మూగజీవాలకు మేత కరువు

మూగజీవాలకు మేత కరువు - Sakshi


► కరువు దెబ్బకు అల్లాడుతున్న పశువులు

► జిల్లాలో తగ్గిన పాల ఉత్పత్తి




సాక్షి ప్రతినిధి – నెల్లూరు : జిల్లాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం కారణంగా  మూగ జీవాలకు మేత, నీటి సమస్య ఏర్పడింది. వర్షాలు కురవక పోవడంతో గడ్డి కొరత ఏర్పడింది. దీంతో రైతులు పశువులను పోషించలేక కబేళాలకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అరకొర సహాయక చర్యలు రైతుల్లో ధైర్యం నింపలేక పోతున్నాయి. దీంతో రెండు నెలలుగా జిల్లాలో పాల దిగుబడి సైతం గణనీయంగా తగ్గింది.



మూడేళ్లుగా జిల్లాలో తిష్ట వేసిన కరువు ఈ సారి తన ఉగ్ర రూపం చూపింది. జిల్లాలో దాదాపు 70 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. దీంతో జలాశయాల్లో నీరు అడుగంటడంతో పాటు, జిల్లాలోని చెరువులన్నీ నీళ్లు లేక బీటలు వారాయి. రైతులు ఖరీఫ్‌కు సెలవు ప్రకటించారు. కరువు పరిస్థితుల్లో పాడిని నమ్ముకుని బతుకు సాగించే పాడి రైతులు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 1,17,966 ఆవులు ఉండగా, ఇందులో 54,505 ఆవులు పాలు ఇస్తున్నాయి.



6,24,654 గేదెలు ఉంటే, ఇందులో 2,93,587 గేదెలు పాలు ఉత్పత్తి చేస్తూ రైతులను ఆదుకుంటున్నాయి. రోజుకు సరాసరి 2 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. అయితే కరువు కారణంగా మేత, నీరు లేక పోవడంతో రెండు నెలలుగా 25 శాతం దాకా పాల ఉత్పత్తి తగ్గి పోయింది. తగ్గిన పాల దిగుబడి పెంచుకోవడం కోసం పశుసంవర్ధక శాఖ జిల్లాకు 728 సూటు గేదెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.  రూ.60 వేల విలువయ్యే ఈ గేదెను రూ.15 వేలకే రైతులకు అందించనున్నారు.



కరువు మండలాల్లో పశువులను రక్షించుకోవడం కోసం పశుసంవర్ధక శాఖ సబ్సిడీ మీద 2వేల మెట్రిక్‌ టన్నుల దాణా, 1000 మెట్రిక్‌ టన్నుల సమీకృత దాణా,  500 టన్నుల పాతర గడ్డి సరఫరా చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో పాటు ప్రతి పంచాయతీలో పశువుల కోసం రెండు నీటి తొట్టెలు నిర్మించి అందులో నీరు నింపేలా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రామాల్లో ప్రజలు తాగడానికే  నీరు లేక పోతే ఇక పశువులకు ఎక్కడి నుంచి తెచ్చి పోయాలని, పశువుల కోసం నిర్మించే తొట్లలో  ప్రభుత్వమే తాగునీటిని నింపేలా ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top