పచ్చ‘ధనం’ మాయం

పచ్చ‘ధనం’  మాయం


రికార్డులు దాటని పచ్చదనం

 వన మహోత్సవాల పేరుతో నిధుల దుర్వినియోగం

 నర్సరీల స్థాయిలో మాయాజాలం

 లెక్కలు తేల్చలేని అక్రమాల గుట్టు

 మూడేళ్లలో రూ.13 కోట్లు మట్టి పాలు


 ఆకాశంలో చుక్కలు ఎన్నంటే ఎలా చెప్పగలం. సామాజిక అటవీశాఖలో నాటుతున్న మొక్కల లెక్కలూ అంతే.

 వన మహోత్సవాలు వస్తే చాలు... ఆ శాఖకు కాసులు కురిసినట్టే. మొక్కలు నాటేస్తున్నట్టు రికార్డుల్లో చూపుతారు. లెక్కలకందని గారడీ చేస్తారు.

 ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందే తడవు... ప్రణాళికలు రూపొందిస్తారు. లక్షల రూపాయలతో ప్రతిపాదనలు చేస్తారు.

 నిధులు మంజూరు కాగానే... ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. వారినీ... వీరినీ... పిలుస్తారు. ఫొటోలతో అదరగొడతారు. ప్రచారం చేపట్టేస్తారు. రికార్డుల్లో నిధుల ఖర్చు చూపిస్తారు. నెల తిరిగేసరికి అక్కడి మొక్కలు కనిపించవు.

 మళ్లీ వనమహోత్సవం వస్తే అదే తంతు...

 

 ఈ సారీ కాసుల పంటే...

 వీరఘట్టం/పాలకొండ:పచ్చని ఆశయానికి తూట్లు పడుతున్నాయి. మొక్కల పెంపకం మాటున నిధులు భారీగానే దుర్వినియోగమవుతున్నాయి. ఎంచుకున్న లక్ష్యం ఘనమే... క్షేత్రస్థాయిలో మాత్రం

 

 

 అది నీరుగారిపోతుంది. రికార్డుల్లో పచ్చదనం పరచుకున్నా... వాస్తవంగా ఆ జాడలే కానరావు. మొక్కలకు లెక్కగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం ... తనిఖీలకు సున్నా చుట్టేయడంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకపోయింది. గత మూడేళ్లలో రూ.13 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కాని ఒక్క మొక్కా అక్కడ కానరాకపోవడమే ఆ నిధులు ఎంతగా దుర్వినియోగమయ్యాయనడానికి నిదర్శనం.

 

 ఉపాధిలో రూ. 12.50కోట్లు మట్టిపాలు

 గత రెండేళ్లలో ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ పచ్చ తోరణం కార్యక్రమం కింద 2.50 లక్షల మొక్కలు నాటారు. ఇందుకు రూ. 10.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా 2 లక్షల మొక్కలు నాటారు. రూ.2 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మొక్కలు నాటిన దాఖలాలు ఎక్కడా కానరావడం లేదు. అక్కడక్కడ నాటిన మొక్కలు రక్షణలేక మట్టి పాలయ్యాయి.

 వనమహోత్సవాల్లో అయితే...

 

 గతేడాది వనమహోత్సవం పేరిట జిల్లా వ్యాప్తంగా 50 వేల మొక్కలు నాటామని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభిస్తున్నారే తప్ప తర్వాత ఆల నా పాలన లేక మొక్క దశలోనే మోడువారిపోతున్నాయి. నర్సరీల పేరిట మొక్కలు పెంచుతున్న విషయం రికార్డులకే పరిమితం. ఇప్పుడేమో ప్రభుత్వం కార్తీక వనమహోత్సవం పేరిట లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ. 35 లక్షలతో మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో కోట్లు కుమ్మరించి నాటిన మొక్కలకే అతీగతీలేదు. ఇప్పుడు కార్తీక వనమహోత్సవం పేరిట మరోసారి నిధులు కాజేసేందు అవకాశం వచ్చినట్టేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.



 పక్కాగా అమలు చేస్తాం: అధికారులు

 ఈసారి కార్తీక వనమహోత్సవాన్ని పక్కాగా నిర్వహిస్తామని సోషల్ పారెస్ట్ జిల్లా అధికారి షేక్‌సలామ్ సాక్షికి తెలిపారు. లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టి వాటి పరిరక్షణకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

 

 ఇది పాలకొండ

 మండల పరిషత్ కార్యాలయ ఆవరణ. గతేడాది ఇక్కడే మొక్కలు నాటారు. ఫొటోలు తీసుకున్నారు. పత్రికల్లో ప్రచురింపజేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇదీ పచ్చదనంపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top