెక్కడ నీటి నిల్వ ట్యాంకులు చేపట్టేది.. తదితర అంశాలను సవివరంగా తెలపాలన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు కోరినపుడు పూర్తిస్థాయిలో సమాచారం అందించేలా వాటర్‌గ్రిడ్ పర్యవేక్షక అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. వాటర్‌గ్రిడ్ లైన్‌సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.

     

    ఫిబ్రవరి 10కల్లా పైలాన్!



    నల్లగొండ జిల్లాలో నిర్మిస్తున్న వాటర్‌గ్రిడ్ పైలాన్ ఫిబ్రవరి 10కల్లా పూర్తి కానుందని, ముఖ్యమంత్రి దానిని ఆవిష్కరిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేవలం పర్యటనలే కాకుండా, ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తానన్నారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. ఆర్‌డబ్ల్యుఎస్ విభాగం పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, రెండ్రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 9 సర్కిళ్లను 16కు, 20 డివిజన్లను 46కు, 92 సబ్ డివిజన్లను 168కి పెంచనున్నట్లు మంత్రి వివరించారు. వాటర్‌గ్రిడ్ నిమిత్తం ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పోస్టులను కూడా వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top