ఘనంగా ఎన్‌సీసీ డే వేడుకలు

ఘనంగా ఎన్‌సీసీ డే వేడుకలు


విశాఖపట్నం: క్రమశిక్షణతో కెరీర్  ఏర్పరుచుకునేందుకు ఎన్‌సీసీ తోడ్పడుతుందని విశాఖ ఎన్‌సీసీ గ్రూప్ కమాండెంట్ వి.వి.ఎస్.రాజు తెలిపారు. ఎన్‌సీసీ డేను పురస్కరించుకుని ఏయూ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తుపాను అనంతరం సామాజిక బాధ్యతగా క్యాడెట్లు సహాయక చర్యల్లో పాల్గొనడాన్ని  అభినందించారు. దేశభక్తి, నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవడానికి విద్యార్థి దశలో ఎన్‌సీసీ ఎంతో ఉపయుక్తమన్నారు.



తొలుత విశాఖ గ్రూప్ పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలు ఎన్‌సీసీ యూనిట్లకు చెందిన నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ డివిజన్, వింగ్‌లకు చెందిన క్యాడెట్లు మొక్కల్ని పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. గ్రూప్ కమాండర్ రాజు ఏయూ గ్రౌండ్స్‌లో మొక్కలు నాటారు. క్యాడెట్లు గ్రౌండ్ నుంచి సాగర తీరం వరకు ర్యాలీ నిర్వహించి మొక్కల్ని నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని నినదించారు. ఈ సందర్భంగా బెస్ట్‌లుగా ఎంపికైన పలువురు క్యాడెట్లను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు యూనిట్ల అధికారులు రాజేంద్ర, గుహరాయ్, భరద్వాజ్, సుహిత్, నెహ్రా, జేమ్స్, ట్రైనింగ్ ఆఫీసర్ ఎస్.కె.దా, యూనిట్ల కమాండింగ్ అధికారులు, ఏఎన్‌ఓలు పాల్గొన్నారు.

 

బెస్ట్‌లు వీరే : బెస్ట్ ఏఎన్‌ఓగా కె.సదాశివరావు ఎంపిక కాగా, సీనియర్ డివిజన్‌లో మహ్మద్ అబ్దుల్, సీనియర్ వింగ్‌లో బి.సాయి సుప్రజ, జూనియర్ డివిజన్‌లో జి.వి.రమణ, జూనియర్ వింగ్‌లో డి.జానకి బెస్ట్ క్యాడెట్లుగా నిలిచారు. పీఐ స్టాఫ్ వినోద్‌కుమార్, సివిలియన్ స్టాఫ్ సత్యనారాయణ గ్రూప్ స్థాయిలో బెస్ట్‌గా అభినందనలు అందుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top