రక్కసులకే రక్షాకవచం!

రక్కసులకే రక్షాకవచం!


సాక్షి ప్రతినిధి, కాకినాడ :సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చిత్రహింసలకు గురిచేసి వారం రోజులు గడి చాయి. ప్రిన్సిపాల్, కరస్పాండెంట్‌లు విద్యార్థులైన పాముల సురేంద్రవర్మ, పులస సాయి, కూర్తి జాన్సన్‌లను చితకబాదిన  దారుణాన్ని ‘సాక్షి’ మీడియా కళ్లకు కట్టినట్టు ప్రసారం చేయడంతో మానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక వంటి సంస్థలు స్పందించాయి. ఘటన వెలుగు చూడగానే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు స్పందించిన తీరు చూసి బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తారన్న అభిప్రాయం కలిగింది. తీరా వారం గడిచేసరికి అధికారపార్టీ నేతలు, పోలీసులు, వైద్యులు...ఇలా ఎవరి స్థాయిలో వారు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

 

 నిందితులైన కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌లపై నమోదు చేసిన సెక్షన్‌లు పోలీసులు నిందితుల కొమ్ము కాస్తున్నారనే విషయాన్ని ఆదిలోనే స్పష్టం చేశాయి. వారిపై ఐపీసీ 324 సెక్షన్ ప్రకారం కేసు నమోదుచేసి, కాకినాడ నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో రికార్డును పరిశీలించిన న్యాయమూర్తి రామలింగారెడ్డి పోలీసులు నమోదుచేసిన సెక్షన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమోటోగా కేసును ఐపీసీ 325 సెక్షన్‌కు మార్చి, నిందితులకు రిమాండ్‌కు విధించారు. ఇది జరిగిన వారం రోజుల తరువాత గ్రీన్‌ఫీల్డ్ చైర్మన్, టీడీపీ నాయకుడు బెజవాడ వీరవెంకట సత్యనారాయణపై తాపీగా బుధవారం కేసు నమోదుచేశారు. మాట వినకుంటే కొట్టయినా దారికి తెచ్చుకోవాలన్న చైర్మన్ సూచననే అమలు చేశామని ఎ-1, ఎ-2 నిందితులు  కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ల సమాచారం మేరకే బెజవాడపై కేసు నమోదుచేశారు.

 

 అయితే ప్రధాన నిందితులపై బెయిల్‌కు అనుకూలమైన సెక్షన్ కింద కేసు నమోదు చేసినందుకు న్యాయమూర్తి తప్పుపట్టి సెక్షన్ మార్చినా పోలీసుల తీరు అణుమాత్రం మారలేదు. మూడో నిందితుడు బెజవాడపై కూడా నిస్సంకోచంగా 324 సెక్షన్ కిందే నమోదు చేశారు. బెజవాడను నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా అసహనం వ్యక్తంచేసిన న్యాయమూర్తి ‘324 సెక్షన్‌కు మీరే బెయిల్ ఇచ్చుకునే అవకాశం ఉంది గనుక స్టేషన్ బెయిల్ ఇచ్చుకోం’డని వెనక్కి పంపించడం గమనార్హం. పోలీసులు బెజవాడకు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి సాగనంపేశారు. దీనంతటి వెనుక అధికారపార్టీ పెద్దల హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 ఇంతటి దురంతంపై ఎంఎల్‌సీయే లేదు..

 ప్రభుత్వ వైద్యులు కూడా ఈ కేసును బలహీనపరిచే రీతిలోనే వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ల కర్కశత్వానికి రక్తపు గాయాలైన ముగ్గురు అంధ విద్యార్థులను కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి ఐదురోజులు చికిత్స చేశారు. తేలో, జెర్రో కుట్టినా, స్వల్ప కొట్లాటల్లో గాయపడ్డా మెడికో లీగల్ కేసులు (ఎంఎల్‌సీ) నమోదు చేసే జీజీహెచ్ వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై ఎంఎల్‌సీ నమోదు చేయకపోవడం ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది.

 

 కేవలం యాక్సిడెంట్ రిజిస్టర్(ఏఆర్)లో మాత్రమే నమోదు చేసి బాధిత విద్యార్థులకు చికిత్స చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గాయాల తీవ్రతను ధృవీకరించే ‘ఊండ్ సర్టిఫికెట్’లో కూడా స్వల్ప గాయాలుగానే తేల్చేసినట్టు సమాచారం. బాధిత విద్యార్థులకు అయిన రక్తపు గాయాల కంటే మానసికంగా వారు అనుభవించిన వేదనను మానవతా కోణంలో చూడకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కాగా ఎంఎల్‌సీ నమోదు చేయని విషయమై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధను సంప్రదించగా ఈ కేసును తాను పూర్తిగా పరిశీలించలేదన్నారు. అయితే ఏఆర్‌గా నమోదు చేసినా తరువాత ఎంఎల్‌సీగా మార్చుకునే అవకాశం ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top