చాక్‌పీస్‌కు దిక్కులేదు

చాక్‌పీస్‌కు దిక్కులేదు - Sakshi

► ఏది కొనాలన్నా కష్టమే! 

► పాఠశాలలకు విడుదల కాని గ్రాంటు

► ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బందులు 

 

పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. విద్యార్థులకు గుణాత్మక విద్యనందిస్తాం. అందరూ ప్రభుత్వ పాఠ«శాలల్లో చేరండని ప్రభుత్వం ఆర్భాటాలు చేసింది. అయితే  వీటి నిర్వహణకు సంబంధించిన నిధులను ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పాఠశాలలు పునఃప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

 

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం ఇటీవల బడిపిలుస్తోంది, అమ్మఒడి వంటి  కార్యక్రమాల కోసం రూ. లక్షలు నిధులు వెచ్చించి ప్రచారం నిర్వహించింది. కానీ పాఠశాలల్లో సౌకర్యాల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. పిల్లలకు పాఠ్యాంశాలను బోర్డులపై రాసి చూపించా లంటే చాక్‌పీస్‌ కావాలి.వీటిని కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేవని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు లబోది బోమంటున్నారు.



స్కూళ్లు తెరవగానే నిధులు మంజూరు చేస్తే ఇబ్బందులు ఉండవని అయ్యవార్లు అంటున్నారు. ప్రభుత్వం స్పందించేదెప్పుడో.. నిధులు మంజూరు చేసేదెన్నడో అని పలువురు చర్చించుకుంటున్నారు.  జిల్లాలో 2578 ప్రాథమిక, 295 ప్రాథమికోన్నత,  375 జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి రెండు లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 



గ్రాంట్‌ వివరాలు : ప్రభుత్వం ప్రతి ఏటా  పాఠశాలల నిర్వహణకు గ్రాంటును మంజూరు చేస్తుంది. స్కూల్‌ గ్రాంటు, ఎమ్మార్సీ, టీచర్‌ గ్రాంటు విడుదల చేస్తుంది. ఇందులో ప్రాథమిక పాఠశాలలకు పాఠశాల గ్రాంట్‌ కింద రూ. 5 వేలు, అప్పర్‌ప్రైమరీ స్కూళ్లకు రూ. 12 వేలు, జెడ్పీకి రూ. 7 వేల చొప్పున ఇస్తుంది.  ఎమ్మార్సీ గ్రాంటు కింద ప్రతి ఏమ్మార్సీకి రూ. 80 వేల చొప్పున,   టీచర్‌ గ్రాంటు కింద ప్రతి టీచర్‌కు రూ 5 వందల చొప్పున  ఇస్తుంది. చాక్‌పీసులు, పుస్తకాలు, దినపత్రికల కొనుగోలుకు, పాఠశాలల్లో  కరెంటు బిల్లులు,   చిన్నచిన్న మర మ్మతుల కోసం ఈ నిధులు ఖర్చు చేయవచ్చు. ప్రçస్తుతం డబ్బులు రాకపోవడంతో పనులన్నీ ఆగిపోయాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 

 

నిధులు వచ్చాయి..పంచడం లేదు

పాఠశాల నిర్వహణకు సంబంధించిన గ్రాంటును  ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏకి రెండు రోజుల కిందట విడుదల చేసినట్లు తెలిసింది. కానీ సంబంధిత గ్రాంటును మాత్రం ప్రస్తుత ఉపాధ్యాయుల బదిలీలు అయ్యేవరకూ పాఠశాలలకు ఇవ్వద్దని ఎస్పీడీ కార్యాలయం అనధికారికంగా లింక్‌ పెట్టినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల బదిలీలు అయ్యేవరకూ అయ్యవార్లు నిధుల కోసం ఎదురుచాడాల్సిందే.

 

నిధులు త్వరలో జమ చేస్తాం

పాఠశాలలకు సంబంధించిన గ్రాంటు త్వరలో ఆయా ఖాతాల్లో జమచేస్తాం.  నిబంధనల మేరకు మాత్రమే నిధులు ఖర్చుచేయాల్సి ఉంటుంది.  – పొన్నతోట శైలజ, ఎస్‌ఎస్‌ఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top