చదువు సాగేదెలా?


► విద్యా సంవత్సరం ప్రారంభమైనా జిల్లాకు చేరని పాఠ్య పుస్తకాలు

► 16 లక్షలు అవసరం కాగా 13 లక్షలకే నివేదిక

► 11 లక్షల పుస్తకాలనే మంజూరు చేసిన ప్రభుత్వం

► పాఠశాలల పునఃప్రారంభం నాటికి పుస్తకాల సరఫరా అనుమానమే


శ్రీకాకుళం: ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాల కొరత తప్పేలా లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు ఒక్క పాఠ్య పుస్తకం కూడా జిల్లాకు చేరకపోవడమే ఈ పరిస్థితికి కారణం. దీంతో చదువు సాగేదెలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది నుంచి సీసీఈ విధానం అమలు చేయడంతో మార్చి నెలలోనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనవిషయం విదితమే.


విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం సరఫరాపై దృష్టిపెట్టిన పాపాన పోలేదు. వాస్తవంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్‌ నెల నుంచే పుస్తకాల సరఫరా ప్రారంభమవుతుంది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఏప్రిల్‌ మాసాంతం అవుతున్నా ఒక్క పుస్తకం కూడా జిల్లాకు రాలేదు. ఈ కారణంగా వేసవి సెలవుల తరువాత పాఠశాలల పునఃప్రారంభ సమయానికి కూడా పూర్తిస్థాయిలో పుస్తకాలు విద్యార్థులకు అందుతావని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.


డిసెంబర్‌ నెల నుంచే పుస్తకాలు సరఫరా ప్రారంభమైనప్పటికీ పాఠశాలల పునఃప్రారంభం రోజుకు పూర్తిస్థాయిలో  అందేవి కావు. అటువంటప్పుడు ఈ ఏడాది కూడా విద్యార్థులకు  పుస్తకాలు అందవని ఉపాధ్యాయ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 16 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని డైస్‌ లెక్కలు చెబుతున్నాయి. అయితే విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా 13 లక్షలే అవసరమని నివేదించారు. దీంతో విద్యార్థులందరికీ ఎలా పాఠ్య పుస్తకాలు అందివ్వగలమని సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటుండగా.. రాష్ట్ర అధికారులు మరో బాంబును పేల్చారు.


శ్రీకాకుళం జిల్లాకు 11 లక్షల పాఠ్య పుస్తకాలను మంజూరు చేస్తున్నట్లు మంగళవారం రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశంలో ప్రకటించడంతో జిల్లా అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 13 లక్షలు అవసరమైనప్పుడు 11 లక్షలు మంజూరు చేస్తే ఎలా అని అధికారులు ప్రశ్నించినప్పుడు.. మీ దగ్గర లక్షకు పైగా నిల్వ ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయని సమాధానం చెప్పడంతో అధికారులు నివ్వెర పోవాల్సి వచ్చింది. గడిచిన మూడేళ్లుగా పాఠ్య పుస్తకాలు మారుతూ వచ్చాయి. అంతకుముందు కొన్ని పుస్తకాలు నిల్వ ఉండడం వాస్తవమేనని, మారిన పుస్తకాలను నిల్వగా చూపించడం సరికాదని చెప్పినప్పటికీ రాష్ట్ర అధికారులు వినిపించుకోనట్లు తెలిసింది. జిల్లా అధికారుల తప్పిదంతో మూడు లక్షల పాఠ్య పుస్తకాలు తక్కువగా నివేదించగా రాష్ట్ర అధికారులు రెండు లక్షలు కోత విధించడంతో ఏం చేయాలో తెలియక విద్యాశాఖాధికారులు అయోమయానికి గురవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top